Reliance: రిలయన్స్‌ చేతికి మరో ప్రముఖ కంపెనీ

స్వచ్ఛ ఇంధన సాంకేతికతలో భారీగా పెట్టుబడులు పెడుతున్న బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ నేతృత్వంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. తాజాగా మరో ప్రముఖ కంపెనీని కొనుగోలు చేసింది...

Published : 31 Dec 2021 11:36 IST

దిల్లీ: స్వచ్ఛ ఇంధన సాంకేతికతలో భారీగా పెట్టుబడులు పెడుతున్న బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. తాజాగా మరో ప్రముఖ కంపెనీని కొనుగోలు చేసింది. బ్రిటన్‌కు చెందిన బ్యాటరీ తయారీ సంస్థ ఫరాడియన్‌ లిమిటెడ్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ 100 మిలియన్‌ పౌండ్లు(దాదాపు రూ.1003 కోట్లు). కంపెనీ వృద్ధి కోసం మరో 25 మిలియన్‌ పౌండ్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఫరాడియన్‌లో 100 శాతం వాటాలు రిలయన్స్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ అయిన ‘రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్‌)’ వశం కానున్నాయి.

షెఫీల్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఫరాడియన్‌.. ప్రముఖ అంతర్జాతీయ బ్యాటరీ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటి. సోడియం-ఐయాన్‌ బ్యాటరీపై ఈ కంపెనీకి పేటెంట్స్‌ ఉండడం గమనార్హం. లిథియం-ఐయాన్‌, లెడ్‌-యాసిడ్‌ బ్యాటరీలతో పోలిస్తే సోడియం-ఐయాన్ బ్యాటరీతో అధికంగా ప్రయోజనం ఉండే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. భూమిపై విరివిగా దొరికే ఆరో మూలకం సోడియం కావడం విశేషం.

భవిష్యత్తు స్వచ్ఛ ఇంధనానిదే కావడంతో రిలయన్స్‌ ఈ రంగంలో వేగంగా పెట్టుబడులు పెడుతోంది. మరికొన్ని సంస్థల భాగస్వామ్యంలో ఇప్పటి వరకు 1.2 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ఫరాడియన్‌ ద్వారా లభించే సాంకేతికతను జామ్‌నగర్‌లో నెలకొల్పనున్న ఇంటిగ్రేటెడ్‌ ఎనర్జీ స్టోరేజీ గిగా ఫ్యాక్టరీలో రిలయన్స్‌ ఉపయోగించనుంది. ఈ ఒప్పందంపై ముకేశ్‌ అంబానీ, ఫరాడియన్‌ సీఈఓ జేమ్స్‌ క్విన్‌ ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని