Algo Trading: అప్రమత్తంగా ఉంటేనే ‘అల్గో’తో అధిక రాబడి!

స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ చేసేవారు నిరంతరం అల్గారిథమిక్‌ ట్రేడింగ్‌ (algorithmic trading)పై అప్రమత్తంగా ఉండాలని సెబీ (SEBI) ఇటీవల హెచ్చరించింది....

Updated : 15 Jun 2022 11:03 IST

దిల్లీ: స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ చేసేవారు నిరంతరం అల్గారిథమిక్‌ ట్రేడింగ్‌ (algorithmic trading)పై అప్రమత్తంగా ఉండాలని సెబీ (SEBI) ఇటీవల హెచ్చరించింది. అనియంత్రిత సంస్థలు అందించే అల్గో ట్రేడింగ్‌కు బాధితులుగా మారొద్దని హితవు పలికింది. అధిక రాబడి లేదా వారి వ్యూహాలకు భారీ రేటింగ్‌ను చూపి మదుపర్లను మాయచేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ట్రేడింగ్‌లో భద్రతను పెంచడం కోసం, అవకతవకలు జరగకుండా చూసేందుకు అనుమతించిన అల్గారిథమిక్‌ ట్రేడింగ్‌ (algo trading‌)ను కొన్ని సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయని తెలిపింది. మరి ఇంతకీ అల్గో ట్రేడింగ్‌ (algo trading‌) అంటే ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

ఏమిటీ అల్గో ట్రేడింగ్‌..

అల్గో ట్రేడింగ్‌ (algo trading‌) అంటే ఏదైనా ఆర్డరు ఆటోమేటెడ్‌ ఎగ్జిక్యూషన్‌ లాజిక్‌తో తనంతట తానే జనరేట్‌ అయ్యేలా చేయడం అన్నమాట. అల్గో ట్రేడింగ్‌ వ్యవస్థ ఎప్పటికప్పుడు లైవ్‌లో షేర్ల ధరలను పరిశీలించి, మదుపరి ముందే సూచించిన ప్రమాణాలకు తగినట్లుగా ఆర్డరు పెడుతుంది. దీని వల్ల మాన్యువల్‌గా ఆర్డర్లను పెట్టడంతో పాటు, లైవ్‌లో షేర్ల ధరలనూ పరిశీలిస్తూ ఉండడం నుంచి మదుపరికి ఉపశమనం కలుగుతుందన్నమాట. ప్రతిపాదిత వ్యవస్థలో రిటైల్‌ మదుపర్లు అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌(API) యాక్సెస్‌తో పాటు ఆటోమేషన్‌ ఆఫ్‌ ట్రేడ్స్‌ను వినియోగించుకుంటారు.

ఎందుకంటే..

ప్రస్తుతం బ్రోకర్లు సమర్పించిన అల్గోకు ఎక్స్ఛేంజీలు అనుమతులు ఇస్తున్నాయి. రిటైల్‌ మదుపర్లు ఏపీఐలను వినియోగించి పెట్టే అల్గోలను అటు ఎక్స్ఛేంజీలు కానీ.. ఇటు బ్రోకర్లు కానీ.. సదరు ట్రేడ్‌ ఏపీఐ లింక్‌ నుంచి వచ్చిన అల్గోనా, నాన్‌ అల్గో ట్రేడా అన్నది గుర్తించలేని పరిస్థితి ఉంది. ఈ తరహా నియంత్రణ లేని లేదా అనుమతి లేని అల్గోల వల్ల మార్కెట్‌కు నష్టభయం పెరుగుతుంది. అదే సమయంలో వీటిని వినియోగించి వ్యవస్థీకృత అవకతవకలకు పాల్పడే అవకాశమూ ఉంది. ఏదైన అల్గో వ్యూహం విఫలమైతే రిటైల్‌ మదుపరికి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

నియంత్రణ ఇలా..

థర్డ్‌ పార్టీ అల్గో ప్రొవైడర్లు/వెండర్లపై ఎటువంటి నియంత్రణా లేకపోవడం వల్ల ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ కూడా లేదు. అందుకే వీటిని స్టాక్‌బ్రోకరు నియంత్రించాల్సి ఉంటుంది. ఏపీఐలు తమ అల్గో ట్రేడింగ్‌ను ఒక విశిష్ట అల్గో ఐడీతో ట్యాగ్‌ చేయాలి. అపుడు ఆ అల్గోకు స్టాక్‌ ఎక్స్ఛేంజీ నుంచి అనుమతి వస్తుంది.

* ప్రతీ అల్గో వ్యూహం.. అది బ్రోకరుది అయినా క్లయింటుది అయినా.. ఎక్స్ఛేంజీ అనుమతి పొందాలి. అదే సమయంలో అల్గోలను అనధికారికంగా ఎవరూ మార్చకుండా ఉండేందుకు అవసరమైన సాంకేతికత టూల్స్‌ను బ్రోకర్లు వినియోగించాలి.

* బ్రోకర్లు సొంతంగా అల్గో వ్యూహాలను అభివృద్ధి చేసుకోవచ్చు. లేదంటే అనుమతి పొందిన వెండర్‌ ద్వారా పొందొచ్చు. అయితే మదుపర్ల నుంచి ఫిర్యాదు వస్తే మాత్రం స్టాక్‌బ్రోకర్లే బాధ్యత వహించాలి.

ఇవి గుర్తుంచుకోండి..

* ఒక అల్గో వ్యూహం నుంచి మరోదానికి తరచూ మారొద్దు. ఒక వ్యూహాన్ని ఎంచుకున్న తర్వాత దాన్ని కనీసం మూడేళ్ల పాటు కొనసాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

* కనీసం రూ.5 లక్షల మూలధనంతో అల్గో ట్రేడింగ్‌లోకి అడుగుపెట్టడం మంచిది.

* ఒక ట్రేడింగ్‌పై మీ మూలధనంలో 2-2.5 శాతానికి మించి ఖర్చు చేయొద్దు.

* అనియంత్రిత సంస్థలకు మీ ట్రేడింగ్‌ అకౌంట్‌ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ చెప్పొద్దు.

* మీకు సరిపడా అనుభవం లేకపోతే ఎక్కువ రిస్క్‌ ఉండే వ్యూహాలకు దూరంగా ఉండడం మేలు. లోతైన అవగాహన లేనట్లయితే డెరైవేటివ్స్‌, లివరేజ్‌ వంటి వాటి జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.

* ఒక అల్గో వ్యూహాన్ని ఎంచుకునే ముందు విన్‌/లాస్‌ రేషియో; రాబడి ఎంత వరకు ఉంటుంది; నష్టపోతే ఏ స్థాయిలో డబ్బు కోల్పోయే అవకాశం ఉంది.. వంటి వివరాలను ముందే తెలుసుకోవాలి.

* మీరు ఎంచుకునే అల్గో వ్యూహం అన్ని మార్కెట్‌ కండీషన్లలో పనిచేయగలగాలి. కేవలం బుల్‌ మార్కెట్‌ లేదా బేర్‌ మార్కెట్‌లో పనిచేస్తే కుదరదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని