Elon Musk - Twitter: ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ డీల్‌.. ఎప్పుడేం జరిగిందంటే..?

ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సంస్థ ట్విటర్‌ను కొనుగోలు చేసి దాన్ని ప్రైవేటు కంపెనీగా మార్చాలనుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌.. మూడు నెలలు తిరగకుండానే

Updated : 09 Jul 2022 12:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సంస్థ ట్విటర్‌ను కొనుగోలు చేసి దాన్ని ప్రైవేటు కంపెనీగా మార్చాలనుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌.. మూడు నెలలు తిరగకుండానే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. నకిలీ ఖాతాలకు సంబంధించి ఆ సంస్థ పూర్తి సమాచారం ఇవ్వలేదని, విలీన ఒప్పందంలోని పలు నిబంధనలను ట్విటర్‌ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. మస్క్‌ తాజా నిర్ణయం టెక్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. అయితే దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ట్విటర్‌ బోర్డు ప్రకటించింది.

ఈ సందర్భంగా అసలు ఎలాన్‌ మస్క్‌, ట్విటర్‌ మధ్య ఒప్పందంలో ఎప్పుడేం జరిగిందో ఓ సారి చూద్దాం..!

> జనవరి 31, 2022: ట్విటర్‌ కంపెనీలో ఎలాన్‌ మస్క్‌ షేర్లను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు.

మార్చి 14, 2022: ఈ కంపెనీలో మస్క్‌ షేర్ల విలువ 5శాతానికి పెరిగింది.

మార్చి 26, 2022: ట్విటర్‌ భవిష్యత్తు మార్గాలపై చర్చించేందుకు మస్క్‌.. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సేను సంప్రదించారు.

మార్చి 27, 2022: ట్విటర్‌ ఎగ్జిక్యూటివ్‌లతో జరిగిన చర్చలో తాను కంపెనీ యాజమాన్యంలో చేరేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కంపెనీ బోర్డులో చేరడం, ట్విటర్‌ను ప్రైవేటు కంపెనీగా మార్చడం వంటి వివరాలను చర్చించారు. అంతేగాక, ట్విటర్‌కు పోటీదారుగా మరో సామాజిక మాధ్యమ సంస్థను ప్రారంభించే యోచన కూడా ఉన్నట్లు చెప్పారు.

ఏప్రిల్‌ 4, 2022: ట్విటర్‌లో మస్క్‌ షేరు 9.2శాతానికి పెరిగింది. ఈ విషయాన్ని మస్క్‌ స్వయంగా వెల్లడించారు. సంస్థలో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారుగా నిలిచారు.

ఏప్రిల్‌ 5, 2022: ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ బోర్డులో చేరనున్నట్లు ట్విటర్‌ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ ప్రకటించారు.

ఏప్రిల్‌ 9, 2022: తాను ట్విటర్‌ బోర్డులో చేరబోనని మస్క్‌.. సంస్థ ఎగ్జిక్యూటివ్‌లకు తెలిపారు. ట్వటర్‌ను ప్రైవేటు చేసేందుకు ఆఫర్‌ ఇస్తానని అన్నారు.

ఏప్రిల్‌ 10, 2022: ట్విటర్‌ బోర్డులో చేరేందుకు మస్క్‌ నిరాకరించిన విషయాన్ని పరాగ్‌ అగర్వాల్‌ అధికారికంగా ప్రకటించారు.

ఏప్రిల్‌ 12, 2022: ట్విటర్‌లో వాటాలు కొన్న విషయాన్ని సెక్యూరిటీ ఎక్స్ఛేంజెస్‌ కమిషన్‌కు చెప్పనందుకు గానూ కంపెనీ మదుపర్లు కొందరు మస్క్‌పై దావా వేశారు.

ఏప్రిల్‌ 14, 2022: ట్విటర్‌ను కొనుగోలు చేస్తానని మస్క్‌ ప్రకటించారు. ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున 44 బిలియన్ డాలర్ల ఒప్పందానికి ఆఫర్‌ ఇచ్చారు.

ఏప్రిల్‌ 15, 2022: మస్క్‌ కొనుగోలు ప్రక్రియను నిలిపివేసేందుకు ట్విటర్‌ బోర్డు ‘పాయిజన్ పిల్’ వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంది.

ఏప్రిల్‌ 21, 2022: ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్‌ తన ఆర్థిక ప్రణాళికను ప్రకటించారు. 21 బిలియన్‌ డాలర్లు వ్యక్తిగత ఈక్విటీలు, 25.5 బిలియన్‌ డాలర్ల లోన్ల రూపంలో చెల్లిస్తానని వెల్లడించారు.

ఏప్రిల్‌ 25, 2022: మస్క్ కొనుగోలు ఆఫర్‌ను ట్విటర్‌ బోర్డు అంగీకరించింది.

ఏప్రిల్‌ 29, 2022: టెస్లాలో 8.4 బిలియన్ డాలర్ల షేర్లను మస్క్‌ విక్రయించారు.

మే 14, 2022: నకిలీ ఖాతాల వివరాలను ట్విటర్‌ వెల్లడించడం లేదన్న కారణంతో మస్క్‌ ఈ కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

మే 15, 2022: తమ వేదికపై 5 శాతం కంటే తక్కువగానే స్పామ్‌ ఖాతాలు ఉన్నట్లు ట్విటర్‌ మస్క్‌కు నివేదిక ఇచ్చింది.

మే 17, 2022: ఈ నివేదికపై ఆధారాలు లేకుండా ఈ ఒప్పందం ముందకెళ్లదని మస్క్ స్పష్టం చేశారు.

జూన్‌ 8, 2022: మస్క్ డిమాండ్లకు అనుగుణంగా అన్ని పబ్లిక్‌ ట్వీట్లకు సంబంధించి యాక్సెస్‌ను మస్క్‌కు ఇచ్చేందుకు ట్విటర్‌ అంగీకరించింది.

జూన్‌ 16, 2022: ట్విటర్ ఉద్యోగులతో మస్క్ వర్చువల్‌గా సమావేశమయ్యారు. నకిలీ ఖాతాలు, ఇతర అంశాలపై ట్విటర్‌ ఇచ్చిన యూజర్ల డేటా అసంపూర్తిగా ఉందని మస్క్‌ ఆరోపించారు.

జులై 8, 2022: ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకొంటున్నట్లు మస్క్‌ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని