Twitter: ట్విటర్‌కు సమన్లు..!

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఐటీ నిబంధనల అములుపై ట్విటర్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ వీటిని జారీ చేసింది. పార్లమెంట్‌కాంప్లెక్స్‌లో జూన్‌ 18వ

Published : 15 Jun 2021 13:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఐటీ నిబంధనల అమలుపై ట్విటర్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ వీటిని జారీ చేసింది. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో జూన్‌ 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగే విచారణకు హాజరుకావాలని పేర్కొంది. సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ వార్తా సమాచార దుర్వినియోగాన్ని ఎలా అడ్డుకోవాలన్న అంశంపై ట్విటర్‌ ప్రతినిధి ప్రణాళికతో రావాలని కమిటీ తెలిపింది. ‘‘సోషల్‌ మీడియా దుర్వినియోగాన్ని అడ్డుకొని డిజిటల్‌ స్పేస్‌లో మహిళల భద్రతకు రక్షణ కల్పించే అంశంపై ట్విటర్‌ ప్రతినిధి ఉద్దేశాలను తెలుసుకొంటాం’’ అని పార్లమెంటరీ కమిటీ అజెండా పేర్కొంది.

నూతన ఐటీ నిబంధనలను తక్షణమే అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌కు కొన్నాళ్ల క్రితం తుది నోటీసులు ఇచ్చింది. వీటిని అమలు చేయకపోతే ఐటీ చట్టం కింద లభించే మినహాయింపులను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. నిబంధనల అమలులో ట్విటర్‌ వ్యవహారం సరిగ్గా లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీశాఖ వ్యాఖ్యానించింది. గడువు ఇచ్చినప్పటికీ.. నిబంధనలను పాటించడంలో అలసత్వం వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో ట్విటర్‌ స్పందించింది. ‘‘భారత్‌ చట్టాల అమలుకు ట్విటర్‌ కట్టుబడి ఉంది. ప్రభుత్వం చెప్పిన నిబంధనలు అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తాం. ఈ క్రమంలో పురోగతని సమయానికి తెలియజేస్తాం. భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు జరుపుతాం’’ అని ట్విటర్‌ పేర్కొంది.

నూతన నిబంధనల కింద ఆయా సంస్థలు చీఫ్‌ కాంప్లియన్స్‌ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉండగా.. ట్విటర్‌ ఇంకా దానిపై నిర్ణయం తీసుకోలేదు. అంతేగాక, రూల్స్‌ ప్రకారం.. రెసిడెంట్ గ్రీవెన్స్‌ ఆఫీస్‌, నోడల్‌ కాంటాక్ట్‌ అధికారులను భారత్‌కు చెందిన వ్యక్తులను నియమించకపోవడంతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినా వీటిని పాటించేందుకు విముఖత చూపిస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తుది హెచ్చరిక జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని