Elon Musk: మస్క్‌కు రష్యా నుంచి బెదిరింపులు?

ఇటీవల ట్విటర్‌ను కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్ తాజాగా చేసిన మరో ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది....

Updated : 09 May 2022 12:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ట్విటర్‌ను కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్ (Elon Musk) తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన చేసిన మరో ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ‘తాను అనుమానాస్పద రీతిలో మరణిస్తే...’ అంటూ చేసిన ట్వీట్‌ అందరినీ ఆలోచింపజేస్తోంది. ఎప్పుడూ భవిష్యత్తు.. వచ్చే మార్పులు.. ఆధునిక సాంకేతికతపై ఆశావహ వ్యాఖ్యలు చేసే మస్క్‌ (Elon Musk) ఇలా ఒక్కసారిగా మరణం గురించి మాట్లాడడం చర్చకు దారి తీసింది.

ఈ ట్వీట్‌కు ముందు ఎలాన్‌ మస్క్‌ చేసిన మరికొన్ని ట్వీట్లు కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రష్యా (Russia) అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్‌ డైరెక్టర్‌ దిమిత్రీ ఒలెగోవిచ్‌ రోగోజిన్‌ నుంచి తనకు ఓ సందేశం అందినట్లు మస్క్‌ (Elon Musk) అందులో పేర్కొన్నారు. రష్యన్‌ భాషలో ఉన్న దాన్ని ట్విటర్‌ (Twitter)లో ఉంచారు. ఉక్రెయిన్‌ (Ukraine)కు మిలిటరీ కమ్యూనికేషన్‌ ఉపకరణాలు అందిస్తున్నందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అందులో ఉంది. మేరియుపోల్‌లో ఉక్రెయిన్‌ సేనలకు ఇంటర్నెట్‌ సేవలు అందిస్తున్నట్లు తమకు బందీగా చిక్కిన ఆ దేశ మెరైన్‌ బ్రిగేడ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చెప్పినట్లు మస్క్‌కు పంపిన లేఖలో రోగోజిన్‌ పేర్కొన్నారు.

తద్వారా ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నియంతృత్వ శక్తులకు సహకరిస్తున్నారని రోగోజిన్‌ రష్యన్‌ మీడియాతో కూడా అన్నట్లు సమాచారం. దీనికి కచ్చితంగా మస్కే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఉక్రెయిన్‌ (Ukraine) సేనలు, వారికి మద్దతిస్తున్న వారిని నాజీలుగా వ్యవహరించారు.

ఈ పరిణామాల నేపథ్యంలోనే మస్క్ తాజాగా చేసిన మరణానికి సంబంధించిన ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. రష్యా గతంలో పలువురిని అనుమానాస్పద రీతిలో విషం ఇచ్చి చంపించినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. బహుశా మస్క్‌కు కూడా రష్యా నుంచి ఆ రకంగా బెదిరింపులు వచ్చి ఉంటాయని పలువురు విశ్లేషకులు అనుమానిస్తున్నారు. మరోవైపు రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో ఇంటర్నెట్‌ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఎలాన్ మస్క్‌ తన స్టార్‌లింక్‌ (StarLink) సేవల్ని అక్కడ ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని