Recruitments: కొవిడ్‌-19 పూర్వ స్థాయికి ఉద్యోగ నియామకాలు!

దేశంలో ఉద్యోగ నియామకాలు కొవిడ్‌-19 పూర్వ స్థాయికి చేరినట్లు ‘ఇండీడ్‌’

Published : 31 Aug 2021 11:12 IST

 ‘ఇండీడ్‌’ నివేదిక 

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో ఉద్యోగ నియామకాలు కొవిడ్‌-19 పూర్వ స్థాయికి చేరినట్లు ‘ఇండీడ్‌’ అనే ఉద్యోగ నియామకాల సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. వినియోగం ఆధారిత రంగాల్లో మున్ముందు అధికంగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం గత ఏడాది ఫిబ్రవరిలో స్థాయికి ఇప్పుడు ఉద్యోగ నియామకాలు చేరుకున్నాయి. గత ఏడాది జులై నుంచి ఈ ఏడాది జులై నాటికి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో 19 శాతం వృద్ధి కనిపిస్తోంది. అదే విధంగా ప్రాజెక్ట్‌ హెడ్, ఇంజనీర్‌... తదితర ఉద్యోగాలు 8 నుంచి 16 శాతం చొప్పున పెరిగాయి. లాక్‌డౌన్, ఇతర ఆంక్షలను చాలా వరకూ తొలగించటానికి తోడు కొవిడ్‌-19 తట్టుకుంటూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించగలిగే సత్తాను వ్యాపార సంస్థలు సమకూర్చుకోవటంతో ఉద్యోగ నియామకాలు పెరిగే అవకాశం ఏర్పడిందని ఇండీడ్‌ ఇండియా విక్రయాల విభాగం అధిపతి శశి కుమార్‌ వివరించారు. టెక్నాలజీ ఉద్యోగాలు అధికంగా ఉన్నప్పటికీ ఆహారం, రిటైల్‌ విభాగాల్లో కొత్త ఉద్యోగాలు అధికంగా లభిస్తున్నట్లు పేర్కొన్నారు. శుభ్రత అందరికీ అత్యంత ప్రాధాన్యమైన అంశం అయినట్లు, అందువల్ల దీనికి సంబంధించి విభాగాల్లో కొత్త ఉద్యోగాలు వస్తున్నట్లు తెలిపారు. థెరపీ, పర్సనల్‌ కేర్, ఛైల్డ్‌కేర్‌... ఉద్యోగాలు అధికంగా లభిస్తున్నట్లు వెల్లడించారు. కార్యాలయాలు, వ్యాపార ప్రాంగణాలను పూర్తి స్థాయి కార్యకలాపాలకు సిద్ధం చేసేందుకు యాజమాన్యాలు సిద్ధం అవుతున్నందున క్లీనింగ్, హౌస్‌ కీపింగ్‌ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నట్లు తెలిపారు. ఈ విభాగంలో ఉద్యోగాలు 60 శాతం పెరిగినట్లు వెల్లడించారు. కానీ అదే సమయంలో విమానయానం, మీడియా- ఎంటర్‌టైన్‌మెంట్, అకౌంటింగ్, కస్టమర్‌ రిలేషన్స్, అడ్మినిస్ట్రేషన్‌ ఉద్యోగాలు తగ్గిపోవటం గమనార్హం.

జోరుగా వ్యాపార కార్యకలాపాలు..

దేశవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు కొవిడ్‌-19 ముందు స్థాయికి చేరుకున్నట్లు ఆర్థిక సేవల సంస్థ నొమురా ఒక నివేదికలో వెల్లడించింది. ‘నొమురా ఇండియా బిజినెస్‌ రిజమ్షన్‌ ఇండెక్స్‌’ తాజాగా 102.7 కు చేరింది. క్రితం వారంలో ఇది 101.3 ఉండటం గమనార్హం. లాక్‌డౌన్, ఇతర ఆంక్షలతో గత ఏడాది మార్చి తర్వాత ఈ సూచీ భారీగా పతనం అయింది. కానీ మళ్లీ ఇప్పుడు అప్పటి స్థాయికి చేరుకుంది. అయితే తాజాగా కేరళలో నమోదవుతున్న కొవిడ్‌-19 కొత్త కేసులను పరిగణలోకి తీసుకుంటే మూడో దశ ముప్పు లేదని అనుకోలేమని ఈ నివేదిక పేర్కొంది. అదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు ఆశావహంగానే ఉంటుందని అభిప్రాయపడింది. వృద్ధి రేటు 10.4 శాతం ఉంటుంది- అని అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని