వరుస లాభాలకు విరామం

సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు.

Published : 27 Apr 2024 01:58 IST

సమీక్ష

సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. రూపాయి తగ్గడం, విదేశీ అమ్మకాలు ఇందుకు తోడయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు నష్టపోయి 83.35 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.31% లాభంతో 89.29 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు అదే ధోరణిలో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 74,509.31 పాయింట్ల వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. గరిష్ఠాల్లో అమ్మకాలతో నష్టాల్లోకి జారుకున్న సూచీ, మళ్లీ కోలుకోలేకపోయింది. ఒకదశలో 73,616.65 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 609.28 పాయింట్ల నష్టంతో 73,730.16 వద్ద ముగిసింది. నిఫ్టీ 150.40 పాయింట్లు కోల్పోయి 22,419.95 దగ్గర  స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,385.55- 22,620.40 పాయింట్ల మధ్య కదలాడింది.

  • త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు ఇంట్రాడేలో 8.26% క్షీణించి రూ.6,691.40 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 7.73% నష్టంతో రూ.6,729.85 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.34,914.48 కోట్లు తగ్గి రూ.4.16 లక్షల కోట్లకు పరిమితమైంది.
  • ఆదాయ వృద్ధి, మార్జిన్‌లను పెంచేందుకు మూడేళ్ల కార్యాచరణను ప్రకటించడంతో టెక్‌ మహీంద్రా షేరు ఇంట్రాడేలో 13% దూసుకెళ్లి రూ.1,344.95 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 7.34% లాభంతో రూ.1,277.45 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.8,537.51 కోట్లు పెరిగి రూ.1.24 లక్షల కోట్లకు చేరింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 24 నష్టపోయాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3.55%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.36%, నెస్లే 3.08%, ఎం అండ్‌ ఎం 2.45%, కోటక్‌ బ్యాంక్‌ 2.11%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 2.09%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.08%, మారుతీ 1.70%, ఎస్‌బీఐ 1.38% డీలాపడ్డాయి. విప్రో 0.79%, ఐటీసీ 0.56% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, టెక్‌, వాహన, టెలికాం 0.70% వరకు నీరసపడ్డాయి. ఇంధన, ఆరోగ్య సంరక్షణ, సేవలు, విద్యుత్‌ పెరిగాయి. బీఎస్‌ఈలో 1866 షేర్లు నష్టాల్లో ముగియగా, 1920 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 127  షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
  • ఆర్‌బీఐ చర్యలతో కోటక్‌ బ్యాంక్‌పై ప్రభావం: ఎస్‌ అండ్‌ పీ: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్‌బీఐ చర్యలతో బ్యాంక్‌ రుణాల వృద్ధి, లాభదాయకతపై ప్రభావం పడొచ్చని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ వెల్లడించింది. ఆన్‌లైన్‌లో కొత్త ఖాతాదార్లను చేర్చుకోవద్దని, తాజాగా క్రెడిట్‌ కార్డులు జారీ చేయొద్దని బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు క్రెడిట్‌ కార్డులు అధిక లాభాలను తీసుకువచ్చే విభాగమని, డిసెంబరు త్రైమాసికానికి ఈ విభాగం 52 శాతం వృద్ధి చెందితే, మొత్తం రుణాల వృద్ధి 19 శాతంగా ఉందని ఎస్‌ అండ్‌ పీ తెలిపింది. ఆర్‌బీఐ తాజా చర్యలతో బ్యాంక్‌ శాఖల విస్తరణపై ఎక్కువ ఆధారపడాల్సి వస్తుందని, దీంతో నిర్వహణ వ్యయాలు అధికమవుతాయని అభిప్రాయపడింది. అయితే కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ బీబీబీ- రేటింగ్‌లో మాత్రం మార్పులు చేయలేదు.  
  • ప్రమోటర్‌ గ్రూప్‌ పతంజలి ఆయుర్వేద్‌కు చెందిన ఆహారేతర వ్యాపారాన్ని కొనుగోలు చేసే ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు పతంజలి ఫుడ్స్‌ తెలిపింది.

నేటి బోర్డు సమావేశాలు: ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని