భారత్‌కు టెస్లా క్లార్లు.. వయా జర్మనీ

టెస్లా సంస్థ జర్మనీలోని తమ గిగాఫ్యాక్టరీ నుంచి భారత్‌కు విద్యుత్‌ కార్లను ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. చైనాలోని షాంఘైలోనూ గిగాఫ్యాక్టరీ ఉన్నా, అక్కడ నుంచి విద్యుత్‌ కార్ల దిగుమతికి భారత అధికారులు ససేమిరా అనడంతో టెస్లా ఈ యోచన చేస్తున్నట్లు ఆంగ్ల వార్తా సంస్థ ‘మనీకంట్రోల్‌’  పేర్కొంది.

Updated : 09 Nov 2023 10:12 IST

టెస్లా సంస్థ జర్మనీలోని తమ గిగాఫ్యాక్టరీ నుంచి భారత్‌కు విద్యుత్‌ కార్లను ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. చైనాలోని షాంఘైలోనూ గిగాఫ్యాక్టరీ ఉన్నా, అక్కడ నుంచి విద్యుత్‌ కార్ల దిగుమతికి భారత అధికారులు ససేమిరా అనడంతో టెస్లా ఈ యోచన చేస్తున్నట్లు ఆంగ్ల వార్తా సంస్థ ‘మనీకంట్రోల్‌’  పేర్కొంది. టెస్లాకు ఐరోపాలో తొలి ఫ్యాక్టరీ కూడా జర్మనీ గిగాఫ్యాక్టరీనే కావడం గమనార్హం. అమెరికాకు చెందిన టెస్లా, 25,000 డాలర్ల (రూ.20 లక్షలపైన) కార్లను భారత మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. జర్మనీ నుంచి భారత్‌కు పంపబోయే వాహనాల(కంప్లీట్లీ బిల్ట్‌ అప్‌)కు దిగుమతి సుంకాన్ని తగ్గించాలని టెస్లా కోరుతున్నట్లు సమాచారం.

20-30 శాతం తగ్గించినా..

జర్మనీ నుంచి మెర్సిడెజ్‌ బెంజ్‌, బీఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి విలాస కార్ల తయారీ సంస్థలు భారత్‌కు కార్లను ఎగుమతి చేసున్నాయి. జర్మనీ నుంచి వచ్చే కార్లపై సుంకాన్ని 20-30 శాతం తగ్గించినా, కార్ల కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది.. ధరలు కూడా దిగివచ్చే వీలుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే టెస్లా రూ.20 లక్షల కారును విడిభాగాల రూపం(కంప్లీట్లీ నాక్డ్‌ డౌన్‌)లో భారత్‌కు పంపి, ఇక్కడ అసెంబ్లింగ్‌ చేసే పద్ధతిని అనుసరించొచ్చనీ  చెబుతున్నారు. ప్రస్తుతం భారత్‌ 40,000 డాలర్లలోపు విలువ (ధర, బీమా, రవాణా ఖర్చులు కలిపి) ఉన్న వాహనాలపై 60% వరకు దిగుమతి సుంకాన్ని విధిస్తోంది.

బ్రిటన్‌ ఈవీలపై దిగుమతి సుంకంలో కోత!

బ్రిటన్‌ నుంచి దిగుమతి చేసుకునే విద్యుత్‌ వాహనాల(ఈవీ)పై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇవి ప్రతిపాదనల దశలోనే ఉన్నాయని వార్తా సంస్థ ‘బ్లూమ్‌బర్గ్‌’ పేర్కొంది. 80,000 డాలర్ల కంటే అధిక విలువ కలిగిన ఈవీలపై దిగుమతి సుంకాన్ని 30% చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం 40,000 డాలర్ల విలువ (ధర, బీమా, రవాణా ఖర్చులు కలిపి)లోపు  ఉన్న వాహనాలపై 60% వరకు; ఆ పైన ధర ఉన్న ఈవీలపై 100% వరకు దిగుమతి సుంకాన్ని విధిస్తోంది. ఏదైనా కంపెనీ కనుక తొలుత మన దేశానికి ఎగుమతి చేసినా, తదుపరి మన దేశంలో తయారీకి సిద్ధపడితేనే.. ఆ కంపెనీకి చెందిన ఫుల్లీ బిల్ట్‌ (పూర్తి స్థాయిలో తయారైన) కార్లపై దిగుమతి సుంకం తగ్గించాలని ప్రభుత్వం అనుకుంటోందని ఆ కథనం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని