అందుబాటు ధ‌ర‌లో ఇల్లు కొనేవారికి శుభ‌వార్త‌

అందుబాటు ధ‌ర‌లోని ఇళ్ల‌కు ప్రైవేటు పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హించ‌డంలో భాగంగా కేంద్రం కొత్త‌ ప్ర‌భుత్వ‌-ప్రైవేట్ భాగ‌స్వామ్య(పీపీపీ) విధానాన్ని ప్ర‌క‌టించింది. 2022 నాటిక‌ల్లా అందరికీ ఇళ్లు అన్న ల‌క్ష్యం దిశ‌గా కేంద్రం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

Published : 16 Dec 2020 14:57 IST

ఇళ్ల నిర్మాణ రంగంలో ప్రైవేటు సంస్థల పెట్టుబడులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ పథకం కింద అందించే రూ.2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని వీటికి కూడా వర్తింపజేయనుంది.

అందుబాటు ధ‌ర‌లోని ఇళ్ల‌కు ప్రైవేటు పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హించ‌డంలో భాగంగా కేంద్రం కొత్త‌ ప్ర‌భుత్వ‌-ప్రైవేట్ భాగ‌స్వామ్య(పీపీపీ) విధానాన్ని ప్ర‌క‌టించింది. 2022 నాటిక‌ల్లా అందరికీ ఇళ్లు అన్న ల‌క్ష్యం దిశ‌గా కేంద్రం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

నేష‌న‌ల్ రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప్‌మెంట్ కౌన్సిల్‌(న‌రెడ్కో) ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక సద‌స్సులో కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ స‌హాయ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన పీపీపీ ప‌థ‌కంలో 8 ఐచ్ఛికాల‌ను పొందుప‌రిచారు.

వ‌డ్డీ రాయితీగా రూ.2.5ల‌క్ష‌లు
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద రుణ అనుసంధాన రాయితీ పథకం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా లబ్ధిదారులు తీసుకొనే బ్యాంకు రుణానికి చెల్లించాల్సిన వడ్డీలో కేంద్రం రాయితీ ఇస్తుంది. వడ్డీ రాయితీ కింద రూ.2.5లక్షలను ముందస్తుగా చెల్లిస్తుంది. ప్రైవేటు స్థలంలో కట్టిన ఇళ్లకూ ఇది వర్తిస్తుంది.

బ్యాంకు రుణాలు తీసుకోనివారికి…
లబ్ధిదారులు బ్యాంకు రుణాలు తీసుకోకపోతే ప్రైవేట్‌ స్థలంలో నిర్మించిన ఇళ్లకూ రూ.1.50 లక్షల వంతున ఆర్థిక సహాయం అందిస్తుంది.

నిర్మాణానికి అనుగుణంగా…
ప్రైవేటు స్థిరాస్తి సంస్థలు… ఆకృతి రూపొందించు- నిర్మించు-బదలాయించు పద్ధతిలో ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించవచ్చు. నిర్మాణానికి అనుగుణంగా నిధులు విడుదల చేస్తారు.

విలాసవంత‌మైన ఇళ్లు సైతం…
ప్రభుత్వ స్థలంలో వాణిజ్య సముదాయాలు, విలాసవంతమైన ఇళ్లు కూడా నిర్మించుకోవచ్చు. వాటి ద్వారా సంపాదించే మొత్తంతో అందుబాటులో ఉండే ధరకే లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వవచ్చు.

ఇళ్ల సంఖ్య‌ను బ‌ట్టి స్థ‌ల కేటాయింపు
ప్రైవేటు స్థిరాస్తి వ్యాపారులు తమ పెట్టుబడితో ఇళ్లు నిర్మించాల్సి ఉంటుంది. రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం వార్షిక మొత్తాల రూపంలో చెల్లిస్తుంది. నిర్మించే ఇళ్ల సంఖ్యను బట్టి స్థలాన్ని కేటాయిస్తారు.

ప్ర‌భుత్వ స్థ‌లంలో…
స్థిరాస్తి అభివృద్ధిదారులకు ‘వార్షిక చెల్లింపులు-గ్రాంట్లు’ అన్ని విధానంలో ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించవచ్చు. ప్రభుత్వం తన వాటా కింద కొంత మొత్తాన్ని ముందస్తుగా చెల్లిస్తుంది.

నేరుగా బిల్డ‌ర్లు-ల‌బ్ధిదారులే…
ప్రభుత్వ మధ్యవర్తిత్వంలో లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు, బిల్డర్లకు చెల్లింపులు జరిగే బదులు నేరుగా బిల్డర్లు-లబ్ధిదారులే లావాదేవీలు జరుపుకొనే అవకాశం కూడా కల్పిస్తారు. ఇళ్ల సంఖ్యను అనుసరించి ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తారు.

అద్దెల రూపంలో వ‌సూలు
ప్రభుత్వస్థలంలో ఇళ్లు నిర్మించి మొత్తం వ్యయాన్ని అద్దెల రూపంలో వసూలు చేసుకోవచ్చు. ప్ర‌ధానంగా ఈ 8 ఐచ్ఛికాలతోనే కొత్త‌ పీపీపీ విధానాన్ని ప్ర‌భుత్వం రూపొందించింది.

అద్దెలపై త్వరలో చట్టం
కేంద్ర ప్ర‌భుత్వం త్వరలో నమూనా అద్దె చట్టం, జాతీయ అద్దె ఇళ్ల విధానాన్ని ప్ర‌క‌టించ‌నుంది. దిల్లీ, ముంబయి న‌గ‌రాల్లో ఆన్‌లైన్‌లోనే భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నారు. దేశంలోని 53 నగరాలకు కూడా ఈ విధానాన్ని త్వ‌ర‌లో అమలులోనికి తీసుకురానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని