Airtelకు మరో ఐదేళ్లు గోపాల్‌ విఠలే బాస్‌.. ఏడాదికి కోట్లలో వేతనం!

Airtel MD Gopal Vittal: ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ (Airtel) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా గోపాల్‌ విఠల్‌ (Gopal Vittal) కొనసాగనున్నారు.

Updated : 13 Aug 2022 20:26 IST

దిల్లీ: ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ (Airtel) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా గోపాల్‌ విఠల్‌ (Gopal Vittal) కొనసాగనున్నారు. మరో ఐదేళ్ల పాటు ఆయనే ఎండీగా ఉండేందుకు వాటాదారులు  ఆమోదం తెలిపారు. 2023 ఫిబ్రవరి 1 నుంచి ఈ నియామకం అమల్లోకి రానుంది. 97 శాతానికి పైగా వాటాదారులు ఆయనే ఎండీగా, సీఈఓగా ఉండాలని నిర్ణయించినట్లు ఆ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ మేరకు కంపెనీ వార్షిక సాధారణ సమావేశం (AGM)లో నిర్ణయం తీసుకున్నారు. ఆయన వేతన విషయంలో ప్రతిపాదించిన మరో తీర్మానానికీ 89.57 శాతం మంది అనుకూలంగా ఓటువేయగా. 10.42 శాతం మంది మాత్రమే వ్యతిరేకించారు.

ఎయిర్‌టెల్‌ ఎండీ గోపాల్‌ విఠల్‌ 2018 ఫిబ్రవరి 1న బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్ల పదవీ కాలం 2023తో ముగియనున్న నేపథ్యంలో ఏజీఎంలో దీనిపై చర్చించారు. వాటాదారుల ఆమోదం పొందడంతో 2023 నుంచి మరో ఐదేళ్లు అంటే 2028 జనవరి 1 వరకు ఆయనే ఎండీ, సీఈఓగా వ్యవహరించనున్నారు. అలాగే ఈ కాలంలో ఆయన వార్షిక వేతనాన్ని నిర్ణయించారు. ఆయన స్థిర వేతనం రూ.9.6 కోట్లు చెల్లించేందుకు వాటాదారులు ఆమోదం తెలిపారు. ఒకవేళ ఇంక్రిమెంట్‌ ఇచ్చినా ఏడాదికి 15 శాతానికి మించకూడదు. అలాగే ప్రతి ఆర్థిక సంవత్సరం చివర్లో పనితీరు ఆధారంగా చెల్లించే వేరియబుల్‌ పే పైనా నిర్ణయం తీసుకున్నారు. 100 శాతం పనితీరు కనబరిచినప్పుడు ఏడాదికి 6.2 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు. కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ గోపాల్‌ విఠల్‌ రూ.9.1 కోట్లు వేతనం అందుకున్నారు. దీనికి వేరియబుల్‌ పే అదనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని