FY20-21: డివిడెండ్ అందిందా.. ఐటీఆర్ కొత్త రూల్స్ ఏంటి?

సంస్థ‌లు ప్ర‌క‌టించిన డివిడెండ్ ఆదాయం 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంది. 

Updated : 18 Jun 2021 17:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి సంస్థలు పంపిణీ చేసే డివిడెండ్ అందుకున్న పెట్టుబ‌డిదారుల‌ను ప్ర‌భుత్వం ప‌న్ను ప‌రిధిలోకి తీసుకొచ్చింది. ఇంతకుముందు సంస్థలు డివిడెండ్ డిస్ట్రిబ్యూష‌న్ ట్యాక్స్‌ (డిడిటీ) మిన‌హాయించుకున్న త‌ర్వాత మ‌దుప‌ర్ల‌కు డివిడెండ్‌ను డిక్లేర్ చేసేవి. అందువ‌ల్ల వ్య‌క్తులు అందుకున్న డివిడెండ్ ప‌న్ను ర‌హితంగా ఉండేది. అయితే, రూ.10 ల‌క్ష‌ల‌కు మించి డివిడెండ్ పొందిన వారికి మాత్రం 10శాతం ప‌న్ను వ‌ర్తిస్తుంది. 

ఈ నియ‌మాల‌తో పాటు, ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల్లో (ఐటీఆర్‌)లో డివిడెండ్ రిపోర్టింగ్ చేసే ప‌ద్ధతి కూడా మారింది. ఇంత‌కు ముందు డివిడెండ్‌ను ‘మినహాయింపు ఆదాయం’ కింద చూపించాల్సి ఉండగా.. ఇప్పుడు ‘ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం’ కింద చూపించాలి.

త్రైమాసికంగా తెలియ‌జేయాలి..
క్వార్ట‌ర్లీ బ్రేక‌ప్ డివిడెండ్ ఆదాయాన్ని ఐటీఆర్‌లో నివేదించాలి. అంటే.. జూన్ 15, 2020 వ‌ర‌కు, జూన్ 16, 2020 నుంచి సెప్టెంబ‌రు 15, 2020 వ‌ర‌కు, సెప్టెంబ‌రు 16, 2020 నుంచి డిసెంబ‌రు 15, 2020 వ‌ర‌కు, డిసెంబ‌రు 16, 2020 నుంచి మార్చి 15 2021 వ‌ర‌కు, మార్చి 16, 2021 నుంచి మార్చి 31, 2021 వ‌ర‌కు.. ఈ విధంగా డివిడెండ్ ఆదాయాన్ని  ఐటీ రిట‌ర్నుల‌లో పేర్కొన్నాలి అని దిల్లీకి చెందిన ఛార్ట‌ర్డ్ అక్కౌంటెంట్ త‌రుణ్ కుమార్ తెలిపారు. 

డివిడెండ్ ఆదాయంపై, ముంద‌స్తు ప‌న్ను (అడ్వాన్సు ట్యాక్స్) జ‌రిమాల స‌డ‌లింపు కోసం త్రైమాసికంగా నివేదించ‌డం త‌ప్ప‌నిస‌రి. డివిడెండ్ ఆదాయం విష‌యంలో ముందస్తు ప‌న్ను చెల్లించ‌నందుకు ప్ర‌స్తుతం సెక్ష‌న్ 234(సి) కింద పెనాల్టీ నుంచి మిన‌హాయింపు ఇస్తున్నారు. డివిడెండ్ ఆదాయాన్ని అంచ‌నా వేయ‌డం సాధ్యం కానందున ముందుస్తు ప‌న్ను చెల్లింపునకు సంబంధించి జ‌రిమానా వ‌డ్డీపై ప్ర‌స్తుతం ఈ స‌డ‌లింపు ఇచ్చింది. ఇప్పుడు డివిడెండ్ అందుకున్న త్రైమాసికంలో ముందుస్తు ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. 

టీడీఎస్ క్లెయిమ్‌..
ఆర్థిక సంవ‌త్స‌రంలో చెల్లించిన లేదా చెల్లించాల్సిన డివిడెండ్ రూ.5వేల‌కు మించితే సంస్థ 10 శాతం మూలం వ‌ద్ద ప‌న్ను (టీడీఎస్‌) డిడ‌క్ట్ చేయాలి. అటువంటి టీడీఎస్‌ను, ప‌న్ను చెల్లింపుదారులు వెన‌క్కి వ‌చ్చిన ఆదాయంలో క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. 

‘చెల్లించిన డివిడెండ్ స‌మాచారాన్ని సంస్థ‌లు.. ఆదాయ‌పు ప‌న్ను శాఖకు నివేదించ‌డం త‌ప్ప‌నిస‌రి. అందువ‌ల్ల డివిడెండ్ ఆదాయం ఫ్రీఫైలింగ్ (ముందుగా పూరించిన‌) ఫారంల‌లో ఉంటుంద‌ని ఆశిస్తున్నాం’’ అని నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని