మీ ఆరోగ్య బీమా పాలసీ బ‌దిలీ చేస్తున్నారా? అవ‌స‌ర‌మైన ప‌త్రాలు ఇవే

ప్ర‌స్తుత బీమా సంస్థ సేవ‌ల‌తో సంతృప్తిగా లేక‌పోతే..మ‌రొక బీమా సంస్థ‌కు పాల‌సీ బ‌దిలీ చేసుకునే వీలుంది.  

Updated : 28 Aug 2021 17:21 IST

ఆరోగ్య బీమా ఉంటే భారీ ఆసుప‌త్రి బిల్లుల గురించి దిగులు చెందాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఈ కార‌ణంగానే భ‌విష్య‌త్తు వైద్య ఖ‌ర్చుల కోసం ఆర్థిక బ్యాకప్‌గా ఆరోగ్య బీమాను కొనుగోలు చేస్తుంటారు. మారుతున్న జీవిన‌శైలి కార‌ణంగా మ‌ధుమేహం, క్యాన్స‌ర్, గుండెపోటు మొద‌లైన వ్యాధుల బారిన ప‌డేవారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే చిన్న వ‌య‌స్సులోనే ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. వీటికి దీర్ఘ‌కాలిక చికిత్స అవ‌స‌రం. మెడిక‌ల్ ద్ర‌వ్యోల్భ‌ణం కార‌ణంగా వైద్యానికి అయ్యే ఖ‌ర్చులు కూడా బారీగా పెరగ‌డంతో సుదీర్ఘ‌కాలం చికిత్స కోసం చేసే ఖ‌ర్చులు ఆర్థిక వ‌న‌రుల‌ను హ‌రిస్తాయి.

ఆరోగ్య బీమా మీ పొదుపుకి ర‌క్ష‌ణ ఇవ్వ‌డంతో పాటు అత్యుత్త‌మ వైద్య చికిత్స‌ను అందిస్తుంది.  ఆసుప‌త్రి బిల్లు గురించి దిగులు చెంద‌కుండా మాన‌సిక ధైర్యంతో వైద్యం చేయించుకోవ‌చ్చు. అయితే ప్ర‌స్తుతం మీ వ‌ద్ద ఉన్న ఆరోగ్య బీమా.. మీ భ‌విష్య‌త్తు వైద్య అవ‌స‌రాల‌ను తీరిస్తుందా?  బీమా సంస్థ అందించే సేవ‌ల‌తో సంతృప్తిగా ఉన్నారా? ఒక‌వేళ లేక‌పోతే.. పాల‌సీని బ‌దిలీ చేసుకోవ‌చ్చు. మ‌రో బీమా సంస్థ‌తో పోలిస్తే.. ప్ర‌స్తుత బీమా సంస్థ ఎక్కువ ప్రీమ‌యం వ‌సూలు చేస్తూ.. మెరుగైన సేవ‌ల‌ను అందించ‌డం లేద‌ని మీకు అనిపిస్తే..మొబైల్ నెంబ‌రు ఒక నెట్‌వర్క్ నుంచి మ‌రొక నెట్‌వ‌ర్క్‌కు పోర్ట్ చేసుకున్న‌ట్లే, ఆరోగ్య బీమా పాల‌సీని కూడా ప్ర‌స్తుతం ఉన్న బీమా సంస్థ నుంచి మ‌రొక సంస్థ‌కు బ‌దిలీ చేసుకోవ‌చ్చు. 

బీమా నియంత్ర‌ణ ప్రాధికార సంస్థ‌(ఐఆర్‌డీఏ) 2011లో ప్ర‌వేశ‌పెట్టిన నిబంధ‌న‌ల ప్ర‌కారం వ్య‌క్తిగ‌త‌/  ఫ్యామిలీ ఫ్లోటర్ పాల‌సీల‌ను మ‌రో సంస్థ‌కు బ‌దిలీ చేసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ఇంత‌వ‌ర‌కు ల‌భించిన‌ వెయిటింగ్ పిరియ‌డ్ వంటి ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోన‌వ‌స‌రం లేదు. అదే బీమా సంస్థ‌లో ఒక ప్లాన్ నుంచి మ‌రొక ప్లాన్‌కు కూడా మార‌చ్చు. అప్పుడు కూడా క్రెడిట్ ప్ర‌యోజ‌నాన్ని కోల్పోరు. 

ఏ ప్ర‌యోజ‌నాల‌ను బ‌దిలీ చేసుకోవ‌చ్చు..
ఐఆర్‌డిఏ నిబంధ‌న‌ల ప్ర‌కారం టైమ్‌-బాండ్ మిన‌హాయింపులు, నో-క్లెయిమ్ బోన‌స్‌పై ల‌భించే ప్ర‌యోజ‌నాల‌ను బ‌దిలీ చేయ‌వ‌చ్చు.  కొత్త బీమా సంస్థ మీ ప్ర‌తిపాద‌న‌ను అంగీక‌రిస్తే,  పాత బీమా సంస్థతో పొందిన‌.. ముంద‌స్తు ప‌రిస్థితులు, వెయిటింగ్ ప‌రియ‌డ్ క్రెడిట్‌ల‌ను కొత్త బీమా సంస్థ అందిస్తుంది.  అయితే మీ ప్ర‌స్తుత పాల‌సీ ఫీచ‌ర్లు మాత్రం బ‌దిలీకావ‌ని గుర్తుంచుకోండి. 

పాత పాల‌సీ హామీ మొత్తం వ‌ర‌కు నో-క్లెయిమ్ బోన‌స్‌తో పాటు బ‌దిలీ చేసుకునే వీలుంటుంది. పెంచుకున్న హామీ మొత్తానికి బ‌దిలీ ప్ర‌యోజ‌నాలు వ‌ర్తించ‌వు.  ఉదాహ‌ర‌ణ‌కి, మీకు రూ. 5 ల‌క్ష‌ల ఆరోగ్య బీమా ఉండి, కొత్త సంస్థ‌కు రూ. 10ల‌క్ష‌ల వ‌ర‌కు హామీ మొత్తాన్ని పెంచుకున్న‌ప్ప‌టికీ బ‌దిలీ ప్ర‌యోజ‌నాలు(బోన‌స్‌లు తో క‌లిపి) రూ.5 ల‌క్ష‌లకు మాత్ర‌మే వ‌ర్తిస్తాయి. 

ఎలా బ‌దిలీ చేసుకోవాలి?
*
మీరు పాల‌సీ బ‌దిలీ చేస్తున్న‌ట్లు బీమా సంస్థ‌కు తెలిపాలి. ప్ర‌స్తుత పాల‌సీ గ‌డువు ముగియ‌డానికి క‌నీసం 45 రోజుల ముందు బ‌దిలీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 
* మీరు ఏ సంస్థ‌కు పాల‌సీ బ‌దిలీ చేయాల‌నుకుంటున్నారో తెలియ‌జేయాలి. 
* ప్ర‌స్తుత బీమా వివ‌రాల(మీరు పేరు, వ‌య‌సుతో పాటు)తో బ‌దిలీ ద‌ర‌ఖాస్తును పూర్తిచేయాలి. 
* కొత్త సంస్థకు పూర్తి వివ‌రాల‌తో ప్రాపోజ‌ల్ ఫారమ్‌ను పూర్తిచేసి ఇవ్వాలి. 

అవ‌స‌ర‌మైన ప‌త్రాలు ఇవ్వండి..
బ‌దిలీ కోసం అడ్ర‌స్ ఫ్రూఫ్‌, గుర్తింపు ప‌త్రం, ఐఆర్‌డీఏ పోర్ట‌బిలిటీ ఫారం, బీమా పాల‌సీ క‌వ‌ర్‌, ప్రాపోజ‌ల్ ఫారంతో పాటు అవ‌స‌ర‌మైతే క్లెయిమ్ చ‌రిత్ర‌, నో-క్లెయిమ్ డిక్ల‌రేష‌న్ ఫారం, పాల‌సీదారుని వైద్య‌ చరిత్ర రికార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన‌ డేటా ఐఆర్‌డీఏఐ వెబ్ పోర్టల్‌లో ల‌భిస్తుంది. కొత్త బీమా సంస్థ‌ ప్రొపోజల్‌ను తిర‌స్క‌రిస్తే, ఆవిష‌యాన్ని పాల‌సీదారునికి 15 రోజుల‌లో తెలియజేయాలి. పాత పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ‌కు ఇంకా 30 రోజుల స‌మ‌యం ఉంటుంది కాబ‌ట్టి కొత్త పాల‌సీ రిజ‌క్ట్ అయినా పాత పాల‌సీని పునురుద్ధ‌రించుకోవ‌చ్చు. ఒక‌వేళ కొత్త బీమా సంస్థ గ‌డువు తేది లోపుగా తెలియ ప‌ర‌చ‌డంలో విఫ‌లమ‌యితే ప్ర‌పోజ‌ల్ స్వీక‌రించేందుకు క‌ట్టుబ‌డి ఉండాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని