అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ చేతికి సువెన్‌ ఫార్మా

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌లో మెజార్టీ వాటాను ఆ సంస్థ ప్రమోటరు వెంకట్‌ జాస్తి విక్రయిస్తున్నారు. కంపెనీలో ఆయనకు 60 శాతం వాటా ఉండగా, అందులో 50.1% వాటాను రూ.6,313.08 కోట్లకు అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ అనే అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థకు విక్రయించనున్నారు.

Published : 27 Dec 2022 01:48 IST

రూ.6,313.08 కోట్లకు 50.1% వాటా విక్రయిస్తున్న ప్రమోటరు వెంకట్‌ జాస్తి
కొంతకాలం పాటు ముఖ్య సలహాదారుడిగా కంపెనీకి సేవలు
కొహాన్స్‌ లైఫ్‌సైన్సెస్‌లో సువెన్‌ ఫార్మాను విలీనం చేసే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌లో మెజార్టీ వాటాను ఆ సంస్థ ప్రమోటరు వెంకట్‌ జాస్తి విక్రయిస్తున్నారు. కంపెనీలో ఆయనకు 60 శాతం వాటా ఉండగా, అందులో 50.1% వాటాను రూ.6,313.08 కోట్లకు అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ అనే అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థకు విక్రయించనున్నారు. రూ.1 ముఖ విలువ కల ఒక్కో షేరును ఆయన రూ.495 ధరకు విక్రయిస్తున్నారు. ఈ విక్రయం తర్వాత ఇంకా ఆయనకు సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌లో 9 శాతం వాటా మిగులుతుంది. ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు సువెన్‌ ఫార్మా సోమవారం వెల్లడించింది. వచ్చే అయిదారు నెలల్లో ఈ లావాదేవీ పూర్తవుతుందని అంచనా. ఆ తర్వాత కంపెనీ సీఎండీ స్థానం నుంచి వెంకట్‌ జాస్తి తప్పుకుంటారు. ముఖ్య సలహాదారుడిగా కంపెనీకి కొంతకాలం సేవలు అందిస్తారు. అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌కు ఆరోగ్య సేవల రంగంలో ఎంతో అనుభవం ఉన్నందున, భవిష్యత్తులో సువెన్‌ ఫార్మాను ఇంకా అభివృద్ధి పథంలో నడిపే అవకాశం కలుగుతుందని ఈ సందర్భంగా వెంకట్‌ జాస్తి పేర్కొన్నారు. సీడీఎంఓ (కాంట్రాక్టు పరిశోధన, తయారీ సేవల) విభాగంలో సువెన్‌ ఫార్మాను అగ్రస్థానంలో నిలపడమే తమ లక్ష్యమని అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా ఎండీ శ్వేత జలాన్‌ వివరించారు.

కొహాన్స్‌ లైఫ్‌సైన్సెస్‌లో విలీన ప్రతిపాదన

అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ గత రెండేళ్లలో మనదేశంలోని 3 ఫార్మా కంపెనీల్లో మెజార్టీ వాటా కొనుగోలు చేసింది. అందులో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆర్‌ ఏ కెమ్‌ ఫార్మా, అవ్రా లేబొరేటరీస్‌, ముంబయికి చెందిన జడ్‌సీఎల్‌ కెమికల్స్‌ ఉన్నాయి. ఈ మూడు కంపెనీల్లోని పెట్టుబడులను కొంతకాలం క్రితం కొహాన్స్‌ లైఫ్‌సైన్సెస్‌ అనే సంస్థ కిందకు అడ్వెంట్‌ తీసుకొచ్చింది.

* ఆర్‌ ఏ కెమ్‌ ఫార్మా ఏపీఐ ఔషధాలు ఉత్పత్తి చేసే సంస్థ కాగా, అవ్రా ల్యాబ్స్‌ ఫార్మా పరిశోధనా కార్యకలాపాలు సాగిస్తోంది. జడ్‌సీఎల్‌ కెమికల్స్‌ స్పెషాలిటీ కెమికల్‌్్సనూ తయారు చేస్తోంది. దీనికి అదనంగా సీడీఎంఓ విభాగానికి చెందిన కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా ఒక సమీకృత ఫార్మా కంపెనీగా కొహాన్స్‌ లైఫ్‌సైన్సెస్‌ను తీర్చిదిద్దాలనే ఆలోచనలో అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ కొంతకాలంగా ఉంది. దీనికి అనుగుణంగానే సువెన్‌ ఫార్మాను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొహాన్స్‌లో సువెన్‌ ఫార్మాను విలీనం చేసే ప్రతిపాదనను సమీప భవిష్యత్తులో పరిశీలిస్తామని అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది.

ఓపెన్‌ ఆఫర్‌ కూడా

సువెన్‌ ఫార్మా ప్రమోటర్‌ అయిన వెంటక్‌ జాస్తి నుంచి మెజార్టీ వాటా కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నందున, సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా) నిబంధనల ప్రకారం సువెన్‌ ఫార్మాలోని సాధారణ తరగతి వాటాదార్ల నుంచి 26 శాతం వాటా కొనుగోలు కోసం అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ ‘ఓపెన్‌ ఆఫర్‌’ జారీ చేయాల్సి వస్తుంది. అడ్వెంట్‌ తరఫున కోటక్‌ మహీంద్రా కేపిటల్‌ కంపెనీ ‘ఓపెన్‌ ఆఫర్‌’ ప్రకటన విడుదల చేసింది. ఒక్కో షేరుకు  రూ.495 చొప్పున చెల్లించనున్నట్లు, మొత్తం 6,61,86,889 ఈక్విటీ షేర్లు (సువెన్‌ ఫార్మా జారీ మూలధనంలో 26 శాతం) కొనుగోలు చేయడానికి సిద్ధమని ప్రకటించింది. రూ.495 ధర ప్రకారం ఈ షేర్ల విలువ రూ.3,276 కోట్లకు పైగానే ఉంటుంది. అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌కు అనుబంధ సంస్థ అయిన సైప్రస్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న  బెర్‌హైందా లిమిటెడ్‌ ఈ షేర్లను కొనుగోలు చేస్తుంది.

* ఈ వార్తల నేపథ్యంలో, సువెన్‌ ఫార్మా షేరు బీఎస్‌ఈలో సోమవారం రూ.511.70 వద్ద ప్రారంభమై, రూ.520.35 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అయితే తరవాత నష్టపోయి రూ.470.70 వద్ద కనిష్ఠాన్ని తాకినా, చివరకు రూ.472.20 వద్ద స్థిరపడింది. శుక్రవారం ముగింపు ధర రూ.498.20తో పోలిస్తే, ఇది రూ.26  తక్కువ.


అతిపెద్ద ఒప్పందం

షధ, ఐటీ రంగాలకు హైదరాబాద్‌ కేంద్ర స్థానంగా ఉండగా.. ఈ విభాగాల కంపెనీల్లో ఇటీవల కాలంలో సువెన్‌ ఫార్మాదే అతిపెద్ద ‘కార్పొరేట్‌ డీల్‌’ . దాదాపు రూ.13,000 కోట్ల సంస్థాగత విలువ ప్రకారం, ఈ కంపెనీలో మెజార్టీ వాటాను వెంకట్‌ జాస్తి విక్రయిస్తున్నారు. సువెన్‌ ఫార్మా వాటా కోసం ప్రధానంగా బ్లాక్‌స్టోన్‌, అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ పోటీ పడ్డాయి. చివరకు అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌దే పైచేయి అయింది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మరొక ఫార్మా కంపెనీ ప్రమోటర్లు కూడా వాటా విక్రయించే ఉద్దేశంలో ఉన్నారనే ప్రచారం కొంతకాలంగా ఉంది. కానీ  తక్కువ సమయంలోనే సువెన్‌ ఫార్మా లావాదేవీ పూర్తయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని