ఐపీఓకు ద‌ర‌ఖాస్తు చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

జీరో నుంచి  స్థాయికి చేరిన కంపెనీల్లో భాగం కావ‌డానికి ఆస‌క్తి చూపిస్తారు

Updated : 16 Jul 2021 18:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మార్కెట్‌లో ఐపీఓ సీజ‌న్ మ‌ళ్లీ మొదలైంది. దేశంలో యూనికార్న్ (1 బిలియ‌న్ మార్కెట్ విలువ‌) కంపెనీలు మార్కెట్ జాబితాలో చేరేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. చాలా మంది పెట్టుబడిదారులు త‌మ‌కు బాగా తెలిసిన కంపెనీలు ఐపీఓలు ప్ర‌క‌టిస్తున్నందున అవి ఆక‌ర్ష‌ణీయంగా మారాయి. జీరో నుంచి ఓ స్థాయికి చేరిన కంపెనీల్లో భాగం కావ‌డానికి ఆస‌క్తి చూపుతున్నారు. ఈ కొత్త స్టార్టప్‌లు గతంలో చాలా వృద్ధిని కనబరిచినందున అవి భవిష్యత్‌లో కూడా ఇలాంటి వృద్ధినే కొన‌సాగిస్తాయ‌ని చెప్ప‌లేం. కాబ‌ట్టి ఇలాంటి సంస్థ‌ల్లో పెట్టుబ‌డుల‌కు ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం ముఖ్యం.
లిస్టింగ్ రోజు: రిటైల్ పెట్టుబ‌డిదారుల‌ ఆసక్తి కారణంగా ఈ స్టాక్స్ లిస్టింగ్ రోజున భారీ లాభాల‌ను చూడొచ్చు. అయితే, ఐపీఓల చరిత్రను పరిశీలిస్తే.. చాలా సంద‌ర్భాల్లో ఆ లాభాలు త‌ర్వాత కొన‌సాగ‌వు. రిటైల్ పెట్టుబడిదారులు ఐపీఓలో షేర్లు కొనేందుకు ప‌రిమితి ఉంటుంది కాబ‌ట్టి గణనీయమైన సంపదను సృష్టించడానికి వీలుండ‌దు. అయితే మొదటి రోజున స్టాక్స్ బాగా పైకి కదులుతున్నట్లుగా చూసినప్పుడు, ఇందులో ఎక్కువ లాభ‌ప‌డ‌తామ‌ని పెట్టుబ‌డుదారులు ప్ర‌లోభానికి లోన‌వుతారు. దీంతో సెకండ‌రీ మార్కెట్లో షేర్ల‌ను కొనేందుకు మొగ్గుచూపుతారు. తీసుకున్న‌వారికి బాగా లాభం వ‌స్తుంద‌నే భ్ర‌మ‌లో త‌ప్పు చేయ‌కుండా ముందు కంపెనీ చ‌రిత్ర, ప్రాథ‌మిక విష‌యాల గురించి తెలుసుకొని అడుగేయ‌డం మంచిది.
ధర: ఒక కంపెనీ ఐపీఓ ద్వారా నిధులు సేక‌రించడానికి బ‌ల‌మైన కార‌ణం ఉంటుంది. కొన్ని కంపెనీలు వ్యాపారాన్ని విస్త‌రించేందుకు, వ్యాపార వృద్ధి కోసం సేక‌రిస్తాయి. మ‌రికొన్ని కంపెనీలు రుణాల‌ను చెల్లించేందుకు ప్ర‌క‌టిస్తాయి. కానీ చాలా సందర్భాల్లో ముఖ్యంగా కొత్త యునికార్న్ కంపెనీలు ఐపీఓకి రావ‌డానికి కార‌ణం.. ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు, వాటాదారులు త‌మ వాటాల‌ నుంచి నిష్క్రమించడం. ఈ వాటాదారులు సాధారణంగా పెద్ద సంస్థాగత పెట్టుబ‌డుదారులు, సంస్థ ఉద్యోగులు. వారు సొంత‌ సంస్థపై చాలా లోతైన అవగాహన కలిగి ఉంటారు. అదేవిధంగా సంస్థ వ్యాపార అవకాశాల గురించి వారికి తెలిసినంత‌గా బయటివారికి తెలియదు. ధ‌ర‌ల ఆధారంగా లాభాల‌ను సంపాదించేందుకు ఐపీఓ స‌రైన మార్గంగా భావిస్తారు. ప్రస్తుత వాటాదారులకు, మ‌ర్చంట్ బ్యాంకర్లకు గరిష్ఠ డబ్బు సంపాదించే విధంగా ఐపీఓ ధ‌ర‌లు ఉంటాయి. అయితే పెట్టుబ‌డుదారులు ఈ ఐపీఓతో ఎంత లాభం పొందుతారో గ‌మ‌నించుకోవాలి.

వృద్ధి, లాభాలు: గత కొన్నేళ్లుగా వచ్చిన అనేక కొత్త యునికార్న్‌లు భారీ ఎత్తున డిస్కౌంట్ల ప్ర‌క‌ట‌నల‌తో పెద్ద కంపెనీలుగా మారాయి. అయితే వ‌చ్చిన లాభాల‌న్నీ ఈ డిస్కౌంట్లు ప్ర‌క‌ట‌న‌ల‌కే స‌రిపోతున్నాయి. కంపెనీల‌కు చివ‌రికి న‌ష్టాలే మిగులుతున్నాయి. అయితే, ఐపీఓ పెట్టుబడుదారులు లాభం, వృద్ధి రెండింటినీ ఆశిస్తారు. కానీ ఈ స్టార్టప్‌లలో చాలా వరకు, ఒకేసారి లాభదాయకత వైపు వ్యాపార నమూనాకు మారడం కష్టం. అంతేకాక, డిస్కౌంట్లను తీసివేసినప్పుడు, అది వృద్ధిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు యూఎస్‌లోని ఉబెర్ కంపెనీ వంటివి చూడొచ్చు. చాలా కంపెనీల‌కు ఇదే ప‌రిస్థితి ఎదుర‌వుతుంది. అయితే అన్ని స్టార్ట‌ప్ కంపెనీల విష‌యంలో ఇది నిజం కాక‌పోవ‌చ్చు. కానీ ప్రైవేట్ కంపెనీ నుంచి ప‌బ్లిక్ కంపెనీగా మార‌డానికి డైన‌మిక్స్ గురించి తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం.

సమయం: ఈ ఐపీఓలన్నీ ఒకే సమయంలో ఎందుకు వస్తున్నాయి? ప్రతి యునికార్న్ వేరే వ్యాపార నమూనాను కలిగి ఉంటుంది. అకస్మాత్తుగా అన్నీ ఒకేసారి ఐపీఓకి రావ‌డం యాదృచ్చికమా? లేదా ప్ర‌స్తుతం స్టాక్ మార్కెట్ గ‌రిష్ఠ స్థాయుల్లో ఉండ‌టంతో ఈ స‌మ‌యంలో వ‌స్తే భారీ లాభాల‌ను పొంద‌గ‌ల‌మ‌ని చూస్తున్నారా. ఆ విష‌యాన్ని పెట్టుబ‌డుదారులు గ‌మ‌నించాలి. స్టార్టప్‌లు కంపెనీలు చరిత్రను చూస్తే చాలామందికి అందులో పెట్టుబ‌డులు పెట్టాల‌నేంత ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. కానీ దానిక‌ముందు ప్రాథ‌మికంగా అన్ని విష‌యాల గురించి విశ్లేష‌ణ అవ‌స‌రం. రిటైల్ పెట్టుబడిదారుడు ఏ కార‌ణంతో ఐపీఓలో భాగం కావాల‌నుకుంటున్నారో నిర్ణ‌యించుకోవాలి. తమకు లోతైన అవగాహన ఉందని, లాభం వ‌స్తుంద‌ని భావించి కొంద‌రు స‌బ్‌స్క్రైబ్‌ చేసుకుంటారు. కానీ చాలా మందికి ఈ కంపెనీలు మ‌న‌కు పెట్టుబ‌డులు పెట్టేలా ప్రేరేపిస్తున్నాయ‌న్న విష‌యం గ్ర‌హించ‌లేరు. అందుకే ఇలాంటి విష‌యాల్లో ఆర్థిక స‌ల‌హాదారుల సూచ‌న‌లు అవ‌స‌రం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని