ఖాళీ స్థ‌లం ర‌క్ష‌ణ‌కు పాల‌సీ?

ఖాళీ స్థ‌లం ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురికాకుండా ర‌క్ష‌ణ‌గా ఉండేలా ఏవైనా పాల‌సీలు అందుబాటులో ఉన్నాయా తెలుసుకుందాం.

Published : 20 Dec 2020 13:18 IST

విజ‌య్ ఉద్యోగ‌రీత్యా అమెరికాలో ఉంటాడు. ఆయ‌న పేరుతో స్థానికంగా వ‌రంగ‌ల్ జిల్లాలోని స్వ‌గ్రామంలో కొంత భూమి ఉంది. అయితే దానికి ఎటువంటి గోడ లేదా ర‌క్ష‌ణగా కంచెను ఏర్పాటు చేసుకోలేదు. ఇక్క‌డికి వ‌చ్చి ఆ ఏర్పాట్లు చేసుకునేందుకు స‌మ‌యం దొర‌క‌డం లేదు. పోనీ ఎవ‌రికైనా ఆ ప‌ని చేసి పెట్ట‌మ‌ని చెబుదామంటే వారికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచిస్తున్నాడు. అదీ కాక వాళ్లు మాత్రం ఎంత కాల‌మ‌ని కాపాడ‌గ‌ల‌రు.

ఆ ఖాళీ స్థ‌లం ప‌క్క‌నే ఓ పెద్ద అపార్టుమెంటు వెలుస్తుంద‌ని విన్నాడు. ఇదే అవ‌కాశంగా భావించి ఎవ‌రైనా ఆ స్థ‌లాన్ని ఆక్ర‌మిస్తారేమోన‌ని అత‌డికి భ‌యం ప‌ట్టుకుంది. ఇలా ఖాళీ స్థ‌లం ఆక్ర‌మ‌ణ‌కు గురికాకుండా బీమా పాల‌సీలున్నాయా అని ఆయ‌న‌కు సందేహం క‌లిగింది.

అలాంటి పాల‌సీ కొనుగోలుకు వెన‌కాడ‌రు

అవును నిజ‌మే! ఖాళీ భూమి ఉన్న‌వారు క‌చ్చితంగా దాని ర‌క్ష‌ణ గురించి ఎక్కువ‌గా ఆలోచిస్తారు. పాల‌సీ కొనుగోలు చేసేందుకు సైతం వెన‌కాడరు. మ‌రి అలాంటిది ఏదైనా పాల‌సీ ఉందేమో చూద్దాం.

త‌రుగుద‌ల‌ ప‌రిగ‌ణ‌న‌లోనికి

సాధార‌ణ బీమా పాల‌సీలు అందించే సంస్థ‌లు ప్ర‌ధానంగా ఇంటి మ‌రమ్మ‌తుకు లేదా ఇంట్లోని వ‌స్తువుల‌కు బీమా క‌ల్పిస్తారు. అది కూడా ఎంత విలువ‌కు పాల‌సీ కొనుగోలు చేస్తే అంత నిష్ప‌త్తిలో ప‌రిహారం అంద‌జేస్తారు. ఇది కాకుండా వ‌స్తువుల త‌రుగుద‌ల‌ను బ‌ట్టి బీమా ప్ర‌క‌టిత విలువ‌ను లెక్కిస్తారు.

టైటిల్ ఇన్సూరెన్స్‌

ఇక ఆస్తి బీమా విష‌యానికొస్తే… ఆస్తికి సంబంధించి యాజ‌మాన్య హ‌క్కులపై త‌గాదాల ప‌రిష్కారానికి లేదా అందుకు త‌గిన పాల‌సీ కొనుగోలుకు టైటిల్ ఇన్సూరెన్స్ పేరిట ఓ పాల‌సీ అందుబాటులో ఉంది. ఈ పాల‌సీ యాజ‌మాని పేరుపై ఆస్తి హ‌క్కుకు ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు రాకుండా టైటిల్ ఇన్సూరెన్స్ తీసుకోవ‌డం మంచిది.

ఐఆర్‌డీఏఐ ప్రోత్సాహం

ఖాళీ స్థ‌లానికి పాల‌సీ కొనుగోలు అంశాన్ని ప‌రిశీలిస్తే మాత్రం దుర‌దృష్ట‌వ‌శాత్తు ఇప్ప‌టివ‌ర‌కూ మ‌న దేశంలో ఇలాంటి పాల‌సీలు లేవు. అయితే ఐఆర్‌డీఏఐ మాత్రం ఇలాంటి పాల‌సీల‌ను ప్ర‌వేశ‌పెట్టేలా బీమా సంస్థ‌ల‌ను ప్రోత్స‌హిస్తోంది. చూద్దాం! భ‌విష్య‌త్‌లో ఇలాంటి అవ‌స‌రాల‌కూ ఓ పాల‌సీ వ‌స్తుందేమో!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని