Budget 2022: ఉద్యోగాల కల్పనకే అధిక ప్రాధాన్యం- కేంద్ర ఆర్థికమంత్రి

దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు తాజా బడ్జెట్‌లో అనేక చర్యలు చేపట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

Published : 01 Feb 2022 22:28 IST

కొవిడ్‌ వేళ పన్నుల భారం మోపలేదన్న నిర్మలా సీతారామన్‌

దిల్లీ: దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు తాజా బడ్జెట్‌లో అనేక చర్యలు చేపట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్పత్తి రంగంలో మరిన్ని పెట్టుబడుల ద్వారా ఉద్యోగాల పెంపునకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇక కరోనా మహమ్మారి విజృంభణ వేళ ప్రజలపై పన్నుల భారాన్ని మోపాలని తమ ప్రభుత్వం కోరుకోవడం లేదని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది కూడా సూచించారని ఆర్థిక మంత్రి గుర్తుచేశారు. పార్లమెంటులో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. అందులోని అంశాలను మీడియా సమావేశంలో వివరించారు.

‘కరోనా విపత్తు వేళ వేటిపైనా పన్నులు పెంచలేదు. ముఖ్యంగా ఆదాయ పన్ను విషయంలోనూ అదే అనుసరించాం. సేవల రంగానికి మరింత ఊతం కల్పించాం. స్టార్టప్‌ పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టాం. రానున్న రోజుల్లో ఆహార ధాన్యాల సేకరణ మరింత పెంచుతాం. మరోవైపు సాగు రంగంలో యాంత్రీకరణకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందిస్తాం. వరి, గోధుమ కొనుగోలు, వాటి మద్దతు ధరలకు రూ.2.37లక్షల కోట్లు కేటాయించాం. చిరు ధాన్యాల అభివృద్ధికీ అదనపు ప్రోత్సాహం కల్పిస్తాం. ఇందులో భాగంగా 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తున్నాం. పీపీపీ నమూనాలో ఆహార శుద్ధి పరిశ్రమలకు ఊతం కల్పిస్తాం. సేంద్రీయ ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాం. రైతులకు అద్దెకు వ్యవసాయ పనిముట్లు ఇచ్చే ప్రథకాన్ని రూపొందించాం’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

వీటితోపాటు ఉద్యోగాల కల్పనకు 14 రంగాలకు ప్రోత్సాహకాలు అందిస్తామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్‌ గ్యారెంటీ పథకాన్ని తీసుకువస్తున్నామని చెప్పారు. ఇందుకోసం రూ.2లక్షల కోట్ల ఆర్థిక నిధులు సమకూరుస్తామన్న ఆమె.. ఎంఎస్‌ఎంఈలకు మార్కెటింగ్‌ సహకారం కోసం నూతన పోర్టల్‌ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇక ఆర్‌బీఐ ద్వారా త్వరలోనే డిజిటల్‌ కరెన్సీ విడుదల అవుతుందని.. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ సాయంతో ఆర్బీఐ దీనిని అందుబాటులోకి తెస్తుందని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని