LPG prices: వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై భారం.. రూ.209 పెంపు

19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ (Commercial LPG cylinder price) ధరను చమురు సంస్థలు సుమారు రూ. 200కు పైగా పెంచాయి.

Updated : 01 Oct 2023 15:01 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్లపై అదనపు భారం పడింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌పై రెండు నెలలుగా తగ్గుతూ వచ్చిన ధర ఈ సారి మాత్రం (Commercial LPG cylinder) ₹209 పెరిగింది. అంతకుముందు ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో దాదాపు రూ.250 మేర తగ్గాయి. ప్రతినెల చమురు సంస్థలు చేసే ధరల సవరణలో భాగంగా వీటిని పెంచాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,731కు పెరిగింది. అంతకుముందు ఇది రూ.1522గా ఉంది. చెన్నైలో  రూ.1898, కోల్‌కతాలో రూ.1839, ముంబయిలో రూ.1684కు చేరింది. కొత్త ధర నేటి నుంచే అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి.

కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ ధర సెప్టెంబర్‌ 1న రూ.157.5 తగ్గింది. అంతకుముందు ఆగస్టు 1న రూ.100 మేర తగ్గింది. ఇలా రెండు నెలలు తగ్గిన ధరలు.. తాజాగా ఒక్కసారిగా రూ.200కుపైగా పెరగడంతో వాణిజ్య సిలిండర్‌ వినియోగదారులపై భారం పడినట్లయ్యింది. ఇక 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధర మారలేదు. ఆగస్టు 30న వీటి ధర రూ.200 తగ్గిన విషయం తెలిసిందే.

జెట్‌ ఇంధనంపై 5శాతం మోత

తాజాగా వాణిజ్య సిలిండర్‌తోపాటు జెట్‌ ఇంధనం (ATF) ధర కూడా 5.1శాతం పెరిగింది. కిలోలీటరుకు రూ.5779 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దిల్లీలో కిలోలీటర్‌ ఏటీఎఫ్‌ ధర రూ.1,18,199కు చేరుకుంది. ఇలా జెట్‌ ఇంధనం ధర పెరగడం వరుసగా నాలుగోసారి. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లోనూ గడిచిన 18నెలలుగా ఎటువంటి మార్పు లేదు. వంటగ్యాస్‌తోపాటు ఏటీఎఫ్‌ ధరలను ప్రభుత్వరంగ సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లు ప్రతినెల 1వ తేదీన సవరిస్తుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని