Updated : 24 Jan 2022 09:51 IST

Stock market: భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. గతవారం అంతర్జాతీయంగా దాదాపు అన్ని మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అమెరికా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నాస్‌డాక్‌ ఏకంగా ఇటీవలి గరిష్ఠాల నుంచి 16 శాతం కుంగడం గమనార్హం. ముఖ్యంగా అక్కడి టెక్‌స్టాక్‌లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. రేపటి నుంచి అక్కడ ఫెడ్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వడ్డీరేట్ల పెంపు తప్పదని ఇప్పటికే సంకేతాలిచ్చిన ఫెడ్‌.. దాన్ని ఎంత వేగంగా.. ఎన్ని దశల్లో అమలు చేయనుందో ఈ భేటీ స్పష్టం చేయనుంది. మరోవైపు ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో పెంపును ఏమైనా వాయిదా వేస్తారా అనే దానిపై కూడా మదుపర్లు దృష్టి సారించారు. మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ (Russia-Ukraine) మధ్య కొనసాగుతున్న వివాదంపైనా మదుపర్లు దృష్టి పెట్టారు. యుద్ధ మేఘాలు కమ్ముకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయ సిబ్బందిని అమెరికా తగ్గించింది.

ఇక దేశీయంగా చూస్తే గతవారం విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) ఏకంగా రూ.12,600 కోట్లకు పైగా అమ్మకాలు దిగారు. దేశీయ మదుపర్లు సైతం అదే బాటలో పయనిస్తున్నారు. ఇక గత ఏడాది కొత్తగా లిస్టయిన కంపెనీలన్నీ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. లిస్టింగ్‌లో అదరగొట్టిన జొమాటో (Zomato) వంటి షేర్లు ఇష్యూ ధర కంటే 10 శాతం కింద ట్రేడవుతుండడం గమనార్హం. ఇక పేటీఎం (Paytm) షేరు ఏకంగా 50 శాతం నష్టంతో చలిస్తోంది.  

ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 505 పాయింట్ల నష్టంతో 58,532 వద్ద, నిఫ్టీ (Nifty) 167 పాయింట్లు నష్టపోయి 17,450 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.39 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌30 సూచీలో మారుతీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటన్‌ షేర్లు నష్టపోతున్న వాటిలో ఉన్నాయి.

నేడు వార్తల్లో ఉండే అవకాశం ఉన్న స్టాక్‌లు...

* రిలయన్స్‌: అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి కంపెనీ అంచనాలకు మించిన ఫలితాలను ప్రకటించింది. ఏకీకృత ప్రాతిపదికన రూ.18,549 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే కాల లాభం రూ.13,101 కోట్లతో పోలిస్తే ఈసారి 41% శాతం పెరిగింది. మొత్తం ఆదాయం 52.2% పెరిగి రూ.2,09,823 కోట్లకు చేరింది. టెలికాం విభాగంలో సగటు వినియోగదారు ఆదాయం (ఆర్పు) అధికంగా నమోదు కావడం, రిటైల్‌ వ్యాపారం గిరాకీ పుంజుకోవడం ఆర్‌ఐఎల్‌ లాభాల్లో వృద్ధికి తోడ్పడింది.

* ఐసీఐసీఐ బ్యాంక్‌: ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.6,536.55 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో బ్యాంకు ఆర్జించిన నికర లాభం రూ.5,498.15 కోట్లతో పోలిస్తే ఇది 19 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.40,419.08 కోట్ల నుంచి రూ.39,865.80 కోట్లకు తగ్గింది. స్టాండలోన్‌ ప్రాతిపదికన, బ్యాంక్‌ నికర లాభం రూ.4,939.59 కోట్ల నుంచి 25 శాతం వృద్ధి చెంది, రూ.6,194 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.24,416 కోట్ల నుంచి రూ.27,069.67 కోట్లకు పెరిగింది. 

* యెస్‌ బ్యాంక్‌: ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో రూ.266.43 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఆర్జించిన నికర లాభం రూ.150.77 కోట్లతో పోలిస్తే ఇది 77% అధికం. మొత్తం ఆదాయం రూ.6,408.53 కోట్ల నుంచి రూ.5,632.03 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,560 కోట్ల నుంచి 31% తగ్గి రూ.1,764 కోట్లకు పరిమితమైంది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) 15.36 శాతం నుంచి  14.65 శాతానికి పరిమితమయ్యాయి.

* బిర్లా కార్పొరేషన్‌ : రూ.2,744 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ముకుట్‌బన్‌ సిమెంట్‌ ప్లాంట్‌ను కంపెనీ ప్రారంభించింది. దీంతో కంపెనీ వార్షిక సామర్థ్యం రెండు కోట్ల టన్నులకు చేరనుంది.  

* ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌: రూ.2 ముఖ విలువ కలిగిన కంపెనీ ఈక్విటీ షేర్లలో సబ్‌-డివిజన్‌ చేయాలన్న ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించింది. 

* ఈరోజు త్రైమాసిక ఫలితాలు వెల్లడించబోయే కంపెనీలు: హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌, శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, స్టీల్‌ స్ట్రిప్స్‌, సుప్రీం ఇండస్ట్రీస్‌, రామ్‌కో సిమెంట్స్‌, బర్గర్‌ కింగ్‌, దీపక్‌ నైట్రేట్‌, ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజీ, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, అపోలో పైప్స్‌, సుదర్శన్‌ కెమికల్స్‌, ఓరియెంటల్‌ హోటల్స్‌.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని