ఆరోగ్య బీమా పాలసీ ఎలా ఎంచుకోవాలి?

పాలసీలు తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

Published : 07 Jul 2021 15:16 IST

ఏదైనా ఆరోగ్య బీమా పాలసీ గురించి చెప్పగానే వెంటనే ప్రీమియం ఎంత అనే ప్ర‌శ్న‌ ఎక్కువగా వినిపిస్తుంది. ఆ మొత్తం అందుబాటులో ఉంటే చాలు పత్రాల మీద సంతకాలు చేసేస్తారు. ప్రీమియం చెల్లించాం...కాబట్టి ఇక ఏ అనారోగ్యం వచ్చినా బీమా సంస్థే బిల్లు చెల్లిస్తుందనే భరోసాతో ఉంటారు. తీరా ఆసుపత్రికి వెళ్లి, జేబులో డబ్బులు ఖర్చు అయితే తప్ప పాలసీలో పరిమితులు, లోటుపాట్లు ఏంటో తెలిసిరావు. కుటుంబం లో ఒక్క వ్యక్తి అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం ఆర్ధికంగా కొన్నేళ్లు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఆరోగ్య పాలసీలు అండగా ఉంటాయి. ఇలాంటి పాలసీలు తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.

బీమా కూడా ఒక వ్యాపారమే అన్న విషయాన్ని విస్మరించరాదు. మరి వ్యాపారాలు ఏం కోరుకుంటారు..లాభాలు రావాలనే కదా? బీమా కంపెనీలు కూడా అంతే. క్లెయిమ్ ల శాతాన్ని తగ్గించుకోవడానికి పరిమితులు, ఉప పరిమితులు, క్యాషులెస్ సౌకర్యాల కొత్త లాంటి నిబంధనలు చేరుస్తు ఉంటారు. మనం సంతకం పెట్టేటప్పుడు పాలసీ ప్రతిపాదిత పాత్రలలో ఇవన్నీ ఉంటాయి, కానీ వీటిని చ‌దివే ఓపిక ఎవరికీ ఉండదు. అసలు ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నప్పుడు ఏం చూడాలంటే..

వైద్య పరీక్షలు:
వయసు పెరిగే కొద్దీ రోగాలు చుట్టముట్టడం సహజం. 45 ఏళ్ళు దాటిన వారికి వైద్య పరీక్షలు తప్పనిసరి. మీరే పరీక్షలు జరిపించి నివేదిక ఇస్తామంటే కుదరదు. బీమా కంపెనీ డాక్టర్ల బృందం పరిశీలించి ఇచ్చే నివేదిక ఆధారంగా మీకు పాలసీ ఇస్తారు. వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధులు ఉన్నాయనుకోండి ప్రీమియం సాధారణం కంటే ఎక్కువ చెల్లించడానికి సిద్ధపడాల్సిందే. ఆస్తమా ఒక్కటి చాలు ప్రీమియం పెంచడానికి.

ముందు నుంచి ఉన్న వ్యాధులు:
సాధారణంగా ముందు నుంచే ఉన్న వ్యాధులకు వెంటనే కవరేజీ ఉండదు. అయితే కనీసం 2 లేదా 3 ఏళ్ళు పాలసీని పునరుద్ధరించుకుంటే, అప్పుడు ఆ వ్యాధులకు పాలసీ లో కవరేజీ పొందొచ్చు. కొన్నింటికి ప్రీమియం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు లేదా అసలు కవర్ చేయకపోవచ్చు.

30 రోజులు ఆగాల్సిందే :
పాలసీ తీసుకున్న మరుక్షణం నుంచే బీమా రక్షణ ఉంటుందనుకుంటారు చాలా మంది. మిగతా పాలసీల్లో ఇది వర్తిస్తుందేమో కానీ ఆరోగ్య బీమా పాలసీల్లో మాత్రం కనీసం 30 రోజులు ఆగాల్సిందే. బీమా పరిభాష లో దీన్ని కూల్ ఆఫ్ పీరియడ్ అంటారు. ఏదైనా వ్యాధి ఉన్నా ఈ నెల రోజుల్లో బయట పడుతుందనేది కంపెనీల ఆలోచన.   అయితే ప్రమాదాలకు, పాలసీ పునరుద్ధరణకు ఇది వర్తించదు. ప్రసూతి కి  కవరేజీ రావాలంటే కనీసం 2 ఏళ్ళు ఆగాల్సిందే.

పరిమితులు:
ఇది ఆరోగ్య బీమా పాలసీల్లో చాలా ముఖ్యమైన అంశం. అధిక బిల్లులను చెల్లించకుండా ఉండడం కోసం బీమా కంపెనీలు అన్ని రకాల పరిమితులను అమల్లోకి తెస్తున్నాయి. ఉదాహరణకి రూ. 2 లక్షల బీమా హామీ ఉన్న పాలసీ తీసుకున్నారనుకుందాం. ఇందులో ఆసుపత్రి గదికి రోజు వారీ అద్దె 1 శాతానికే  పరిమితం కావచ్చు. అంటే రూ. 2000 వరకు కంపెనీ కడుతుంది, ఆ పైన ఎంత అయితే అంత పాలసీ దారుడు చెల్లించాల్సిందే. వైద్యుల ఫీజు, ఐసియూ లాంటి వాటికి కూడా పరిమితులు ఉంటాయి.      

కంపెనీ సంగతి ఏంటి?
ఎలాంటి కంపెనీ ని ఎంచుకోవాలి? ఎంచుకున్న కంపెనీ సమయానికి మన క్లెయిమ్ కి తగ్గట్టు డబ్బులు చెల్లిస్తుందా, లేదా? ఈ ప్రశ్నలకి సమాధానం క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి. అంటే, కంపెనీ కి అందిన ప్రతి 100 క్లెయిమ్ దరఖాస్తుల్లో ఎన్ని దరఖాస్తులని కంపెనీ పూర్తి చేసి డబ్బులు చెల్లించింది అని అర్ధం. 2019-20 ఐఆర్డీఏ లెక్కల ప్రకారం అత్యధిక క్లెయిమ్ సెటిల్మెంట్ గల కంపెనీలు హెచ్డీఎఫ్సి ఎర్గో (99.8 శాతం),  ఈడెల్వెయిస్ (99.7 శాతం), గో-డిజిట్(99.65 శాతం) గా ఉన్నాయి. అయితే, ప్రైవేట్ కంపెనీలలో ఇన్కర్డ్ క్లెయిమ్ నిష్పత్తి (ఐసీఆర్), అంటే అత్యధికంగా సొమ్ము చెల్లించిన వాటిల్లో 70 శాతం దాటిన ఒకే ఒక కంపెనీ హెచ్డీఎఫ్సి ఎర్గో. దీని ప్రకారం ప్రభుత్వ ఆరోగ్య బీమా కంపెనీలు అన్నీ 100 శాతానికి పైనే చెల్లించాయి. కాబట్టి, అందిన ప్రీమియం కంటే ఎక్కువే చెల్లించారని అర్ధం. కంపెనీలు నష్టాల్లో జారుకుంటున్నట్టు కూడా ఇదొక సంకేతం. మీరు ఈ సంఖ్యల పరంగా కంపెనీ ని ఎంచుకోవచ్చు.        

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని