TCS: ఒడుదొడుకులున్నా.. పెట్టుబడులు కొనసాగుతాయి: టీసీఎస్‌

స్వల్పకాలంలో ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ.. వ్యాపార అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టడానికి ఏమాత్రం వెనుకాడబోమని టీసీఎస్‌ చీఫ్‌ ఫినాన్షియల్‌ ఆఫీసర్‌ సమీర్‌ సెక్సారియా తెలిపారు....

Updated : 11 Oct 2021 14:53 IST

ముంబయి: స్వల్పకాలంలో ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ.. వ్యాపార అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టడానికి ఏమాత్రం వెనుకాడబోమని టీసీఎస్‌ చీఫ్‌ ఫినాన్షియల్‌ ఆఫీసర్‌ సమీర్‌ సెక్సారియా తెలిపారు. లాభార్జనను కాపాడుకునేందుకు పెట్టుబడుల్లో ఎలాంటి క్షీణత ఉండదని పేర్కొన్నారు. అయితే, 26-28 శాతం నిర్వహణ లాభాలను ఆర్జించాలన్న లక్ష్యానికి అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. వ్యాపారాల అవసరాలరీత్యా మాత్రమే స్వల్పకాలిక లక్ష్యాలు ఉంటాయని పేర్కొన్నారు.

శుక్రవారం వెలువడిన టీసీఎస్ మూడో త్రైమాసికం ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయాయి. పైగా సంస్థలో ఐటీ సేవల వలసల రేటు 11.9 శాతంగా నమోదైంది. దీంతో మానవ వనరుల కొరతతో సేవల సరఫరాలో అంతరాయం ఏర్పడొచ్చన్న అంచనాలు కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం కంపెనీలో దాదాపు ఐదు లక్షల మంది ఉద్యోగులున్నారు. అలాగే విదేశీ మారకపు విలువ సైతం పెరుగుతుండడం కూడా సేవల ఎగుమతులకు ప్రతిబంధకంగా మారినట్లు కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సమస్యలనే సమీర్‌ సక్సేరియా పరోక్షంగా స్వల్పకాల ఒడుదొడుకులుగా పేర్కొన్నారు. 

కొవిడ్‌ ప్రారంభ రోజుల్లో డిమాండ్‌ పడిపోయినప్పటికీ.. సరఫరా, మానవ వనరుల విషయంలో టీసీఎస్ ప్రత్యర్థి కంపెనీల కంటే మెరుగ్గా రాణించిందని సమీర్‌ తెలిపారు. అది సకాలంలో పెట్టుబడుల వల్లే సాధ్యమైందన్నారు. గత 6 నెలల్లో 43,000 మంది తాజా పట్టభద్రుల్ని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. రెండో అర్ధభాగంలోనూ మరో 35,000 మందిని(మొత్తం 78,000మంది) నియమించుకోవాలనుకుంటున్నారు.

దేశీయ సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జులై-సెప్టెంబరులో సంస్థ ఏకీకృత నికర లాభం రూ.9,624 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక లాభం రూ.8,433 కోట్లతో పోలిస్తే, ఇది 14.1 శాతం అధికం. ఇదే సమయంలో ఏకీకృత ఆదాయం కూడా రూ.40,135 కోట్ల నుంచి 16.8 శాతం వృద్ధితో రూ.46,867 కోట్లకు పెరిగింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 15.5 శాతంగా నమోదైంది. ఫలితాలు అంచనాలను అందుకోకపోవడం, వలసల రేటు పెరగడంతో సోమవారం కంపెనీ షేర్లు ఓ దశలో 7 శాతం మేర కుంగాయి. ఈ తరుణంలో టీసీఎస్‌ నుంచి పెట్టుబడుల కొనసాగింపు ప్రకటన రావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని