ఉన్న‌త విద్యా కోర్సుల‌కు విద్యా రుణాలు

పెరుగుతున్న విద్యా ద్ర‌వ్యోల్బ‌ణం, అధిక ఫీజుల‌తో క‌లిపి నాణ్య‌మైన విద్య నేడు చాలా ఖ‌రీదైన‌దిగా మారింది.

Published : 22 Jan 2022 11:18 IST

ఇంజినీరింగ్‌, బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇంకా ఇత‌ర ఉన్న‌త విద్యా కోర్సుల కోసం బ్యాంకుల వ‌ద్ద విద్యా రుణం తీసుకోవ‌డం ఈ రోజుల్లో మామూలుగా చాలా మంది విద్యార్ధులు చేసే ప‌నే. పెరుగుతున్న విద్యా ద్ర‌వ్యోల్బ‌ణం, అధిక ఫీజుల‌తో క‌లిపి నాణ్య‌మైన విద్య నేడు చాలా ఖ‌రీదైన‌దిగా మారింది. ఔత్సాహిక విద్యార్ధుల‌కు ఉన్న‌త విద్య‌కు ఆర్ధిక స‌హాయం చేయ‌డానికి విద్యా రుణం ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ రోజు ఎక్కువ మంది యువ‌తీ/యువ‌కులు వాళ్ల కుటుంబానికి ఆర్ధికంగా ఆదుకునే స్థోమ‌త ఉన్న‌ప్ప‌టికీ..వారే స్వ‌తంత్రులుగా మారి వారి చ‌దువుకు అయ్యే ఖ‌ర్చును తామే భ‌రించాల‌ని భావిస్తున్నారు.

విద్యా రుణం ధ‌ర‌ఖాస్తు చేసేముందు ప‌రిగ‌ణించ‌వ‌ల‌సిన ముఖ్య అంశం ఏమిటంటే రుణం అవ‌స‌రం కోర్సు ఫీజుకే కాకుండా ఆ విద్యకు సంబంధించి అన్ని ఖ‌ర్చులు క‌వ‌ర్ చేయ‌బ‌డ‌తాయో లేదా అని త‌నిఖీ చేసుకోవాలి. విద్యా రుణం తీసుకున్న త‌ర్వాత చ‌దువుకునే మొర‌టోరియం వ్య‌వ‌ధిలో రుణ భారాన్ని త‌గ్గించుకోవ‌డానికి వ‌డ్డీని చెల్లించే అవ‌కాశం కూడా ఉంటుంది.

విద్యా రుణం అంద‌చేయ‌డానికి బ్యాంకులే కాకుండా వివిధ ఫిన్‌టెక్ కంపెనీలు కూడా గ్రాడ్యుయేట్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్‌, షార్ట్ ట‌ర్మ్‌, ప్రొఫెష‌న‌ల్ కోర్సుల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన వ‌డ్డీ రేట్ల‌కు విద్యా రుణాల‌ను అందించ‌డం ప్రారంభించాయి. విద్యార్దులు ఒక కోర్సును ఖ‌రారు చేసేట‌ప్పుడే, ఆ కోర్సును కొన‌సాగించ‌డానికి స‌రైన సంస్థ లేదా విశ్వ‌విద్యాల‌యాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ విద్యా సంస్థ‌లో చేర‌క‌ముందే.. ఆ కోర్స్ గురించి విద్యా సంస్థ గురించి, సీనియ‌ర్ విద్యార్ధుల‌ను అడిగి తెలుసుకోవాలి. అంతేకాకుండా కోర్స్ త‌ర్వాత ఉద్యోగ‌వ‌కాశాలు, క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్ గురించి విపులంగా తెలుసుకుంటే మంచిది. దీని వ‌ల‌న కోర్స్ త‌ద‌నంత‌రం ఉద్యోగంలో చేరి విద్యా రుణాన్ని వేగంగా చెల్లించ‌డానికి ఆర్ధిక అండ దొరుకుతుంది.

విద్యా రుణం తీసుకునేట‌ప్పుడు వేర్వేరు ఆర్ధిక సంస్థ‌ల వివిధ నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌ను క‌లిగి ఉన్నందున‌, రుణ అర్హ‌త ప్ర‌మాణాలు, ప్రాసెసింగ్ ఫీజులు, ముంద‌స్తు చెల్లింపు కోసం ఏదైనా పెనాల్టీ ఛార్జీలు, ఈఎమ్ఐల ఆల‌స్య చెల్లింపు వంటి అన్ని అనుబంధ ఛార్జీల‌ను పూర్తిగా అర్ధం చేసుకోవ‌డం చాలా అవ‌స‌రం. విద్యా రుణం తిరిగి చెల్లించే కాల‌వ్య‌వ‌ధి స్ప‌ష్టంగా తెలుసుకోవాలి. సాధార‌ణంగా మీ కోర్సును పూర్తి చేసి, ప‌ని చేయ‌డం ప్రారంభించిన త‌ర్వాత రుణ చెల్లింపు ప్రారంభ‌మ‌వుతుంది.

ఉద్యోగంలో చేరినా రుణాన్ని తిరిగి చెల్లించ‌డానికి 6 నెల‌లు, ఒక ఏడాది మొర‌టోరియం (గ‌డువు) కూడా పొందొచ్చు.కానీ రుణంపై చెల్లింపులు వెంట‌నే చేయ‌న‌వ‌స‌రం లేన‌ప్ప‌టికీ, రుణంపై చెల్లించాల్సిన వ‌డ్డీ ఈ వ్య‌వ‌ధిలో పెరిగిపోతుంది. అందుచేత మొర‌టోరియం వ్య‌వ‌ధిలో, మీ రుణ భారాన్ని త‌గ్గించుకోవ‌డానికి వ‌డ్డీని చెల్లించే అవ‌కాశం అయితే ఉంటుంది.

విద్యా రుణాన్ని మీరు ఇష్ట‌ప‌డే కోర్సుకు పెట్టే పెట్టుబ‌డిగానే చూడాల‌ని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. విద్యా రుణం మీ కుటుంబంపై ఆర్ధిక భారాన్ని త‌గ్గించ‌డ‌మే కాకుండా, ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది. విద్యా రుణాల‌పై చెల్లించే వ‌డ్డీ ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం, 1961లోని 80ఈ ప్ర‌కారం మిన‌హాయించ‌బ‌డుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని