నాలుగేళ్ల పరిహారం.. రెండేళ్ల పాటు వేతనం

కొవిడ్‌ వల్ల మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు నాలుగేళ్ల పూర్తి పరిహారంతో పాటు, రెండేళ్ల పాటు వేతనాన్ని అందిస్తామని ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌

Published : 14 Jun 2021 01:33 IST

కొవిడ్‌ వల్ల మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు: ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌

దిల్లీ: కొవిడ్‌ వల్ల మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు నాలుగేళ్ల పూర్తి పరిహారంతో పాటు, రెండేళ్ల పాటు వేతనాన్ని అందిస్తామని ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరరెక్టర్‌ వి.వైద్యనాథన్‌ తెలిపారు. ఆయా ఉద్యోగులు వ్యక్తిగత-వాహన-విద్యారుణం వంటివి ఏమైనా తీసుకుని ఉంటే, ఆ మొత్తాన్ని రద్దు చేస్తామని వెల్లడించారు. రూ.25 లక్షల వరకు గృహరుణం కూడా రద్దు చేస్తామని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు 20 మంది కొవిడ్‌ మహమ్మారికి బలయ్యారని ఎండీ తెలిపారు. మరణించిన ఉద్యోగి భర్త/భార్యకు అర్హత ఉంటే కారుణ్య నియామకం ఇస్తామని, లేకపోతే నైపుణ్యాభివృద్ధికి రూ.2 లక్షలు అందిస్తామని పేర్కొన్నారు. ఇద్దరు పిల్లలకు నెలకు రూ.10000 చొప్పున, వారి డిగ్రీ అయ్యేవరకు మంజూరు చేస్తామన్నారు.

2022 ఆఖరుకు 10000 మంది ఐమిత్రా నిపుణులు

దిల్లీ: వచ్చే ఏడాది ఆఖరు కల్లా కంటిచూపును పరీక్షించి, సరైన అద్దాలు సూచించే ఐమిత్రా నిపుణులు మరో 2000 మందిని సిద్ధం చేస్తామని నేత్ర సంబంధ సేవలు అందించే ఎస్సిలార్‌ గ్రూప్‌ ప్రకటించింది. ఇప్పటికే తాము శిక్షణ ఇచ్చిన 8,000 మంది ఆంధ్రప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల్లో ఆప్టికల్‌ దుకాణాలు పెట్టుకుని జీవిస్తున్నారని ఎస్సిలార్‌ లక్జోటికా వైస్‌ ప్రెసిడెంట్‌ సౌగత బెనర్జీ తెలిపారు. నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధీకృత సంస్థలే ఈ శిక్షణ ఇస్తాయని, తదుపరి విక్రయశాల నెలకొల్పేందుకు, బ్రాండింగ్‌కు తాము సహకరిస్తామని వివరించారు. ఈ కార్యక్రమం కోసం విజన్‌ ఫర్‌ లైఫ్‌కు తాము 30 మిలియన్‌ యూరోల సాయం అందిస్తామన్నారు.

ఐఆర్‌డీఏఐ ఫిర్యాదుల పరిష్కార కేంద్రం

దిల్లీ: బీమా సంస్థలపై పాలసీదార్లు ఇచ్చే ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కరించే నిమిత్తం ఒక ‘ఫిర్యాదుల పరిష్కార కేంద్రాన్ని’ ఏర్పాటు చేయాలని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ నిర్ణయించింది. ఈ కేంద్ర నిర్వహణ బాధ్యతలను ఒక ఏజెన్సీకి అప్పగించాలన్నది ప్రణాళిక. పాలసీదార్లకు అవగాహన కల్పించడం కూడా ఈ కేంద్ర బాధ్యతే. ఇ మెయిల్‌, లేఖలు, టోల్‌ఫ్రీ నెంబరు ద్వారా ఫిర్యాదులు స్వీకరించడమే కాక, పరిష్కారం ఎక్కడి దాకా వచ్చిందో తెలియ చేయడం కూడా గ్రీవెన్స్‌ కాల్‌ సెంటర్‌ బాధ్యతే. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని నిర్వహించే సంస్థకు మూడేళ్ల కాలావధితో బాధ్యతలు అప్పగిస్తారు. వారంలో 6 రోజుల పాటు, రోజుకు 12 గంటల చొప్పున ఈ కేంద్రం పనిచేయాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని