Akasa Air: ఆకాశ ఎయిర్‌ కార్యకలాపాలు ప్రారంభం

కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ కార్యకలాపాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కంపెనీ తొలి విమానం ప్రయాణికులతో ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు చేరింది. పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దృశ్యమాధ్యమ పద్ధతిలో ఈ విమానాన్ని ప్రారంభించారు. ఆకాశ ఎయిర్‌లో పెట్టుబడులు పెట్టిన ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా తొలి విమానంలో ప్రయాణించారు.

Updated : 08 Aug 2022 04:13 IST

దిల్లీ: కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ కార్యకలాపాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కంపెనీ తొలి విమానం ప్రయాణికులతో ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు చేరింది. పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దృశ్యమాధ్యమ పద్ధతిలో ఈ విమానాన్ని ప్రారంభించారు. ఆకాశ ఎయిర్‌లో పెట్టుబడులు పెట్టిన ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా తొలి విమానంలో ప్రయాణించారు. విమానయాన రంగ దిగ్గజాలు ఆదిత్య ఘోష్‌, వినయ్‌ దూబే ఈ సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘సింధియాకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రపంచంలో ఏ సంస్థ ఏర్పాటైన 12 నెలల్లోనే విమాన సర్వీసులు ప్రారంభించలేదు. మన పౌరవిమానయాన శాఖ సహకారం వల్లే అది సాకారం చేయగలిగాం’ అని ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు. మరిన్ని సంస్థలు విమానయాన రంగంలోకి రానున్నట్లు సింధియా వెల్లడించారు. ఆగస్టు 13, ఆగస్టు 19, సెప్టెంబరు 15 తేదీల నుంచి బెంగళూరు-కోచి, బెంగళూరు- ముంబయి, చెన్నె- ముంబయి మార్గాల్లో ఆకాశ ఎయిర్‌ విమాన సేవలు ప్రారంభించనుంది.
2027కు 40 కోట్ల మంది: దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 2013-14లో 6 కోట్లు కాగా, 2019-20లో 20 కోట్లకు చేరిందని.. 2027 కల్లా ఏటా 250 శాతం వృద్ధితో ఇది 40 కోట్లకు చేరనుందని సింధియా పేర్కొన్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా మార్గాల్లోని ప్రయాణించే వారి సంఖ్య కలిపే ఇంతకు చేరొచ్చని తెలిపారు. ఏటా 100-110 విమానాలు జతచేరుతూ, 2027కు 1200 విమానాలు దేశంలో ఉంటాయని, 2030 కల్లా విమానాశ్రయా సంఖ్య 220కి చేర్చాలన్నది ప్రణాళికగా పేర్కొన్నారు.


29న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏజీఎం

ముంబయి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) 44వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) ఈ నెల 29న నిర్వహించనున్నారు. ఆ రోజు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు ఇది ప్రారంభమవుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏజీఎంలో ప్రకటించబోయే డివిడెండ్‌కు రికార్డు తేదీగా ఈ నెల 19ని కంపెనీ నిర్ణయించింది. తీర్మానాలపై ఓటింగ్‌కు, ఏజీఎంకు హాజరయ్యేందుకు కటాఫ్‌ తేదీని ఈ నెల 22గా ప్రకటించింది.

నిలిచిపోయిన 10 విమానాలు మళ్లీ రంగంలోకి: ఎయిరిండియా


31 నుంచి కెనడాకు రోజూ విమానం

దిల్లీ: కొవిడ్‌ 19 పరిణామాలకు తోడు పలు కారణాల వల్ల నిలిచిపోయిన 10 వైడ్‌-బాడీ బోయింగ్‌ 777-300 ఈఆర్‌ విమానాలను సిద్ధం చేస్తున్నామని, 2023 ప్రారంభంలో ఇవి మళ్లీ కార్యకలాపాలు కొనసాగించే వీలుందని ఎయిరిండియా ఆదివారం తెలిపింది. వైడ్‌-బాడీ విమానాల్లో భారీ ఇంధన ట్యాంక్‌ ఉంటుంది. దీంతో భారత్‌- అమెరికా, భారత్‌- కెనడా వంటి సుదూర అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణానికి అనువుగా ఉంటాయి. ‘ప్రస్తుతం ఎయిరిండియా చేతిలో 43 వైడ్‌-బాడీ విమానాలు ఉన్నాయి. ఇటీవల వరకు 28 విమానాలు మాత్రమే నడిచేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 33కు చేరింది. మిగతా 10 విమానాలను సైతం 2023 ప్రారంభంలో కార్యకలాపాలకు తీసుకొస్తాం’ అని ఎయిరిండియా తెలిపింది. ఆగస్టు 31 నుంచి దిల్లీ-వాంకోవర్‌ (కెనడా) మధ్య రోజువారీ విమానాన్ని నడపనున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. ప్రస్తుతం దిల్లీ-వాంకోవర్‌ మధ్య వారానికి మూడుసార్లు విమానాలను ఎయిరిండియా నడుపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని