Updated : 26 May 2022 13:26 IST

యాన్యుటీ ప్లాన్‌లు బ‌హుమ‌తిగా ఇవ్వడం ఎంత వరకు సరైనది?

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఎవ‌రికైనా డ‌బ్బు అవ‌స‌ర‌మే, అప్ప‌టిదాకా ఉన్న ఉపాధి ఉండ‌దు. అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా ఏర్ప‌డ‌తాయి. వారి స్వంత ఖ‌ర్చుల‌కు డ‌బ్బు అవ‌స‌రం ఎక్కువ ఏర్ప‌డేది కూడా ప‌ద‌వీవిర‌మ‌ణ వ‌య‌స్సు త‌ర్వాతే. అటువంటి ప‌రిస్థితుల్లో ఆర్ధిక వ‌న‌రుల అవ‌స‌రం చాలా ఉంటుంది. అలాంట‌ప్పుడే త‌ల్లిదండ్రుల‌కు హామి ఇవ్వ‌బ‌డిన ఆదాయ వ‌న‌రుల‌ను పొందేందుకు పిల్ల‌లు యాన్యుటీ ప్లాన్‌ని కొనుగోలు చేసి బ‌హుమ‌తిగా ఇవ్వాలనుకుంటారు. యాన్యుటీ ప్లాన్‌, వారు ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత ఆర్ధికంగా స‌హాయ‌ప‌డుతుంది అని వారి భావన. యాన్యుటీ ప్లాన్‌ లో ఉమ్మ‌డి జీవిత ఎంపిక‌ను క‌లిగి ఉన్న యాన్యుటీ ప్లాన్‌ల‌ను కూడా ఉన్నాయి.

మీ జీవిత ల‌క్ష్యాల‌న్నింటినీ నెర‌వేర్చుకోవ‌డానికి మీ త‌ల్లిదండ్రులు నిస్సందేహంగా క‌ష్ట‌ప‌డి ఉంటారు. వారు మీ జీవితంలో కీల‌క‌మైన మైలురాళ్ల‌ను స‌జావుగా సాధించ‌డానికి ఆర్ధిక ప్ర‌ణాళిక‌లు, పెట్టుబ‌డుల‌ను రూపొందించే ఉంటారు. మీ పాఠ‌శాల విద్య‌, మీ గ్రాడ్యుయేష‌న్ నుండి మీ పెళ్లి, మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించే వ‌ర‌కు మీ త‌ల్లిదండ్రులు అడుగ‌డుగునా ఆర్ధికంగా మీకు మ‌ద్ద‌తుగా ఉండే ఉంటారు.

ఆ త‌ర్వాత మీ వంతుగా త‌ల్లిదండ్రుల ప‌ద‌వీ విర‌మ‌ణ ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చ‌డానికి మీరు వారికి సహాయం చేయాలి. భార‌త‌దేశ పెట్టుబడి రంగం నేటి యువ‌త‌కు త‌మ త‌ల్లిదండ్రుల భ‌విష్య‌త్తును ఆర్ధికంగా సుర‌క్షితంగా ఉంచే అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత హామి ఇవ్వ‌బ‌డిన ఆదాయ వ‌న‌రుల‌ను పొందేందుకు రూపొందించ‌బ‌డిన ఏదైనా పెన్షన్ పధకం, మీ త‌ల్లిదండ్రుల ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత ఆర్ధిక ప‌రిపుష్టితో వారికి స‌హాయ‌ప‌డ‌గ‌ల‌దు. కాబ‌ట్టి మీరు మీ త‌ల్లిదండ్రుల‌కు బ‌హుమ‌తిగా ఇవ్వ‌డానికి స‌రైన పెన్షన్  ప్లాన్‌ని ఎంచుకోవాలి.

ఎలాంటి పెన్షన్ ప్లాన్‌లు ఎంచుకోవాలి?

మీరు మీ త‌ల్లిదండ్రుల కోసం పెన్షన్ ప్లాన్ కోసం చూస్తున్న‌ట్ల‌యితే, దేశంలోని బీమా/పెట్టుబడి మార్కెట్ లో ఎంచుకోవ‌డానికి అనే ర‌కాల ఎంపిక‌ల‌ను ఉన్నాయి. త‌క్ష‌ణ యాన్యుటీ ప్లాన్‌లు (ఇమ్మీడియేట్), వాయిదా వేసిన యాన్యుటీ(డిఫర్డ్) ప్లాన్‌లు వంటి వాటిల్లో అధిక చార్జీలు ఉంటాయి. దీని వల్ల రాబడి సరిగ్గా ఉండదు. సగటు రాబడి 3-5 శాతం వరకు మాత్రమే ఉంటుంది. ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండడం మంచిది.

మీ తల్లి దండ్రుల కోసం ఎలాంటి పధకాలు ఎంచుకోవాలి?

ఎన్‌పీఎస్:

ఉద్యోగ విర‌మ‌ణ అనంత‌రం ఆర్ధిక అవ‌స‌రాలు తీర్చుకోవ‌డానికి పెన్ష‌న్ అనేది ఎవ‌రికైనా అవ‌స‌ర‌మే. దీనికి `ఎన్‌పీఎస్` (నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్‌)లో పెట్టుబ‌డి మంచి ఆప్ష‌న్‌గానే మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన, దీర్ఘ‌కాలంలో ఉప‌యోగ‌ప‌డే పొదుపు ప‌థ‌కాన్ని ప్రారంభించాల‌ని మీకు అనిపిస్తే `ఎన్‌పీఎస్‌` స‌రైన పెన్ష‌న్ ప‌థ‌కం అని చెప్ప‌వ‌చ్చు. ఎన్‌పీఎస్ పెట్టుబ‌డి ఎక్కువ‌గా పెట్టుబ‌డిదారుడి ప‌ద‌వీ విర‌మ‌ణపై దృష్టి పెడుతుంది. ప్ర‌స్తుతం `పీఎఫ్ఆర్‌డీఏ` అందించే ఈ పెన్ష‌న్ ప‌థ‌కం `ఎన్‌పీఎస్‌`లో 18-75 ఏళ్ల మ‌ధ్య ఉన్న భార‌తీయ పౌరులంద‌రికీ అందుబాటులో ఉంటుంది. యాన్యుటీ ప్లాన్‌ల కంటే ఇందులో చార్జీలు చాలా తక్కువ. కాబట్టి, మంచి పెన్షన్ అందించగలదు.

సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్ స్కీమ్:

చాలా మంది ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన‌వారి మొద‌టి ఎంపిక ఇది. సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అనేది చాలా మంది ఉద్యోగ విర‌మ‌ణ చేసేవారి పెట్టుబ‌డి పోర్ట్‌ఫోలియోలో త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. పేరులో ఉన్న‌ట్లుగానే ఈ ప‌థ‌కం సీనియ‌ర్ సిటిజ‌న్‌లు లేదా ముందుగా ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన వారికి మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. 60 ఏళ్లు పైబ‌డిన ఎవ‌రైనా పోస్టాఫీస్ లేదా బ్యాంకు నుండి ఈ ప‌థ‌కంలో చేర‌వచ్చు. ప్ర‌స్తుతం వ‌డ్డీ రేటు సంవ‌త్స‌రానికి 7.40% ఉంది. వ‌డ్డీ త్రైమాసికానికి చెల్లిస్తారు. క‌నీసం రూ. 1,000 తో ఖాతా తెర‌వొచ్చు. గ‌రిష్ట పెట్టుబ‌డి ప‌రిమితి రూ. 15 ల‌క్ష‌లు. మ‌ధ్య‌లో ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తి ఉంటుంది. మీ తల్లి దండ్రులు ఇందులో అర్హులు అయితే మీ వద్ద ఉన్న మొత్తం తో పాటు వారి వద్ద ఉన్న కొంత పదవీ విరమణ మొత్తాన్ని జోడించి ఖాతా తెరవచ్చు. ఇది పూర్తిగా సురక్షితమైన పధకం.

ఫిక్స్‌డ్ డిపాజిట్స్:

ప్ర‌స్తుతం మంచి క్రెడిట్ రేటింగ్ ఉన్న కొన్ని ప్రైవేట్‌ బ్యాంకులు, ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్ల కంటే కొద్దిగా ఎక్కువ వ‌డ్డీ రేట్ల‌ను అంటే సుమారుగా 6.50-7.50% దాకా వ‌డ్డీ రేటును సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం అందిస్తున్నాయి. పెట్టుబ‌డి సౌల‌భ్యం, స్ప‌ష్ట‌మైన హామీ రాబ‌డి, వివిధ కాల‌వ్య‌వ‌ధులను ఎంచుకోవ‌డానికి అవ‌కాశం ఉండ‌టం వ‌ల్ల దేశీయంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ప్ర‌స్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు పెరిగాయి, మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

మీరు రూ. 10 ల‌క్ష‌లు ఎఫ్‌డీలో పెట్టాల‌నుకుంటే అన్నింటిని ఒకే ఎఫ్‌డీలో 5 సంవ‌త్స‌రాల పాటు పెట్టుబ‌డి ఏక‌మొత్తంగా పెట్ట‌డానికి బ‌దులు, రూ. 2 ల‌క్షల‌ మొత్తాన్ని 5 ఎఫ్‌డీలుగా విడ‌దీసి పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. మొద‌టి ఎఫ్‌డీ కాల‌వ్య‌వ‌ధి ఒక సంవ‌త్స‌రం, రెండ‌వ‌ది 2 సంవ‌త్స‌రాలు, మూడ‌వ‌ది 3 సంవ‌త్స‌రాలు, నాల్గ‌వ‌ది 4 సంవ‌త్స‌రాలు, ఐద‌వ‌ది 5 సంవ‌త్స‌రాలు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని