Akasa Air: బెంగళూరు-ముంబయి మార్గంలోనూ ఆకాశ ఎయిర్‌ సర్వీసులు.. ఎప్పటి నుంచంటే?

Akasa Air: ఆగస్టు 19 నుంచి బెంగళూరు-ముంబయి మార్గంలోనూ విమాన సేవలను ప్రారంభించనున్నట్లు ఆకాశ ఎయిర్ మంగళవారం ప్రకటించింది....

Published : 26 Jul 2022 23:55 IST

దిల్లీ: ఆగస్టు 19 నుంచి బెంగళూరు-ముంబయి మార్గంలోనూ విమాన సేవలను ప్రారంభించనున్నట్లు ఆకాశ ఎయిర్ మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త విమానయాన సంస్థ తన మొదటి సర్వీసును ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో ఆగస్టు 7న ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అలాగే ఆగస్ట్ 13న బెంగళూరు-కొచ్చి మార్గంలో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి.

‘‘అహ్మదాబాద్, ముంబయి, కొచ్చి, బెంగళూరు వంటి కీలక నగరాల్లో ఆకాశ ఎయిర్ తన నెట్‌వర్క్ అభివృద్ధి ప్రారంభ దశను పూర్తి చేయనుంది. కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి కొన్ని వారాల్లోనే మొత్తం 82 వీక్లీ సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నాం’’ అని ఆకాశ ఎయిర్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ముంబయి-అహ్మదాబాద్ మధ్య వారానికి 26 సర్వీసులు నడపనుండగా, బెంగళూరు-కొచ్చి మార్గం, బెంగళూరు-ముంబయి మార్గంలో వారానికి 28 సార్లు సర్వీసులు నడపనున్నట్లు పేర్కొంది.

ఎయిర్‌లైన్ కోడ్ ‘QP’తో సేవలు ప్రారంభించనున్న ఆకాశ ఎయిర్‌ ఆగస్టు 7 నుంచి రెండు విమానాలతో వాణిజ్య కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనుంది. ప్రతినెలా రెండు విమానాల చొప్పున 2023 చివరి నాటికి మొత్తం 18 విమానాలను తన ఫ్లీట్‌లో చేర్చుకుంటామని కంపెనీ ఇటీవల తెలిపింది. ఆ తర్వాత ప్రతి 12 నెలలకు మరో 12 నుంచి 14 విమానాలు కంపెనీకి అందనున్నాయని పేర్కొంది. మొత్తం 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను సంస్థ ఆర్డర్‌ చేసింది. ఐదేళ్లలో వీటిని అందజేయాల్సి ఉంది. జూలై 7న ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’ నుంచి ఆకాశ ఎయిర్‌ ‘ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్’ పొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని