క్రెడిట్‌ కార్డుకు− డెబిట్‌ కార్డుకు గల భేదం

క్రెడిట్‌ కార్డుకు, డెబిట్‌ కార్డుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. డెబిట్‌ కార్డులు  బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై  ఉంటాయి. నగదు విత్‌ డ్రాలకు, పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌(పీఓఎస్‌) చెల్లింపులకు డెబిట్‌ కార్డులు ఉపయోగపడతాయి… ఖాతాతో ముడిపడినందున

Published : 15 Dec 2020 18:41 IST

క్రెడిట్ కార్డుకు, డెబిట్ కార్డుకు గ‌ల తేడాలు, వాటి ప‌నితీరులోని వ్య‌త్యాసాల‌పై విశ్లేష‌ణ‌

క్రెడిట్‌ కార్డుకు, డెబిట్‌ కార్డుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. డెబిట్‌ కార్డులు బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై ఉంటాయి. నగదు విత్‌ డ్రాలకు, పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌(పీఓఎస్‌) చెల్లింపులకు డెబిట్‌ కార్డులు ఉపయోగపడతాయి.. ఖాతాతో ముడిపడినందున డబ్బు ఉంటేనే వాడటానికి వీలుంటుంది.

క్రెడిట్‌ కార్డుల విషయానికొస్తే  ఇవి  పొదుపు ఖాతాతో అనుసంధానమై  ఉండవు. వీటితో చేసే కొనుగోళ్లు బ్యాంకు వద్ద అప్పు చేసి కొన్నట్లే భావించాలి.  చేసిన ప్రతి కొనుగోలు లేదా పొందిన నగదుకు డెబిట్‌ కార్డు నేరుగా  ఖాతా నుంచి మినహాయిస్తే, క్రెడిట్‌ కార్డు  లావాదేవీల బిల్లులను ఖాతాదారులకు  సమర్పించి  త‌ర్వాత వాటిని వ‌సూలు చేస్తారు.  ఈ చెల్లింపున‌కు నిర్ణీత గడువుంటుంది. ఆలోగా కట్టేస్తే ఎటువంటి వడ్డీలు, పెనాల్టీలు ఉండవు. క్రెడిట్‌ కార్డును ఉపయోగించుకుని  ఏటీఎమ్‌ నుంచి నగదును సైతం పొంద‌వ‌చ్చు.

ఇవీ క్రెడిట్ కార్డు లాభాలు
క్రెడిట్‌ కార్డుల‌తో అనేక లాభాలు ఉన్నాయి. బ్యాంకులే స్వయంగా వినియోగదారులకు ఫోన్లు చేసి మరీ క్రెడిట్‌ కార్డులు తీసుకుంటారా అని అడుగుతున్నాయి. మరి ఇంత సులువుగా వీటిని పొందగలిగినప్పుడు వాటి నిర్వ‌హ‌ణ తీరుతెన్నులనూ ఓ సారి ప‌రిశీలిద్దాం…

* మనం చేసిన కొనుగోళ్లకు అయిన ఖర్చులను వడ్డీ పడకుండా తిరిగి చెల్లించేందుకు బ్యాంకులు కొంత గడువు ఇస్తాయి. ఇది సాధారణంగా 30 నుంచి 55 రోజుల దాకా ఉంటుంది. క్రెడిట్‌ కార్డులతో ప్రధాన లాభం ఇదే.

* ఈ గడువులోగా అప్పుగా తీసుకున్న సొమ్ము చెల్లిస్తే తదుపరి కొనుగోళ్లకు ఇవే లాభాలను వర్తింపజేసుకోవచ్చు.

* పెద్దమొత్తంలో నగదు చేతిలో ఉంచుకోవడం కంటే క్రెడిట్‌ కార్డులతో షాపింగ్‌ చేయడం చాలా సులభం, సురక్షితం. కొన్ని వాణిజ్య సముదాయాలు కార్డు చెల్లింపులకు సుముఖత చూపిస్తాయి.

* క్రెడిట్‌ కార్డు సంస్థలు కొన్ని బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. తమ బ్యాంకు క్రెడిట్‌ కార్డుతో ఆయా సంస్థల్లో కొనుగోళ్లు చేస్తే భారీ మొత్తం రాయితీ ఇచ్చే విధంగా చూస్తాయి.   వినియోగదారులు ఈ అవకాశాలను స‌ద్వినియోగం చేసుకోవ‌డం లాభ‌దాయ‌కం.

* క్రెడిట్‌ కార్డులతో కొనుగోళ్లు చేసినప్పుడు ‘రివార్డు పాయింట్ల’ను మంజూరు చేస్తారు. ఈ పాయింట్లన్నీ పెద్ద మొత్తంలో జమ అయ్యాక ఏదైనా కొత్త వస్తువును కొనేందుకు ఉపయోగించవచ్చు. రివార్డు పాయింట్లు ఎలా పెంచుకోవచ్చో క్రెడిట్‌ కార్డు సంస్థలు ప్రచారం చేస్తుంటాయి.

* క్రెడిట్‌ కార్డులపై ‘క్యాష్‌ బ్యాక్‌’ ఆఫర్‌ ఇస్తున్న షాపింగ్‌ కేంద్రాల సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. వినియోగదారులు క్రెడిట్‌ కార్డు వాడేలా ప్రోత్సహించడం దీని ముఖ్యోద్దేశం.

* ఇప్పుడంతా ఆన్‌లైన్ షాపింగ్‌ల‌దే హ‌వా. బ‌య‌ట షాపింగ్‌కు వెళ్లి వ‌స్తువుల‌ను కొనేందుకు స‌మ‌యం లేనివారు షాపింగ్ వైబ్‌సైట్స్ ద్వారా కొనేందుకు ఉత్సుక‌త చూపిస్తున్నారు. ఈ విధ‌మైన షాపింగ్‌ల్లో క్రెడిట్‌కార్డుల‌ను వాడి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

* ఈ-షాపింగ్‌ ఉత్సాహవంతులకు మరిన్ని లాభాలు కలిగించే దిశగా బ్యాంకులు యోచిస్తున్నాయి.  అమ్మకందార్లూ ప్రత్యేక రాయితీలతో ముందుకొస్తున్నారు. ఈ రాయితీలు మనం కొనుగోలు చేసే వస్తువులను, మొత్తం ధరను బట్టి ఉంటున్నాయి. ఎక్కువ కొనుగోళ్లకు ఎక్కువ రాయితీ అనే విష‌యాన్ని ప‌క్క‌న‌బెట్టి  మ‌న‌కు అవ‌స‌ర‌మైన మేర‌కు కొనుగోళ్లు జ‌ర‌ప‌డం అన్ని విధాలా శ్రేయ‌స్క‌రం.

* వినోదం, విహారం, విందు లాంటి భిన్నమైన వాటిల్లో చేసే ఖర్చుల్లో క్రెడిట్‌ కార్డుతో ప్రత్యేక రాయితీలు అందిస్తున్న సంస్థలు ఇప్పుడు చాలానే ఉన్నాయి.

* క్రెడిట్‌ కార్డులతో ఏటీఏం కేంద్రాల్లో డబ్బును డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అత్యవసరాల్లో , చిన్న మొత్తాల్లో అప్పు అవసరమైన సందర్భాల్లో ఈ అవకాశం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని