Jio: రూ.30,791 కోట్ల స్పెక్ట్రం బకాయిలు చెల్లించిన జియో

స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ.30,791 కోట్ల బకాయిలను ప్రభుత్వానికి చెల్లించినట్లు ప్రముఖ టెలికాం ఆపరేటర్‌ రిలయన్స్‌ జియో తెలిపింది.....

Updated : 20 Jan 2022 17:42 IST

దిల్లీ: స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ.30,791 కోట్ల బకాయిలను ప్రభుత్వానికి చెల్లించినట్లు టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో తెలిపింది. మార్చి 2021కి ముందు జరిగిన స్పెక్ట్రం వేలానికి సంబంధించి వడ్డీతో సహా అన్ని బకాయిలను చెల్లించేసినట్లే పేర్కొంది.

2014, 2015, 2016లో జరిగిన వేలంలో జియోకు స్పెక్ట్రం కేటాయింపులు జరిగాయి. అలాగే 2021లో భారతి ఎయిర్‌టెల్‌తోనూ స్పెక్ట్రం వినియోగానికి సంబంధించి ఓ ఒప్పందం కుదిరింది. దీని ద్వారా కంపెనీ 585.3 ఎంహెచ్‌జెడ్‌ స్పెక్ట్రం సొంతం చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పుడు చెల్లింపులు చేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న వడ్డీరేటు ప్రకారం.. కంపెనీకి ఏటా రూ.1,200 కోట్లు మిగలనున్నాయని పేర్కొంది. వాస్తవానికి ఈ చెల్లింపులపై కేంద్రం నాలుగేళ్ల మారటోరియం వెసులుబాటు కల్పించింది. కానీ, జియో ఆ సదుపాయాన్ని వినియోగించుకోకుండానే చెల్లింపులు చేసేసింది.

గతనెల భారతీ ఎయిర్‌టెల్‌ సైతం స్పెక్ట్రానికి సంబంధించి రూ.15,519 కోట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాంకు చెల్లించింది. ఇక అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌), టాటా టెలీసర్వీసెస్‌ (TTSL), టాటా టెలీసర్వీసెస్‌ మహారాష్ట్ర (TTML) మాత్రం ప్రభుత్వం కల్పించిన మారటోరియం సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి ముందుకు వచ్చాయి. పైగా బకాయిలపై వడ్డీ కింద ప్రభుత్వానికి ఈక్విటీ వాటా ఇస్తామని ప్రకటించాయి. వీఐఎల్‌ 35.8 శాతం, టీటీఎస్‌ఎస్‌, టీటీఎంఎల్‌ కలిసి 9.5 శాతం ఈక్విటీ వాటాలను సర్కార్‌కు ఇస్తామని ప్రతిపాదించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని