Personal loan: వివాహ ఖ‌ర్చుల‌కూ వ్య‌క్తిగ‌త రుణం.. బ్యాంకులందిస్తున్న వడ్డీ రేట్లు ఇవే..

ఆదాయం, తిరిగి చెల్లించే సామ‌ర్ధ్యం ఆధారంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి.

Updated : 01 Jul 2022 17:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భార‌త్‌లో పేరున్న ప్ర‌భుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు వ్య‌క్తిగ‌త రుణాల‌ను త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కే విరివిగా అందిస్తున్నాయి. బ్యాంకులు వ్య‌క్తిగ‌త రుణాలను ఎటువంటి పూచీక‌త్తు లేకుండా కేవ‌లం క్రెడిట్ స్కోర్‌, బ్యాంక్‌లో ఆయా ఖాతాదారులు నిర్వ‌హించే ఖాతాలను బట్టి అంద‌జేస్తున్నాయి. బ్యాంక్‌లో ఖాతా, క్రెడిట్ కార్డు ఉన్నా కూడా వారు నిర్వ‌హించే ఖాతాల‌ను బ‌ట్టి, చెల్లింపుల హిస్ట‌రీ చూసి బ్యాంకులు రుణాల‌ను ఇవ్వ‌డానికి ఆస‌క్తి చూపుతాయి. అయితే ఇల్లు, కారు రుణాల‌కంటే ఈ వ్య‌క్తిగ‌త రుణాల‌కు వ‌డ్డీ రేటు ఎక్కువ‌. ఎందుకంటే వ్య‌క్తిగ‌త రుణాలు అసుర‌క్షిత రుణాలు.

రుణం పొంద‌టానికి ఆస్తి, బంగారం వంటి ఆస్తుల‌ను బ్యాంకు వ‌ద్ద త‌న‌ఖా ఉంచాల్సిన అవ‌స‌రం లేదు. ఆదాయం, తిరిగి చెల్లించే సామ‌ర్థ్యం ఆధారంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. అయితే, వ్య‌క్తిగ‌త రుణాన్ని వివాహ ఖ‌ర్చుల‌కు కూడా తీసుకోవ‌చ్చు. పీఎఫ్‌లో రుణం అవ‌స‌రం అయితే క‌నీస స‌ర్వీస్ లేక‌పోతే రుణం వ‌చ్చే అవ‌కాశం లేదు. ఇటువంటి ప‌రిస్థితుల్లో బ్యాంకులో వ్య‌క్తిగ‌త రుణాన్ని తీసుకోవ‌చ్చు.

వివాహం జీవితంలో ఒక జంట‌కు ఒక ముఖ్య‌మైన మ‌ధుర ఘ‌ట్టం. ఇరు కుటుంబాల‌కు అత్యంత ముఖ్య‌మైన వేడుక‌. వివాహం లాంటి వేడుక‌లు జీవితంలో ఒకేసారి మాత్ర‌మే జ‌రిగే తంతు కాబ‌ట్టి వ‌ధూవ‌రులిద్ద‌రూ వారి ఆర్థిక ప‌రిస్థితుల ఆధారంగా వివాహాన్ని జ‌రుపుకోవ‌డానికి ప్రాధాన్య‌ం ఇస్తారు. పెళ్లి వేడుక‌ను ఇరు కుటుంబాల‌లో కొన్ని డ‌జ‌న్ల మంది చూసి, ఆనందించే వేడుక కాబ‌ట్టి కొన్ని ఖ‌ర్చులు త‌ప్ప‌వు. ఈ ఖ‌ర్చుల‌కు చాలా మంది రుణాల మీద ఆధార‌ప‌డ‌టం స‌హ‌జ‌మే. వివాహ ఖ‌ర్చుల‌కు కూడా కొన్ని బ్యాంకులు రుణాలిస్తున్నాయి. ఈ రుణం వ్య‌క్తిగ‌త రుణం కింద‌కు వ‌స్తుంది. ఈ వ్య‌క్తిగ‌త రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేస్తున్న‌ప్పుడు, మీరు తిరిగి చెల్లించే సామ‌ర్థం, ఆర్థిక సౌల‌భ్యాన్ని బ‌ట్టి రుణం తీర్చ‌డానికి కాల వ్య‌వ‌ధిని ఎంచుకోవ‌చ్చు.

న‌గ‌దు వినియోగంపై ప‌రిమితులుంటాయా? 
మీరు ఇంటి రుణం, కారు రుణం తీసుకున్న‌ప్పుడు, చెక్ నేరుగా స్థిరాస్తి విక్రేత లేదా కారు డీల‌ర్‌కు అంద‌జేస్తారు. అదే వ్య‌క్తిగ‌త రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసిన‌ప్పుడు, చెల్లింపు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జ‌మ‌వుతుంది. మీరు నిధుల‌ను ఏ ప‌ద్ధ‌తిలోనైనా ఉప‌యోగించుకోవ‌చ్చు. పెళ్లిలో క్యాట‌ర‌ర్‌, ఈవెంట్ మేనేజ్‌మెంట్ బృందం లేదా వేదిక కోసం మీ కోరిక మేర‌కు నిధుల‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. మీరు మీ వివాహానికి తీసుకున్న వ్య‌క్తిగ‌త రుణ న‌గ‌దుని ఎలా ఖ‌ర్చు చేస్తార‌నే దానిపై ఎలాంటి ప‌రిమితీ లేదు.

రుణ చెల్లింపు కాల‌ప‌రిమితి: వ్య‌క్తిగ‌త రుణం ద‌ర‌ఖాస్తు చేస్తున్న‌ప్పుడు తిరిగి చెల్లించే సామర్థ్యం, ఆర్థిక సౌలభ్యాన్ని బ‌ట్టి రుణ చెల్లింపు కాల‌వ్య‌వ‌ధిని ఎంచుకోవ‌చ్చు. సాధార‌ణంగా బ్యాంకులు వ్య‌క్తిగ‌త రుణంపై 60 నెల‌ల వ‌ర‌కు తిరిగి చెల్లించే కాల‌ప‌రిమితిని అనుమ‌తిస్తాయి. అయితే కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు 84 నెల‌ల వ‌ర‌కు కాల వ్య‌వ‌ధిని ఇస్తున్నాయి. అయితే, వ‌డ్డీ ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవ‌డానికి రుణ చెల్లింపు కాల‌వ్య‌వ‌ధిని వీలైనంత త‌క్కువ‌గా పెట్టుకోవ‌డం మంచిది.

వ‌డ్డీ రేట్లు ఎలా? 
వివాహ రుణాన్ని ప్ర‌త్యేక రుణ సాధ‌నంగా బ్యాంకులు ప‌రిగ‌ణించి వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించ‌డానికి కాలానుగుణ‌, నిర్దిష్ట ఆఫ‌ర్ల‌తో ముందుకు వ‌స్తున్నాయి. ఈ రుణాల‌కు పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు అయితే 8.80% క‌నీస వ‌డ్డీ రేటును వ‌సూలు చేస్తోంది. అయితే ఈ వ‌డ్డీ రేట్లు క్రెడిట్ స్కోర్ మెరుగైన స్థితిలో ఉన్న‌వారికి మాత్ర‌మే. కాబ‌ట్టి రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసే ముందు అందుబాటులో ఉన్న అన్ని రుణ సంస్థ‌ల ఎంపిక‌ల‌ను స‌రిపోల్చుకోవాలి. వ్య‌క్తిగ‌త రుణం మాదిరిగానే వివాహ రుణంలో స్వీక‌రించే రుణ మొత్తాన్ని ఎలా ఉప‌యోగించాల‌నే దానిపై ఎటువంటి ప‌రిమితి లేదు.

గ‌మ‌నిక: వ‌్య‌క్తిగ‌త‌ రుణాల‌పై బ్యాంకులు అందించే అత్య‌ల్ప వ‌డ్డీ రేటు ఈ ప‌ట్టిక‌లో పొందుపరిచాం. రూ.2 ల‌క్ష‌ల రుణం, 3 ఏళ్ల కాల వ్య‌వ‌ధి ఒక సూచిక మాత్ర‌మే. వినియోగ‌దారుని అర్హ‌త‌ను బ‌ట్టి ఇంకా అధికంగా కూడా రుణం తీసుకోవ‌చ్చు. ఈఎంఐలో ప్రాసెసింగ్ ఫీజులు, ఇత‌ర రుసుములు క‌ల‌ప‌లేదు. మీ క్రెడిట్ స్కోర్‌, చేసే వృత్తి, ఆర్జించే ఆదాయం, బ్యాంకు నియ‌మ, నిబంధ‌న‌ల‌ ఆధారంగా వ‌డ్డీ రేటులో, రుణ మొత్తంలో మార్పులు ఉండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని