Annuity Plans: రిటైర్‌మెంట్ త‌ర్వాత స్థిర ఆదాయం కోసం యాన్యుటీ ప్లాన్లు అనుకూల‌మేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగం చేస్తున్న వారు నిర్దిష్ట వ‌య‌సులో రిటైర్ అవ్వ‌క త‌ప్ప‌దు. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత నెలవారీగా వ‌చ్చే ఆదాయం ఆగిపోతుంది. అప్ప‌టి వ‌ర‌కు ఆర్థిక స్వాతంత్ర్యంతో జీవించిన వారికి ఇత‌రుల‌పై ఆధార‌ప‌డి జీవించాలంటే క‌ష్టమే. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా ఎవరిపైనా ఆధార‌పడ‌కుండా జీవించాలంటే క్ర‌మ‌మైన ఆదాయం త‌ప్ప‌నిస‌రి. ఇందుకోసం ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం మ‌దుపు చేయాలి. ఇలా స‌మ‌కూర్చుకున్న నిధిని ఉత్త‌మ ఫ‌లితాలు పొందేవిధంగా వినియోగించిన‌ప్పుడే ప‌ద‌వీ విరమ‌ణ జీవితాన్ని ఎలాంటి భ‌యాందోళ‌న‌లు లేకుండా జీవించ‌వ‌చ్చు. ఆర్థిక నిర్వ‌హ‌ణ‌లో లోపం ఉంటే భవిష్య‌త్‌లో ఇబ్బందులు ఎదుర్కోక త‌ప్ప‌దు.

పెట్టుబ‌డుల ఎంపిక విష‌యంలో జాగ్ర‌త్త‌: కొవిడ్‌-19 ప్ర‌జ‌ల ఆర్థిక జీవ‌నం, పెట్టుబ‌డుల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపించింది. ప్ర‌త్యేకించి ప‌దవీ విర‌మ‌ణ పొందిన వారు, ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు చేరువ‌లో ఉన్న‌వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన‌డంతో స్థిరాదాయ పెట్టుబ‌డుల‌పై వ‌డ్డీ రేట్లు త‌గ్గాయి. దీంతో రాబ‌డి త‌గ్గిపోయింది. ఉదాహ‌ర‌ణ‌కు పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్లను తీసుకుంటే 2020 జ‌న‌వ‌రి-మార్చి త్రైమాసికంలో 7.9 శాతం ఉన్న వ‌డ్డీ రేటు.. 2020 ఏప్రిల్‌-జూన్ త్రైమాసికంలో 7.1 శాతానికి చేరుకుంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అంటే 2021 ఆద్యంతం వార్షిక వ‌డ్డీ రేటు 7.1 శాతంగానే ఉంది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లు కూడా చాలా వ‌ర‌కు త‌గ్గాయి. త‌గ్గుతున్న వ‌డ్డీ రేట్ల నుంచి ఊర‌ట‌నిచ్చేందుకు కొన్ని బ్యాంకులు పెద్దల‌కు ప్ర‌త్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ఆఫ‌ర్ చేస్తున్న‌ప్ప‌టికీ అవి ద్రవ్యోల్బణాన్ని అధిగ‌మించేంత‌గా లేవు. పైగా రానున్న రోజుల్లో మ‌రింత త‌గ్గే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు. అందువ‌ల్ల పెట్టుబ‌డుల ఎంపిక‌లో స‌రైన నిర్ణ‌యం తీసుకోవ‌డం చాలా ముఖ్యం. రిటైర్‌మెంట్ తర్వాత మ‌రో 20-30 సంవ‌త్స‌రాల జీవితం ఉంటుంది. ప‌రిమిత ఆర్థిక వ‌న‌రులు ఉన్న‌వారు సుర‌క్షిత‌మైన‌, స్థిర‌మైన రాబ‌డి ఇచ్చే పెట్టుబ‌డుల ఎంపిక‌తో పోర్ట్‌ఫోలియోను తెలివిగా నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

యాన్యుటీ ప్లాన్లు: వృద్ధాప్యంలో ఉన్న‌వారికి కుటుంబ స‌భ్యుల‌ ప్రేమ, మద్దతు ఎంత ముఖ్య‌మో.. ఆర్థికంగా ఇతరుల సహాయం లేకుండా జీవించ‌గ‌ల‌గ‌డం కూడా అంతే ముఖ్యం. కుటుంబ సభ్యులు తమ ఆర్థిక అవసరాలకు మీ పైనే ఆధారపడినప్పుడు రోజువారీ ఖ‌ర్చులు, అవ‌స‌రాల కోసం జీతం స్థానంలో క్ర‌మ‌మైన స్థిర ఆదాయం ఉండాలి. యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల క్ర‌మ‌మైన స్థిర ఆదాయాన్ని ఆర్జించేందుకు వీలవుతుంది. ఉదాహరణకు మీపై ఆధారపడిన పిల్లలు, జీవిత భాగస్వామి, మీ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి.. ఈ ప్లాన్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని వారి అవసరాలను తీర్చేందుకు వాడుకోవచ్చు. అందువ‌ల్ల త్వరలో పదవీ విరమణ చేయబోతున్న వారూ.. లేక ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారికీ యాన్యుటీ ప్లాన్లు అనుకూలంగానే ఉంటాయి. పదవీ విరమణ నాటికి ప్రావిడెంట్‌ ఫండ్‌, పింఛన్‌ ఫండ్‌, గ్రాట్యుటీ చెల్లింపులు ఇలా పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. ఈ మొత్తాన్ని మీ భవిష్యత్‌కు ఉపయోగపడేలా మదుపు చేసుకోవాలి.

యాన్యుటీ ప్లాన్లలో ప్ర‌స్తుతం ఉన్న వ‌డ్డీ రేటును లాక్ చేయొచ్చు. 10/15/20/25 సంవత్సరాల కాలానికి మాత్రమే కాదు మీరు జీవించి ఉన్నంత కాలం వ‌డ్డీరేట్ల‌ను లాక్-ఇన్ చేసేందుకు అనుమతిస్తాయి. 60 ఏళ్ల వ్యక్తి యాన్యుటీ ప్లాన్‌ని కొనుగోలు చేసి, 6 శాతం వార్షిక రాబ‌డి పొందుతుంటే 10 సంవ‌త్స‌రాల త‌ర్వాత 4 లేదా 5 శాతానికి వ‌డ్డీ రేట్లు తగ్గినా, పెట్టుబ‌డిదారుడు పాలసీ వ్యవధి వరకు 6 శాతం వార్షిక వ‌డ్డీ రేటుతోనే పెన్ష‌న్‌ అందుకుంటారు. అంతేకాకుండా రీ-ఇన్వెస్ట్‌మెంట్‌ రిస్క్‌ను త‌గ్గించుకోవ‌డంతో పాటు దీర్ఘ‌కాలం జీవిస్తే రెగ్యుల‌ర్ ఆదాయం కోల్పోకుండా యాన్యుటీ ప్లాన్లు స‌హాయ‌ప‌డ‌తాయి.

యాన్యుటీ ప్లాన్ల ర‌కాలు: యాన్యుటీ ప్లాన్లు రెండు ర‌కాలుగా ఉంటాయి. ఒక‌టి ఇమ్మిడియట్‌ యాన్యుటీ ప్లాన్లు, రెండు డిఫ‌ర్డ్ యాన్యుటీ ప్లాన్లు.

ఇమ్మిడియట్‌ యాన్యుటీ ప్లాన్లు: ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన వారికి ఇమ్మిడియట్‌ యాన్యుటీ ప్లాన్లు అనుకూలంగా ఉంటాయి. ఈ విధానాన్ని ఎంచుకున్న వారికి ప్లాన్ కొనుగోలు చేసిన త‌ర్వాతి నెల నుంచే పెన్ష‌న్ రావ‌డం ప్రారంభ‌మ‌వుతుంది. ఏక మొత్తంలో పెట్టుబ‌డులు పెట్టాలి. జాయింట్ లైఫ్ ఇమ్మిడియట్‌ విత్ ప‌ర్చేజ్ రిట‌ర్న్‌ యాన్యుటీ ప్లాన్‌ను ఎంచుకుంటే.. పాల‌సీదారుడు జీవించి ఉన్నంత కాలం అత‌డు/ఆమెకు పెన్ష‌న్ వ‌స్తుంది. ఒక‌వేళ పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే, వారి జీవిత భాగ‌స్వామి జీవించి ఉన్నంత వ‌ర‌కు పెన్ష‌న్ పొందుతారు. త‌ర్వాత మీరు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని నామినీకి చెల్లించే ఏర్పాటు చేసుకోవ‌చ్చు. ఇందులో పాల‌సీదారునితో పాటు జీవిత భాగ‌స్వామి జీవించి ఉన్నంత వ‌ర‌కు హామీ ఇచ్చిన వ‌డ్డీ రేటుతో పెన్ష‌న్ అందుకోవ‌చ్చు.

డిఫ‌ర్డ్ యాన్యుటీ ప్లాన్లు: ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ద‌గ్గ‌ర‌లో ఉన్న‌వారు లేదా 10-15 సంవ‌త్స‌రాల‌లో రిటైర్ అవుతున్న‌వారు ఈ ర‌కం యాన్యూటి ప్లాన్ల‌ను ఎంచుకోవ‌చ్చు. ఇందులో కూడా ఏక మొత్తంలో ఒకేసారి పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన నాటికి ఉన్న వడ్డీ రేటును లాక్ చేస్తారు. 1 నుంచి 10 సంవ‌త్స‌రాల్లో ఎప్ప‌టి నుంచైనా పెన్ష‌న్ పొందొచ్చు. ఎప్ప‌టి నుంచి పెన్ష‌న్ పొందాల‌నుకుంటున్నారో పాల‌సీదారుడు స్వ‌యంగా ఎంచుకోవ‌చ్చు. ఇందులో కూడా జాయింట్ లైఫ్ యాన్యూటీ ప్లాన్లు ప్రీమియం రిట‌ర్న్ ఆప్ష‌న్‌తో అందుబాటులో ఉన్నాయి.

ఎవ‌రికి అనుకూలం?: రిటైర్మెంట్ త‌ర్వాత స్థిర ఆదాయం కోరుకునే వారికి యాన్యుటీ ప్లాన్లు అనుకూల‌మే అయిన‌ప్పటికీ వీటిని అర్థం చేసుకోవ‌డం కొంచెం క‌ష్టం. కొన్ని యాన్యూటీ ప్లాన్లలో స్థిర వ‌డ్డీ ఉండ‌దు. ఛార్జీలు అధికంగా ఉండే అవ‌కాశం ఉంది. లిక్విడిటీ స‌మ‌స్య ఉంటుంది కాబ‌ట్టి పాల‌సీని స‌రెండ‌ర్ చేయాల్సి వ‌స్తే అధిక మొత్తంలో న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది. యాన్యుటీ ప్లాన్ల‌ను ఆన్‌లైన్ ద్వారా సుల‌భంగా కొనుగోలు చేయొచ్చు. ఆఫ్‌లైన్‌తో పోల్చుకుంటే మెరుగైన వ‌డ్డీ రేటుతో ల‌భించే అవ‌కాశం ఉంది. కొన్ని యాన్యుటీ ప్లాన్లు ఆఫ్‌లైన్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. మ‌ధ్య‌వ‌ర్తులు లేదా ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేస్తే వాళ్ల‌కు చెల్లించే క‌మీష‌న్‌ను కూడా ఛార్జీల రూపంలో మీ వ‌ద్ద నుంచే వ‌సూలు చేస్తారు. అందువ‌ల్ల పాల‌సీ ఎంపిక చేసుకునేముందు పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోవాలి. హెచ్‌డీఎఫ్‌సీ ఇమ్మిడియట్ యాన్యుటీ ప్లాన్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఇమ్మిడియేట్ యాన్యుటీ ప్లాన్ల‌ను ప‌రిశీలించ‌వ‌చ్చు.

రిటైర్‌మెంట్‌కి 10 నుంచి 15 సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉన్న‌వారు ఎన్‌పీఎస్‌ను కూడా ఎంచుకోవ‌చ్చు. ఎన్‌పీఎస్‌ మెచ్యూరిటీ మొత్తంలో గ‌రిష్ఠంగా 60 శాతం నిధిని ఏక‌మొత్తంగా విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంది. అలాగే, 40 శాతం మొత్తంతో త‌ప్ప‌నిస‌రిగా యాన్యుటీల‌ను కొనుగోలు చేయాలి. విత్‌డ్రా చేసుకున్న 60 శాతం మొత్తాన్ని ఇత‌ర పెట్టుబ‌డుల్లో పెట్ట‌డం ద్వారా అద‌న‌పు ఆదాయాన్ని పొందొచ్చు. అలాగే లిక్విడిటీ స‌మ‌స్య ఉండ‌దు. యాన్యుటీల‌ను కొనుగోలు చేస్తున్నాం కాబ‌ట్టి రిటైర్‌మెంట్‌ త‌ర్వాత‌ పెన్ష‌న్ కూడా పొందొచ్చు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని