LPG price: వాణిజ్య వంటగ్యాస్‌ సిలిండర్‌పై రూ.39 తగ్గింపు

LPG price: అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ ఇంధన విక్రయ సంస్థలు వాణిజ్య వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను సవరించాయి.

Updated : 22 Dec 2023 14:09 IST

దిల్లీ: వాణిజ్య వంటగ్యాస్ 19 కిలోల సిలిండర్‌ ధర (Commercial LPG price) రూ.39.50 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడమే ఇందుకు కారణం. ఇళ్లలో వంట కోసం ఉపయోగించే 14 కిలోల సిలిండర్‌ ధర మాత్రం స్థిరంగా ఉంది.

హోటళ్లు, రెస్టారెంట్ల వంటి ప్రదేశాల్లో వాడే వాణిజ్య వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర (Commercial LPG price) దేశ రాజధాని దిల్లీలో ఇప్పుడు రూ.1,757కు తగ్గింది. ఇప్పటి వరకు ఈ ధర రూ.1,796.50గా ఉండేది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు డిసెంబర్‌ 1న వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.21 పెంచిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం వాణిజ్య సిలిండర్‌ ధర (Commercial LPG price) ముంబయిలో రూ.1,710, కోల్‌కతాలో రూ.1,868.50, చెన్నైలో రూ.1,929కు దిగొచ్చింది. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరలు మారుతూ ఉంటాయి. మన దేశంలో వంటగ్యాస్‌ ధరలకు ప్రామాణికంగా తీసుకునే సౌదీ కాంట్రాక్ట్‌ ధర గత కొన్ని వారాల్లో తగ్గింది. ప్రభుత్వ రంగంలోని ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ సాధారణంగా ప్రతినెల ఒకటో తేదీన ఎల్‌పీజీ, విమాన ఇంధన ధరలను సవరిస్తుంటాయి. క్రితం నెల సగటు ధరల ఆధారంగా మార్పులు చేస్తుంటాయి. కానీ, తాజా తగ్గింపు మాత్రం అదనపు సవరణ కావడం గమనార్హం.

మరోవైపు వరుసగా 21వ నెలా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.72, డీజిల్‌ ధర రూ.89.62గా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని