Air Fare: దేశీయ విమానయానం.. ఇకపై మరింత భారం

దేశీయ విమాన ప్రయాణికులపై మరింత భారం పడనుంది. దేశీయ విమాన ఛార్జీల కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను కేంద్ర పౌరవిమానయాన శాఖ మరోసారి పెంచింది.

Published : 13 Aug 2021 13:45 IST

దిల్లీ: దేశీయ విమాన ప్రయాణికులపై మరింత భారం పడనుంది. దేశీయ విమాన ఛార్జీల కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను కేంద్ర పౌరవిమానయాన శాఖ మరోసారి పెంచింది. వీటిని 9.83 నుంచి 12.82శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ పరిస్థితులు, పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలోనే ఈ పరిమితులను పెంచినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. దేశీయ విమాన ఛార్జీల పరిమితులు పెంచడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 

* తాజా పెంపుతో 40 నిమిషాల లోపు ప్రయాణ సమయం ఉండే విమాన టికెట్‌ ధర కనిష్ఠ పరిమితి రూ.2,600 ఉండగా.. ఇప్పుడు రూ.2,900లకు పెరిగింది. ఇదే ప్రయాణ సమయానికి గరిష్ఠ పరిమితిని 12.82శాతం పెంచడంతో రూ.8,800కు చేరింది.

*ఇక 40-60 నిమిషాల ప్రయాణ సమయం ఉండే విమాన టికెట్ ధర కనిష్ఠ పరిమితి రూ.3,300 ఉండగా.. ఇప్పుడు రూ.3,700లకు పెరిగింది. గరిష్ఠ పరిమితిని రూ.11,000 పెంచారు.

* 60-90 నిమిషాల ప్రయాణ సమయానికి టికెట్‌ కనిష్ఠ పరిమితి రూ.4,500, గరిష్ఠ పరిమితిని రూ.13,200లకు పెంచారు.

*  90-120 నిమిషాల ప్రయాణానికి కనిష్ఠ పరిమితి రూ.4,700ఉండగా.. ఇప్పుడు రూ.5,300లకు చేరింది. గరిష్ఠ పరిమితిని 12.3శాతం పెంచారు.

* 120-150 నిమిషాల ప్రయాణానికి కనిష్ఠ పరిమితి రూ.6,100 ఉండగా.. ఇప్పుడు రూ.6,700లకు పెరిగింది. గరిష్ఠ పరిమితిని 12.42శాతం పెంచారు.

* 150-180 నిమిషాల ప్రయాణానికి కనిష్ఠ పరిమితి రూ.7,400 ఉండగా.. ఇప్పుడు రూ.8,300 లకు చేరింది. గరిష్ఠ పరిమితిని 12.74శాతం పెంచారు.

* 180-210 నిమిషాల ప్రయాణానికి కనిష్ఠ పరిమితి రూ.8,700 ఉండగా.. ఇప్పుడు రూ.9,800లకు పెరిగింది. గరిష్ఠ పరిమితిని 12.39శాతం పెంచారు.

కొవిడ్‌ లాక్‌డౌన్‌ అనంతరం 2020 మే 25న దేశీయ విమానాలను పునః ప్రారంభించిన సమయంలో ప్రయాణ సమయాన్ని బట్టి టికెట్‌ ఛార్జీలను ఏడు శ్రేణుల్లో విభజించి, పరిమితులు విధించిన విషయం తెలిసిందే. కరోనాతో విధించిన ఆంక్షల కారణంగా ఎయిర్‌లైన్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో టికెట్‌ ఛార్జీలపై కనిష్ఠ పరిమితిని తీసుకొచ్చారు. ఇక గిరాకీ ఎక్కువ ఉన్న సమయంలో ప్రయాణికులపై అదనపు భారం పడకూడదని గరిష్ఠ పరిమితి విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని