మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ

అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది.

Published : 05 May 2024 02:23 IST

ఏప్రిల్‌-జూన్‌పై ఫియో అంచనా

దిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. అంతర్జాతీయంగా గిరాకీ పరిస్థితులు నెమ్మదించే అవకాశం ఉండటమూ ఇందుకు కారణంగా వివరించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం సృష్టించిన అనిశ్చితుల కారణంగా 2023-24లో మనదేశ ఎగుమతులు 3.11% తగ్గి 437 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులు కూడా 8% తగ్గి 677.24 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

‘అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ప్రపంచవ్యాప్త గిరాకీపై ప్రభావం పడుతుంది. అందువల్ల ప్రస్తుత ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక గణాంకాల్లో గిరాకీ నెమ్మదించినట్లు కనిపించే అవకాశం ఉంద’ని ఫియో డైరెక్టరు జనరల్‌ అజయ్‌ సహాయ్‌ తెలిపారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగితే.. ప్రపంచ వాణిజ్యంపై తీవ్రంగానే ప్రభావం పడొచ్చని ఆయన హెచ్చరించారు. అంతర్జాతీయ అనిశ్చితులకు తోడు అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు కూడా గిరాకీ నెమ్మదించడానికి ప్రధాన కారణాలు అవుతాయని వివరించారు. ఐరోపా లాంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత నెమ్మదించే అవకాశాలూ ఉన్నాయని ఆయన అన్నారు. 2023-24లో భారత కరెన్సీ అయిన రూపాయి మారకపు విలువ 1.3% తగ్గితే, చైనా యువాన్‌ 4.8%, థాయ్‌ భాట్‌ 6.3%, మలేసియా రింగిట్‌ 7% క్షీణించాయని తెలిపారు. ఇజ్రాయిల్‌-ఇరాన్‌ యుద్ధం ప్రభావంపై స్పందిస్తూ.. యూఈఏ, ఆ తర్వాత ఇరాన్‌కు వెళ్లే ఉత్పత్తుల గిరాకీ నెమ్మదించొచ్చని ఇంజినీరింగ్‌ రంగంలోని కొందరు ఎగుమతిదార్లు అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు. ఆభరణాల గిరాకీ కూడా తగ్గే అవకాశం ఉందని అన్నారు.

ఎగుమతిదార్లకు ఆర్థిక సహకారం కావాలి: ఎగుమతిదార్లకు నిధుల లభ్యత కోసం ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అజయ్‌ పేర్కొన్నారు. ‘గిరాకీ నెమ్మదించడం వల్ల.. వస్తువుల విక్రయాలూ మందగమనంలో సాగుతాయి. దీంతో విదేశీ కొనుగోలుదార్లు, మన ఎగుమతిదార్లకు చెల్లింపులు చేసేందుకు ఎక్కువ సమయం తీసుకోవచ్చు. అందువల్ల అప్పటివరకు నిధుల అవసరం ఉంటుంది. అందువల్ల ఎగుమతిదార్లకు, వడ్డీ రేట్ల విషయంలో మన ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంద’ని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని