Asian Paints Q3 Results: ఏషియన్‌ పెయింట్స్‌ లాభం రూ.1,097 కోట్లు

డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ఏషియన్‌ పెయింట్స్‌ (Asian Paints) గురువారం ప్రకటించింది. నికర లాభం, ఆదాయాల్లో స్వల్ప వృద్ధిని నమోదు చేసింది.

Published : 19 Jan 2023 17:24 IST

దిల్లీ: అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి ఏషియన్‌ పెయింట్స్‌ (Asian Paints Q3 Results) ఏకీకృత ప్రాతిపదికన రూ.1,097.06 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.1,031.29 కోట్లతో పోలిస్తే ఈసారి 6.4 శాతం పెరిగింది. కార్యకలాపాల ఆదాయం రూ.8,527.24 కోట్ల నుంచి రూ.8,636.74 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.7,220.29 కోట్ల నుంచి రూ.7,280.75 కోట్లకు చేరాయి.

దేశీయ డెకరేటివ్‌ వ్యాపారంలో అమ్మకాలు ఫ్లాట్‌గా నమోదయ్యాయని క్రితం ఏడాది అధికంగా పెరిగిన ధరల ప్రాతిపదికే ఇందుకు కారణమని ఏషియన్‌ పెయింట్స్‌ (Asian Paints) మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ అమిత్‌ సింఘాల్‌ తెలిపారు. అక్టోబర్ వరకు రుతుపవనాలు కొనసాగడం పండుగ సీజన్‌లో రిటైల్‌ విక్రయాలను ప్రభావితం చేశాయన్నారు. తిరిగి నవంబర్, డిసెంబరులో డిమాండ్ పుంజుకున్నట్లు వెల్లడించారు. డిసెంబరు నెలలో డెకరేటివ్‌ వ్యాపారంలో రెండంకెల వృద్ధి నమోదైనట్లు పేర్కొన్నారు.

మరోవైపు, ఆటోమొబైల్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్, సాధారణ పారిశ్రామిక విభాగాల్లో బలమైన వృద్ధి కారణంగా బిజినెస్‌ విభాగంలో వ్యాపారం బాగానే సాగిందని సింఘల్‌ తెలిపారు. అంతర్జాతీయ వ్యాపారం విషయానికి వస్తే.. పశ్చిమాసియా, ఆఫ్రికాలో మంచి వృద్ధి నమోదైనట్లు పేర్కొన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌లో ప్రతికూల ఫారెక్స్, స్థూల- ఆర్థిక పరిస్థితుల కారణంగా దక్షిణాసియా మార్కెట్‌ తీవ్రంగా ప్రభావితమైనట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని