అమెజాన్‌ అకాడమీ మూసివేత!

భారత్‌లో ఎడ్యుటెక్‌ సేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన అమెజాన్‌ అకాడమీని మూసివేయాలని అమెజాన్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Published : 25 Nov 2022 03:40 IST

దిల్లీ: భారత్‌లో ఎడ్యుటెక్‌ సేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన అమెజాన్‌ అకాడమీని మూసివేయాలని అమెజాన్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్‌ కళాశాల్లో ప్రవేశానికి జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) కోసం విద్యార్థులకు శిక్షణ ఇచ్చే నిమిత్తం 2021 జనవరిలో ఈ వేదికను అమెజాన్‌ ప్రారంభించింది. 180 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.14.60 లక్షల కోట్ల) విలువైన దేశీయ విద్యా రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు.. బైజూస్‌, అన్‌అకాడమీ, వేదాంతు లాంటి ఎడ్యుటెక్‌ సంస్థలతో పోటీ పడే ఉద్దేశంతో అమెజాన్‌ అకాడమీని సంస్థ నెలకొల్పింది. అయితే వివిధ సమీక్షలు, మదింపు అనంతరం దీనిని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని అమెజాన్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుత బ్యాచ్‌ విద్యార్థుల పరీక్షా సన్నద్ధత కోర్స్‌ ముగిసే సమయంలోగా దశలవారీగా మూసివేత ప్రక్రియను చేపడతామని అన్నారు.

ఎడ్యుటెక్‌ సేవలను నిలిపివేయనున్న సమాచారాన్ని ఈ ఏడాది అక్టోబరులోనే అమెజాన్‌ తన ఉద్యోగులకు తెలియజేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుపై 25 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. సుమారు 150 మంది ఉద్యోగులు శిక్షణ తీసుకుంటున్నారు. ఏడాదికాలం పాటు అంటే 2024 అక్టోబరు వరకు కోర్స్‌కు సంబంధించిన పూర్తి మెటీరియల్‌ను వినియోగదారులకు ఆన్‌లైన్‌లో కంపెనీ అందుబాటులో ఉంచనుంది. ప్రస్తుత విద్యాసంవత్సరం బ్యాచ్‌లో నమోదైన విద్యార్థులకు పూర్తి ఫీజును కూడా తిరిగి ఇచ్చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని