ఓడీఐ మార్గంలో విదేశాల్లో స్థిరాస్తి కొనుగోళ్లా?

విదేశాల్లో స్థిరాస్తులను కొనుగోలు చేసేందుకు కొన్ని సంస్థలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఓడీఐ) మార్గాన్ని ఉపయోగించడం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Published : 14 May 2023 02:39 IST

ఆర్‌బీఐ ఆందోళన

దిల్లీ: విదేశాల్లో స్థిరాస్తులను కొనుగోలు చేసేందుకు కొన్ని సంస్థలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఓడీఐ) మార్గాన్ని ఉపయోగించడం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై సరైన మార్గదర్శకాలను రూపొందించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల పత్రిక పేర్కొంది. భారతీయులు ప్రస్తుతం లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్‌), ఓడీఐ మార్గాల్లో విదేశాలకు డబ్బు పంపించుకునే వీలుంది. వ్యక్తులు ఏడాదికి 2,50,000 డాలర్ల వరకూ ఎల్‌ఆర్‌ఎస్‌ మార్గంలో విదేశాలకు డబ్బు పంపించవచ్చు. ఓడీఐ విధానం కంపెనీలకు వర్తిస్తుంది. ఏడాదికి 1 బిలియన్‌ డాలర్ల గరిష్ఠ పరిమితి వరకూ డబ్బును పంపించే వీలుంటుంది. సంపన్న వ్యక్తులు విదేశాల్లో పెట్టుబడి పెట్టేందుకు వ్యక్తిగతంగా కాకుండా కంపెనీలు లేదా కుటుంబ ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల నిర్దేశించిన వ్యక్తిగత చెల్లింపుల పరిమితిని పక్కదోవ పట్టిస్తున్నారని ఆర్‌బీఐ గమనించింది.

ఎఫ్‌ఏక్యూ తీసుకొచ్చే యత్నంలో ఆర్‌బీఐ: ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం పెట్టుబడుల కోసం స్థిరాస్తుల కొనుగోలు అనుమతి లేదని ఇటీవలి డీలర్‌ బ్యాంకులతో జరిగిన సమావేశంలో ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఓడీఐ విధానానికి సంబంధించి ఒక ప్రశ్నావళిని(ఎఫ్‌ఏక్యూ) సిద్ధం చేసేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోందని సంబంధిత వ్యక్తులు తెలిపారు. కొందరు వ్యక్తులు విదేశాల్లో స్థిరాస్తి కొనుగోళ్లకు ఇక్కడి బ్యాంకులు, సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నారని ఆర్‌బీఐ పేర్కొంది. ఆ దేశాల్లో స్థిరాస్తి మార్కెట్‌ ప్రతికూలంగా మారితే.. ఆ రుణాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

నిషేధం లేదు కానీ..: కచ్చితంగా చెప్పాలంటే భారతీయులు ఓడీఐ విధానంలో విదేశాల్లో ఆస్తులు కొనేందుకు నిషేధం లేదు. కాకపోతే ఆ కొనుగోలు ఒక లక్ష్యంతో ఉండాలి. ఉదాహరణకు ఒక భారతీయ కంపెనీ విదేశాల్లో విస్తరించేందుకు వాణిజ్య స్థలాన్ని కొనుగోలు చేయొచ్చు. ఆ స్థిరాస్తిని పూర్తిగా పెట్టుబడి కోసం కొంటే నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. విదేశీ అనుబంధ సంస్థలు, ఉమ్మడి భాగస్వామ్యాల ఏర్పాటు కోసం ఓడీఐ మార్గంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుంది. కానీ, కొంతమంది ఈ మార్గాన్ని వాడుకొని, లండన్‌, దుబాయ్‌లలో స్థిరాస్తి కొనుగోళ్లు చేస్తున్నారని ఆర్‌బీఐ దృష్టికి వచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌ మార్గంలోనూ స్థిరాస్తుల కొనుగోలు గురించీ ఆర్‌బీఐ కొంత ఆందోళన చెందుతోంది. నిర్ణీత పరిమితుల్లో ఉన్నంత వరకూ రెమిటెన్స్‌ డబ్బును ఏం చేశారని ఆర్‌బీఐ పట్టించుకోదు అని కేంద్ర బ్యాంక్‌ మాజీ అధికారి వివరించారు. ఆస్తుల కొనుగోలు నిర్ణీత ప్రయోజనం, లేదా పని కోసం ఉపయోగించినప్పుడు ఆర్‌బీఐకి ఇబ్బందేమీ ఉండదు. కానీ, పెట్టుబడుల విషయంలోనే కొంత జాగ్రత్తగా ఉంటుంది. ఊహాజనిత లాభాల కోసం విదేశీ స్థిరాస్తి పెట్టుబడులు పెట్టినప్పుడు ఆర్‌బీఐ ఆ విషయంపై దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. సొంత నిధులు లేకపోయినా, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని, విదేశాల్లో పెట్టుబడులు పెడితే.. మార్కెట్‌ పరిస్థితులు క్షీణించినప్పుడు రుణదాతలకు ప్రమాదం ఉంటుందని తెలిపారు.

అవకాశాలు కోల్పోయే ఆస్కారం..

మరోవైపు విదేశాల్లో డబ్బును దాచుకునే మార్గంగా ఇది మారకుండా చూడాలనీ ఆర్‌బీఐ ఆలోచిస్తోందని పేర్కొన్నారు. విదేశీ స్థిరాస్తుల కొనుగోళ్లకు సంబంధించి, స్పష్టమైన విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే దేశీయ పెట్టుబడిదారులు విదేశాల్లో ఉన్న అవకాశాలను కోల్పోయే ఆస్కారం ఉందంటున్నారు. సంపన్నులు విదేశాల్లో ఆస్తులు కొని, దానిని అద్దెకు ఇవ్వడం ద్వారా లాభాలను సంపాదించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని