పీఎంసీ బ్యాంక్‌ మోసం కేసులో రూ.233 కోట్ల హెచ్‌డీఐఎల్‌ గ్రూప్‌ షేర్ల జప్తు

పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర సహకార (పీఎంసీ) బ్యాంక్‌ను మోసం చేసిన కేసు, మనీ లాండరింగ్‌ కేసుల్లో హెచ్‌డీఐఎల్‌ గ్రూప్‌ కంపెనీల్లోని రూ.233 కోట్ల షేర్లను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం వెల్లడించింది.

Published : 03 Sep 2021 01:26 IST

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

దిల్లీ: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర సహకార (పీఎంసీ) బ్యాంక్‌ను మోసం చేసిన కేసు, మనీ లాండరింగ్‌ కేసుల్లో హెచ్‌డీఐఎల్‌ గ్రూప్‌ కంపెనీల్లోని రూ.233 కోట్ల షేర్లను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం వెల్లడించింది. పాక్షికంగా చెల్లింపు జరిపిన (పార్ట్‌లీ-పెయిండ్‌) కచ్చితంగా మార్పిడి చేయాల్సిన ప్రిఫరెన్ష్‌ షేర్లను జప్తు చేసినట్లు పేర్కొంది. ఆర్యమన్‌ డెవలపర్స్‌ ప్రై.లి. ముంబయి ఘట్కోపర్‌లో అభివృద్ధి చేస్తున్న 90,250 చదరపు అడుగుల (ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌-ఎఫ్‌ఎస్‌ఐ) నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ల కేటాయింపు హక్కులను ఈ షేర్ల ఆధారంగానే హెచ్‌డీఐఎల్‌ కలిగి ఉందని ఈడీ తెలిపింది. ప్రాజెక్ట్‌ పూర్తయిన తర్వాత డెవలపర్‌ విక్రయించరాదని, బదిలీ చేయకూడదని, పరాయీకరణ లేదా థర్డ్‌ పార్టీ హక్కులను సృష్టించకుండా ఉండేందుకు హామీ ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది. పీఎంసీ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో 2019లో హెచ్‌డీఐఎల్‌ ప్రమోటర్లు రాకేశ్‌ కుమార్‌ వాధ్వాన్‌, అతని కుమారుడు సారంగ్‌ వాధ్వాన్‌, మాజీ ఛైర్మన్‌ వర్యామ్‌ సింగ్‌, మాజీ ఎండీ జాయ్‌ థామస్‌లపై ఈడీ మనీ లాండరింగ్‌ కేసు కూడా నమోదు చేసి విచారిస్తోంది.


పెట్టుబడుల ఊతానికి చర్యలు

 11వ ఈఎఫ్‌డీ సదస్సులో భారత్‌, బ్రిటన్‌ అంగీకారం

లండన్‌: వాతావరణంలో మార్పులు అరికట్టేందుకు, పెట్టుబడుల ఊతానికి భారత్‌, బ్రిటన్‌లు కొత్త చర్యలు ప్రకటించాయి. 11వ ఇండియా- బ్రిటన్‌ ఎకనామిక్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ డైలాగ్‌ (ఈఎఫ్‌డీ) సదస్సులో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, బ్రిటన్‌ చాన్సలర్‌ రిషి సునక్‌ ఇందుకు అంగీకరించారు. వాణిజ్య భాగస్వామ్యం ద్వారా ద్వైపాక్షిక అజెండాను రెండు దేశాలు ముందుకు తీసుకెళ్లనున్నాయి. ఈ వార్షిక సదస్సు సందర్భంగా సీతారామన్‌, సునక్‌లు దృశ్యమాధ్యమ పద్ధతిలో భేటీ అయ్యారు. భారత పర్యావరణ హిత లక్ష్యాల కోసం హరిత, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో ప్రజా, ప్రైవేట్‌ పెట్టుబడులతో కూడిన 1.2 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీపై ఇరువురు సంతకాలు చేశారు. భారత్‌లో హరిత ప్రాజెక్టుల్లో బ్రిటన్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ సంస్థ సీడీసీ 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి ఉంది. భారత పునరుత్పాదక ఇంధన రంగంలో గ్రీన్‌ గ్రోత్‌ ఈక్విటీ ఫండ్‌ 200 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.


ఇష్టారీతిన రాయితీలు ఇవ్వొద్దు

ముందుగా చెప్పిన టారిఫ్‌లనే అందించాలి

టెల్కోలకు ట్రాయ్‌ ఆదేశాలు

దిల్లీ: టెలికాం కంపెనీలు (టెల్కోలు) తమకు నివేదించిన టారిఫ్‌లనే పంపిణీదార్లు, రిటైలర్ల ద్వారా వినియోగదార్లకు అందించాల్సి ఉంటుందని నియంత్రణ సంస్థ ట్రాయ్‌ స్పష్టం చేసింది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వినియోగదార్లను ఆకట్టుకోవడం కోసం కొంతమంది భాగస్వామ్య సంస్థలు ఇష్టారీతిన రాయితీలు ఇస్తున్నట్లు ట్రాయ్‌ దృష్టికి రావడంతో పై ఆదేశాలు జారీ చేసింది. భాగస్వామ్య సంస్థలు సైతం నియంత్రణ నిబంధనలు, మార్గదర్శకాలు పాటించేలా చేయాల్సిన బాధ్యత టెల్కోలదేనని ట్రాయ్‌ తెలిపింది. ఆపరేటర్ల పేరు లేదా బ్రాండ్‌ను వాడే ఆయా ఉత్పత్తుల మార్కెటింగ్‌, విక్రయం జరుగుతోందని గుర్తు చేసింది. తాజా ఆదేశాలను తక్షణం అమలు చేయాలని సూచించింది. మొబైల్‌ నెంబరు పోర్టబులిటీ(ఎమ్‌ఎన్‌పీ)కే ప్రత్యేకించి ఆఫర్లు ఇస్తూ పోటీ సంస్థల వినియోగదార్లను ఆకట్టుకుంటున్నాయంటూ టెల్కోలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ట్రాయ్‌ ఆదేశాలు జారీ అయ్యాయి. కొన్ని భాగస్వామ్య కంపెనీలు టెల్కోల నుంచి అనుమతి లేకుండానే ఈ విధమైన ఆఫర్లు ఇస్తున్నట్లూ తెలుస్తోంది.


బ్రిక్స్‌ బ్యాంకులో కొత్త సభ్య దేశాలుగా యూఏఈ, ఉరుగ్వే, బంగ్లాదేశ్‌

బీజింగ్‌: బ్రిక్స్‌ దేశాలు ఏర్పాటు చేసిన ద నేషనల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఎన్‌డీబీ) తన విస్తరణలో భాగంగా కొత్త సభ్యులుగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), ఉరుగ్వే, బంగ్లాదేశ్‌లను అంగీకరించింది. సభ్యదేశాలు, ఇతర వర్థమాన దేశాల్లో మౌలిక, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 2015లో బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు ఎన్‌డీబీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతమున్న బహుళ, ప్రాంతీయ ఆర్థిక సంస్థలకు తోడు అంతర్జాతీయ వృద్ధి, అభివృద్ధికి ఈ బ్యాంకు కూడా కృషి చేస్తోంది. సభ్యులను పెంచుకోవడం కోసం 2020 చివరి నుంచి ఎన్‌డీబీ అధికారికంగా పలు చర్చలు చేపట్టినట్లు బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ చర్చలు విజయవంతం కావడంతో కొత్త సభ్య దేశాలుగా యూఏఈ, ఉరుగ్వే, బంగ్లాదేశ్‌లకు ఆమోదం వేసినట్లు ఎన్‌డీబీ అధ్యక్షుడు మార్కోస్‌ ట్రాయ్‌జో పేర్కొన్నారు. బ్యాంకు సభ్యత్వాన్ని క్రమంగా, సమతుల ధోరణిలో విస్తరించుకుంటూ వెళతామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని