సరైన సమయంలోనే రేట్లు పెంచాం

కీలక రేట్లను కాస్త ముందుగానే పెంచడం మొదలుపెట్టి ఉండాల్సిందన్న విమర్శలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పందించారు. కొన్ని దేశాల కేంద్రబ్యాంకులు ముందుగానే రేట్లు పెంచగా, ఆర్‌బీఐ మే నెల నుంచి రెపోరేటును పెంచడం ప్రారంభించి, ఇప్పటికి 190 బేసిస్‌ పాయింట్లు అధికం చేసింది.

Published : 03 Nov 2022 01:49 IST

తొందరపడితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేది
ద్రవ్యోల్బణ అదుపుపై దృష్టి పెట్టాం
ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ముంబయి: కీలక రేట్లను కాస్త ముందుగానే పెంచడం మొదలుపెట్టి ఉండాల్సిందన్న విమర్శలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పందించారు. కొన్ని దేశాల కేంద్రబ్యాంకులు ముందుగానే రేట్లు పెంచగా, ఆర్‌బీఐ మే నెల నుంచి రెపోరేటును పెంచడం ప్రారంభించి, ఇప్పటికి 190 బేసిస్‌ పాయింట్లు అధికం చేసింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు రేట్లను ముందే పెంచిఉంటే, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలేదని దాస్‌ అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థ ఇపుడు స్థిరత్వంతో, ప్రపంచానికే ఆశావహంగా మారిందన్నారు. ద్రవ్యోల్బణం కూడా  దిగి వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. గత 3 త్రైమాసికాలుగా రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని గరిష్ఠ లక్ష్యమైన 6 శాతంలోపు ఉంచడంలో విఫలమైనందుకు, కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు.

ద్రవ్యోల్బణం: ఈ విషయంలో లక్ష్యాన్ని చేరలేకపోయాం. ఒక వేళ ముందస్తుగా రేట్లు పెంచితే, దేశ పౌరులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యేవారు. ఆర్థిక వ్యవస్థ రికవరీకి భంగం కలిగించకుండా, భద్రంగా ముందుకు తీసుకెళ్లాం. అర్జునుడు మత్య్సయంత్రంపై గురిపెట్టినట్లుగా, మేం కూడా ద్రవ్యోల్బణంపై దృష్టి కేంద్రీకరించే పనిచేస్తున్నాం.

యుద్ధం వల్లే : ద్రవ్యోల్బణ లక్ష్యమైన 2-6 శాతం కంటే కాస్త అధికమైనా భరించగలిగేలా, పరపతి విధానంలో ఉన్న సౌలభ్యాన్ని కొవిడ్‌ సమయంలో ఆర్‌బీఐ ఉపయోగించుకుంది. తద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించగలిగాం. 2020-21లో కరోనా పరిణామాల వల్ల క్షీణించిన జీడీపీ, ఆ తర్వాత  పుంజుకుంటోంది. 2023-24లోనూ రాణించగలదనే అంచనా వేస్తున్నాం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలవడానికి ముందు వరకు, ద్రవ్యోల్బణం 4.3 శాతానికి వస్తుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. యుద్ధంతో అన్ని అంచనాలు తప్పాయి.

ప్రభుత్వానికి వెల్లడిస్తాం: 9 నెలల పాటు రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువన ఉండడానికి గల కారణాలను ప్రభుత్వానికి నివేదిస్తాం. 2-6 శాతం శ్రేణికి ఎప్పుడు తిరిగి వస్తుంది.. అందుకు చేపట్టాల్సిన చర్యలనూ తెలియజేస్తాం. వీటిని ఇపుడే బయటకు వెల్లడించలేం.


రిటైల్‌ ఇ-రూపాయి ఈ నెలలోనే

టోకు కార్యకలాపాల కోసం ఆవిష్కరించిన సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) గొప్ప మార్పు తీసుకొస్తుంది. ఈ నెలలోపే రిటైల్‌లోనూ ప్రవేశపెడతాం. పూర్తి స్థాయిలో సీబీడీసీని సమీప భవిష్యత్‌లోనే ఆవిష్కరిస్తాం. ప్రపంచంలోనే తొలిసారిగా చేస్తున్నందున తొందరపడ దలచుకోలేదు.


రూపాయి విలువ క్షీణత తక్కువగానే

తర కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకపు విలవు క్షీణత తక్కువగానే ఉంది. అంతర్జాతీయ అనిశ్చితిలో, రూపాయి స్థిరంగానే కదలినట్లు పరిగణించాలి. స్విస్‌ ఫ్రాంక్‌, సింగపూర్‌ డాలరు, రష్యా రూబుల్‌ వంటివి మినహా మిగతా అన్ని కరెన్సీలూ రూపాయి కంటే ఎక్కువ క్షీణించాయి. జపనీస్‌ యెన్‌తో పోలిస్తే 12.4%; చైనీస్‌ యువాన్‌తో పోలిస్తే 5.9%; పౌండ్‌తో పోలిస్తే 4.6%; యూరోతో పోలిస్తే 2.5% చొప్పున రూపాయి బలపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని