మారుతీకి విక్రయాల జోష్‌

జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది.

Published : 27 Apr 2024 01:55 IST

లాభంలో 47.8% వృద్ధి
2500% డివిడెండు

దిల్లీ: జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. కిందటేడాది ఇదే సమయంలో నికర లాభం రూ.2,623.60 కోట్లుగా ఉంది. అధిక విక్రయాలు, కమొడిటీ ధరల సానుకూలతలు, వ్యయ నియంత్రణ చర్యలు లాంటివి లాభంలో వృద్ధికి దోహదం చేశాయని కంపెనీ తెలిపింది. 2023-24లో మారుతీ తొలిసారిగా 20 లక్షల వాహనాల వార్షిక విక్రయాలను నమోదు చేసింది. అలాగే పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.13,209.40 కోట్లకు చేరగా.. 2022-23లోని రూ.8,049.20 కోట్లతో పోలిస్తే 64 శాతం పెరిగింది. వరుసగా మూడో సంవత్సరం కూడా అగ్రగామి ఎగుమతిదారుగా మారుతీ నిలిచింది. భారత్‌ నుంచి ఎగుమతి అయిన ప్యాసింజర్‌ వాహనాల్లో మారుతీ వాటానే 41.8 శాతంగా ఉండటం గమనార్హం.

  • 2023-24లో కంపెనీ మొత్తం వాహన విక్రయాలు 8.6 శాతం పెరిగి 21,35,323 వాహనాలుగా నమోదయ్యాయి. ఇందులో దేశీయ విక్రయాలు 18,52,256 వాహనాలు కాగా.. ఎగుమతులు 2,83,067 వాహనాలుగా ఉన్నాయి. 2023-24లో నికర విక్రయాలు రూ.1,34,937.80 కోట్లుగా నమోదయ్యాయి. 2022-23లోని రూ.1,12,500.80 కోట్లతో పోలిస్తే 19.9 శాతం పెరిగాయి.
  • జనవరి- మార్చి విషయానికొస్తే... మారుతీ మొత్తం విక్రయాలు 13.4 శాతం పెరిగి 5,84,031 వాహనాలకు చేరాయి. దేశీయ విక్రయాలు 5,05,291 వాహనాలుగా నమోదయ్యాయి. ఎగుమతులు 78,740 వాహనాలు కాగా.. ఏడాదిక్రితం ఇదే త్రైమాసికంలో ఎగుమతి చేసిన 64,719 వాహనాలతో పోలిస్తే 21.7 శాతం పెరిగాయి.నికర విక్రయాలు రూ.30,821.80 కోట్ల నుంచి రూ.36,697.50 కోట్లకు పెరిగాయి.
  • రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.125 (2500%) డివిడెండును డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం.
  • రికార్డులే రికార్డులు..: త్రైమాసికం, ఆర్థిక సంవత్సరానికి కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభం నమోదైంది. విక్రయాలపరంగా కూడా రికార్డే. స్టోర్ట్‌ యుటిలీలీ వాహనాల (ఎస్‌యూవీలు) అధిక విక్రయాలు, కమొడిటీ ధరల సానుకూలతలు, వ్యయ నియంత్రణ చర్యలు లాంటివి లాభంలో వృద్ధికి దోహదం చేశాయని కంపెనీ తెలిపింది. అయితే ఎన్ని ఎస్‌యూవీలను విక్రయించిందో ఆ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొట్టమొదటి విద్యుత్‌ వాహనం తయారీని ప్రారంభించనున్నట్లు కంపెనీ ఛైర్మన్‌ ఆర్‌.సి.భార్గవ తెలిపారు. మొదటి విడత కార్లను ఐరోపాకు ఎగుమతి చేసేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు