Updated : 11 Nov 2021 15:28 IST

పిల్లల ఉన్నత విద్యకు నిధి సమకూర్చుకోవడం ఎలా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ఇప్పటికే కొనే సరకుగా మారిపోయిన విద్య.. నానాటికీ మరింత ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా అయిపోతోంది. వేలల్లో ఫీజులతో తమ విద్యాభ్యాసమంతా పూర్తయిపోందని ఒకప్పటి వాళ్లు చెప్పే మాట. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ప్రాథమిక స్థాయి కూడా దాటకముందే ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో ప్రస్తుతం పిల్లల ఉన్నత చదువులు పూర్తి చేయాలంటే పెద్ద మొత్తంలో సొమ్ము అవసరం. కాబట్టి వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారు తమ పిల్లల చదువు కోసం కొంత నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అందుకోసం వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికలను అమలు చేయాలి. చాలా మంది తల్లిదండ్రులు భవిష్యత్‌ పెట్టుబడులను స్థిరాస్తికి కేటాయిస్తారు. దీనికి తోడు చాలా మంది ద్రవ్యోల్బణాన్ని 6 శాతం అంచనాతో మదుపు చేస్తుంటారు. కానీ, విద్యారంగంలో 10-12 శాతం ద్రవ్యోల్బణం ఉంటుందన్నది గ్రహించాలి. ఆ మేరకు మదుపు చేయాలి. మరి అందుకు ఉన్న పెట్టుబడి మార్గాలేమిటో ఇప్పుడు చూద్దాం..

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): పెట్టుబ‌డి పెట్టిన మొత్తంపై మంచి వ‌డ్డీ రేటు, రాబ‌డిని అందించే దీర్ఘకాలిక పెట్టుబ‌డి ఎంపిక‌ల్లో ఇది ఒక‌టి. పీపీఎఫ్‌లో ప్రస్తుత వ‌డ్డీ రేటు వార్షికంగా 7.1% ఉంది. ఇక్కడ మీరు ఏడాదికి రూ.1.50 లక్షలు మదుపు చేస్తే.. 15 సంవత్సరాల అనంతరం ఇదే వ‌డ్డీరేటు కొన‌సాగితే దాదాపు రూ.46.50 ల‌క్షల మొత్తాన్ని పొందుతారు. ఇది సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డుల్లో ఒకటి. ఇది ప్రభుత్వం నిర్వహిస్తుంది. 15 ఏళ్లు లాక్‌-ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. మధ్యలో సొమ్ము అవసరం అయితే కొంతమొత్తాన్ని తీసుకోవచ్చు. 15 ఏళ్ల తర్వాత కూడా 5 ఏళ్ల చొప్పున పెట్టుబడి కొనసాగించొచ్చు. ఈ ఖాతాలో క‌నీసం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షలు పెట్టుబ‌డి పెట్టొచ్చు.

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న (SSY): 10 ఏళ్లలోపు బాలికల కోసం ప్రభుత్వం 2014లో ఈ ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. ఇందులో ఏడాదికి క‌నీస మొత్తం రూ.500, గ‌రిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుత వడ్డీరేటు వార్షికంగా 7.6% ఇస్తున్నారు. 15 ఏళ్లు పెట్టుబడి పెట్టాలి. ఖాతా మెచ్యూరిటీ బాలిక‌ల వ‌య‌స్సు 21 సంవ‌త్సరాలు వచ్చే వరకు. మెచ్యూరిటీ అనంత‌రం వ‌చ్చే అధిక మొత్తం న‌గ‌దును బాలిక‌ల ఉన్నత విద్యకు, వివాహానికి ఉప‌యోగించొచ్చు.

మ్యూచువ‌ల్ ఫండ్స్ (MF): మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో మ‌నం పెట్టిన పెట్టుబ‌డుల‌ను నిపుణులైన ఫండ్ మేనేజ‌ర్లు నిర్వహిస్తారు. అధిక కాలానికి రిస్క్ వైఖ‌రిని ఫండ్ ఎంచుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్‌లో కాస్త రిస్క్ తక్కువగా ఉంటాయి. ఒక ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు. అయితే, మ్యూచువల్ ఫండ్స్‌లో కచ్చితమైన రాబడి వస్తుందని చెప్పలేం. సిప్ ద్వారా నెల నెలా పెట్టుబడి పెడితే కొంత వరకు రిస్క్ తగ్గొచ్చు. దీర్ఘకాలంలో సగటున 10 నుంచి 12 శాతం వరకు రాబడి ఆశించొచ్చు.

చివరగా..: అత్యవసర పరిస్థితుల్లో కూడా పిల్లల విద్యా నిధి ప్రభావితం కాకూడదు. కాబట్టి అన్ని ర‌కాల అత్యవసర పరిస్థితుల కోసం ఆరోగ్య బీమా, జీవిత బీమా (టర్మ్‌ ఇన్సూరెన్స్‌) కోసం ప్రణాళికలు వేసుకోండి. మీ పిల్లల విద్య కోసం పెట్టుబడి ప్రణాళికలను తాకకుండా ఉండడానికి ప్రయత్నించండి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని