ఆర్‌బీఐ బాండ్లు Vs ప‌న్ను - ర‌హిత బాండ్లు

ఈ బాండ్ల కాల‌ప‌రిమితి ఎక్కువ అయిన‌ప్ప‌టికీ సెకండ‌రీ మార్కెట్ ద్వారా లిక్విడిటీ పొందే అవ‌కాశం ఉంది....

Published : 23 Dec 2020 15:49 IST

ఈ బాండ్ల కాల‌ప‌రిమితి ఎక్కువ అయిన‌ప్ప‌టికీ సెకండ‌రీ మార్కెట్ ద్వారా లిక్విడిటీ పొందే అవ‌కాశం ఉంది

ఇటీవల ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫండ్ మూసివేత, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల భద్రత గురించి ఆందోళన చెందేందుకు కార‌ణ‌మైంది. పెట్టుబడిదారులు - ముఖ్యంగా డెట్ ఫండ్స్ కలిగి ఉన్నవారు - తమ నిధులను రిస్క్ అని భావించి, ఇప్పుడు ఇతర పెట్టుబడి ఎంపికలను కూడా చూస్తున్నారు.

ఫండ్ ప‌రిశ్ర‌మ చాలా ప‌టిష్ఠమైన‌ది. దీనిపై రిటైల్ పెట్టుబ‌డుదారులు ఆధార‌ప‌డి ఉంటారు. అయితే ఇప్పుడు కొన్ని డెట్ ఫండ్లు లాక్ కావ‌డం లేదా విలువను కోల్పోతున్నాయన్న విష‌యం స్పష్టమవుతోంది. అందువల్ల, డెట్ ఫండ్లు వారు పెట్టుబడుల‌ను స‌మీక్షించుకోవ‌డం, ఇత‌ర ఎక్కువ రాబ‌డినిచ్చే ప‌థ‌కాల‌కు కేటాయించే అంశాల‌ను ప‌రిశీలించ‌డం ఈ స‌మ‌యంలో అవ‌స‌రం .

ఆర్‌బీఐ బాండ్లు, పన్ను రహిత బాండ్లు అటువంటి ప్రత్యామ్నాయ పెట్టుబడి ఎంపికలలో ఒకటి, పెట్టుబడిదారులు వీటిలో పెట్టుబ‌డుల‌కు ఇప్పుడు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఆర్‌బీఐ బాండ్లు 7 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో ఉంటాయి. 7.75 శాతం రాబ‌డి ల‌భిస్తుంది. కానీ, ఇందులో ఎటువంటి ప‌న్ను మిన‌హాయింపు ఆప్ష‌న్ ఉండ‌దు.

అధిక వ‌డ్డీ రేటు ఇచ్చిన‌ప్ప‌టికీ ఎటువంటి ప‌న్ను ఆదా చేసుకునే అవ‌కాశం ఉండ‌ద‌ని పెట్టుబ‌డిదారులు గుర్తుంచుకోవాలి. దీంతో రాబ‌డి ఎక్కువ ఉన్న‌ప్ప‌టికీ ప‌న్ను చెల్లించిన త‌ర్వాత త‌క్కువ వ‌స్తుంది. లిక్విడిటీ అవ‌స‌రం ఉన్న‌వారికి ఇది మంచి ఆప్ష‌న్ కాక‌పోవ‌చ్చు. కాల‌ప‌రిమితి ఏడేళ్లు.

దీంతో పోలిస్తే బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో ఎక్కువ లాభం ఉంటుంది నిపుణులు చెప్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు హెచ్‌డీఎఫ్‌సీ ఫిక్స్‌డ్ డిపాజిట్ తీసుకుంటే , దీనిపై ఏడాది కాల‌ప‌రిమితికి 5.8 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. లిక్విడిటీ అవ‌స‌రం ఉన్న‌వార‌కి ఇది మంచి ఆప్ష‌న్‌గా చెప్తున్నారు. ఆర్‌బీఐ బాండ్లు మ‌ధ్య‌-ఆదాయం వారికి అంటే కొంత డ‌బ్బును దీర్ఘ‌కాలం బ్యాంకు డిపాజిట్ల‌లో ఉంచాల‌నుకునేవారికి ఇది స‌రిపోతుంది. ఉదాహ‌ర‌ణ‌కు 30 నుంచి 40 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన వారు మ‌రో ప‌దేళ్ల పాటు వారి ఆదాయ నుంచి 10 శాతం డ‌బ్బును బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేద్దామ‌నుకునేవారికి ఆర్‌బీఐ బాండ్లు స‌రైన‌వి.

ఐదేళ్ల హెచ్‌డీఎఫ్‌సీ ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేటు 6 శాతం. ఇందులో ఐదేళ్ల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల‌నుకునేవారు దానికి ప్ర‌త్యామ్నాయంగా ఏడేళ్ల కాల‌ప‌రిమితితో ఆర్‌బీఐ బాండ్ల‌లో పెట్ట‌వ‌చ్చు. ఇవి సుర‌క్షితంగా ఉంటాయి, అధిక రాబ‌డిని ఇస్తాయి.

ఇక ప‌న్ను ర‌హిత (ట్యాక్స్‌-ఫ్రీ) బాండ్ల విష‌యానికొస్తే అవి 5.12 శాతం నుంచి 5.15 శాతం వ‌ర‌కు త‌క్కువ రాబ‌డిని ఇచ్చిన‌ప్ప‌టికీ ప‌న్ను ర‌హితంగా ఉంటాయి. ఈ బాండ్ల కాల‌ప‌రిమితి సాధార‌ణంగా ప‌దేళ్లు లేదా అంత‌కంటే ఎక్కువ‌గా ఉంటుంది. పెట్టుబ‌డిదారులు వారికి అనుకూలంగా మెచ్యూరిటీ గ‌డువును ఎంచుకోవ‌చ్చు.

హ‌డ్కో, ఎన్‌హెచ్ఏఐ, ఆర్ఈసీ, ఎన్‌టీపీసీ, ఐఈర్ఎఫ్‌సీ, ఐఆర్ఈడీఏ, పీఎఫ్‌సీ, ఎన్‌హెచ్‌పీసీ వంటి ప్ర‌భుత్వ రంగ కంపెనీలు ఈ బాండ్ల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. 30 శాతం కంటే ఎక్కువ ప‌న్ను శ్లాబులోకి వ‌చ్చేవారికి, అధిక పెట్టుబ‌డులు, దీర్ఘ‌కాలం పెట్టుబ‌డులు పెట్టాల‌నుకునేవారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. రాబ‌డిపై ప‌న్ను ఉండ‌దు, ఈక్విటీ పెట్టుబ‌డుల మాదిరిగా రిస్క్ లేదు. పెట్టిన పెట్టుబ‌డి అదేవిధంగా ఉంటుంది. క‌చ్చిత‌మైన రాబ‌డి ఉంటుంది. కాల‌ప‌రిమితి ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ లిక్విడిటీ కోసం ఎప్పుడైనా తీసుకోవ‌చ్చు.

ఇవి ఎక్స్‌ఛేంజీల‌లో ట్రేడ‌వుతాయి. 5.5 శాతం ప‌న్ను ర‌హిత రాబ‌డి వ‌స్తుంది. మెచ్యూరిటీపై కూడా ప‌న్ను లేదు. ప‌న్ను చెల్లించే పెట్టుబ‌డుదారులు ఇప్పుడున్న‌రేట్ల ప్ర‌కారం 6 శాతం వ‌డ్డీతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ప‌దేళ్ల తర్వాత ప‌న్ను పోగా 4.13 శాతం రాబ‌డి వ‌స్తుంది. దీనికి బ‌దులుగా ప‌న్ను-ర‌హిత బాండ్ల‌లో పెట్టుబ‌డులు ఉత్త‌మం అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఈ ప‌న్ను-ర‌హిత బాండ్ల ప్రారంభించ‌డం వాటాదారుల‌కు ఉప‌శ‌మ‌ని క‌లిగిస్తుంద‌ని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని