Published : 27 Jun 2022 21:04 IST

Credit cards: క్రెడిట్‌ కార్డులను తెగ వాడేస్తున్నారు.. ఈ కామర్సుల్లోనే ఎక్కువ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో క్రెడిట్‌ కార్డుల (Credit cards) వాడకం పెరుగుతోంది. కొత్త కార్డుల సంఖ్యా వృద్ధి చెందుతోంది. ముఖ్యంగా మే నెలలో క్రెడిట్‌ కార్డుల వినియోగం కొత్త రికార్డులను తిరగరాసింది. ఏప్రిల్‌ నెలతో పోల్చినప్పుడు 8 శాతం వృద్ధి చెందగా.. గతేడాది మే నెలతో పోల్చినప్పుడు ఏకంగా 118 శాతం వృద్ధి నమోదు చేయడం గమనార్హం. కొత్తగా జారీ అయిన కార్డుల సంఖ్య కూడా గతేడాదితో పోల్చినప్పుడు 23 శాతం మేర పెరిగింది. ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన డేటాలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రిటైల్‌ ఎకనామీ పుంజుకుందనడానికి ఇది సంకేతమని నిపుణులు భావిస్తున్నారు.

ఆర్‌బీఐ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.1.05 లక్షల కోట్లను క్రెడిట్‌కార్డుల ద్వారా జనం వెచ్చించగా.. మే నెలలో ఆ మొత్తం రూ.1.13 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 7.8 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది మే నెలలో ఈ మొత్తం రూ.52,200 కోట్లు మాత్రమే. అంటే ఒక్క ఏడాదిలోనే క్రెడిట్‌ కార్డుల వాడకం 118 శాతం పెరిగిందన్నమాట. మే నెలలో క్రెడిట్‌ కార్డుల ద్వారా ప్రజలు చేసిన మొత్తం ఖర్చులో ఒక్క ఈ కామర్సుల వాటానే రూ.71,400 కోట్లు కావడం గమనార్హం. అంటే అంత మొత్తం విలువైన వస్తువులను ఆయా వేదికల ద్వారా ప్రజలు కొనుగోలు చేశారన్నమాట. ఓ వైపు ద్రవ్యోల్బణంతో వస్తువుల ధరలు పెరిగినా ఈ స్థాయిలో కొనుగోళ్లు జరగడం గమనార్హం.

హెచ్‌డీఎఫ్‌సీనే నంబర్‌ 1 

ఇక క్రెడిట్‌ కార్డుల జారీ విషయానికొస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తొలి స్థానంలో నిలిచింది. మే నెలలో ఈ బ్యాంక్‌ కొత్తగా 3.85 లక్షల క్రెడిట్‌ కార్డులను జారీ చేసింది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల సంఖ్య 1.72 కోట్లకు చేరింది. మే నెలలో కొత్త కార్డుల జారీ విషయంలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇక దేశంలో మొత్తం క్రెడిట్‌ కార్డుల విషయానికొస్తే.. మే నెల నాటికి మొత్తం క్రెడిట్‌ కార్డుల సంఖ్య 7.68 కోట్లకు చేరింది. ఏప్రిల్‌ నెలలో ఈ సంఖ్య 7.51 కోట్లు కాగా.. మే నెలలో 2.2 శాతం కొత్త కార్డులు జతయ్యాయి. గతేడాది మే నెలలో ఈ సంఖ్య 6.23 కోట్లు మాత్రమే.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని