Coronaపై పోరుకు SBI రూ. 71కోట్ల సాయం 

కరోనా మహమ్మారిపై పోరులో తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చింది ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ). వైరస్‌ను ఎదుర్కొనేందుకు రూ

Updated : 03 May 2021 14:26 IST

ముంబయి: కరోనా మహమ్మారిపై పోరులో తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చింది ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ). వైరస్‌ను ఎదుర్కొనేందుకు రూ. 71కోట్లతో సాయం ప్రకటించింది. కొవిడ్‌ బాధితుల కోసం తాత్కాలిక ఆసుపత్రుల ఏర్పాటు చేయడంతో పాటు వైద్య పరికరాలు, ఆక్సిజన్‌ సరఫరా కోసం ఈ నిధులను ఉపయోగించనున్నట్లు బ్యాంకు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో రూ. 30కోట్లతో 1000 పడకల తాత్కాలిక ఆసుపత్రులు, 250 ఐసీయూ బెడ్లు, 1000 పడకలతో ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రులు, మున్సిపల్‌ కార్పొరేషన్ల సహకారంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. ఇక జీనోమ్‌ సీక్వెన్స్‌ పరికరాలు, ల్యాబ్‌, వ్యాక్సిన్‌ పరిశోధన పరికరాల కోసం ప్రభుత్వానికి రూ. 10కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో పాటు ఎస్‌బీఐకి చెందిన 17 స్థానిక హెడ్‌ ఆఫీసులకు రూ. 21కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఆయా ఆఫీసుల పరిధుల్లో కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్ సరఫరా, వైద్య పరికరాలను అందజేయనున్నట్లు పేర్కొంది. ఇక కరోనా పరీక్షలు, ఇతర సాయం కోసం మరో రూ. 10కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. అంతేగాక, మాస్క్‌లు, పీపీఈ కిట్లు, రేషన్‌, ఆహార పదార్థాల పంపిణీ కొనసాగించనున్నట్లు తెలిపింది. 

ఈ సందర్భంగా ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా మాట్లాడుతూ.. ‘‘కొవిడ్‌పై పోరులో మా వంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాం. వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా ఉండాలి. తమకు చేతనైన సాయం ఏ రూపంలోనే సరే అందించాలి’’ అని కోరారు. 

ఇప్పటికే బ్యాంకు తమ ఉద్యోగులందరికీ ఉచితం వ్యాక్సిన్‌ అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక దేశవ్యాప్తంగా బ్యాంకుకు చెందిన 60 శిక్షణ కేంద్రాలను ఐసోలేషన్‌ సెంటర్లుగా మార్చింది. పీఎం కేర్స్‌కు రూ. 108కోట్ల విరాళం అందించింది. వ్యాక్సినేషన్‌ పంపిణీ కోసం మరో 11కోట్ల సహకారం అందించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని