ఎఫ్‌ఎంసీజీలో అగ్రస్థానమే లక్ష్యం

వేగంగా విక్రయమయ్యే వినియోగ ఉత్పత్తుల (ఎఫ్‌ఎంసీజీ) దేశీయ విపణిలో అగ్రగామిగా నిలవడమే పతంజలి గ్రూపు లక్ష్యమని వ్యవస్థాపకులు బాబా రామ్‌దేవ్‌ పేర్కొన్నారు. వంట నూనెలు, మరికొన్ని ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతూ, ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని మనదేశం కోల్పోతోందని, ఆయా విభాగాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని వివరించారు. ఏడాదిన్నర క్రితం పతంజలి గ్రూపు అజమాయిషీలోకి వచ్చిన రుచి సోయా ఇండస్ట్రీస్‌ను లాభాల్లోకి తెచ్చామని, దీన్ని

Published : 22 Jul 2021 04:08 IST

 ఆహారోత్పత్తులు, న్యూట్రాస్యూటికల్స్‌ ఆవిష్కరిస్తాం

త్వరలో రుచి సోయా రూ.4300 కోట్ల పబ్లిక్‌ ఇష్యూ

తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆయిల్‌ పామ్‌ సాగు

‘ఈనాడు’ ఇంటర్వ్యూ 

పతంజలి గ్రూపు వ్యవస్థాపకులు బాబా రామ్‌దేవ్‌

వేగంగా విక్రయమయ్యే వినియోగ ఉత్పత్తుల (ఎఫ్‌ఎంసీజీ) దేశీయ విపణిలో అగ్రగామిగా నిలవడమే పతంజలి గ్రూపు లక్ష్యమని వ్యవస్థాపకులు బాబా రామ్‌దేవ్‌ పేర్కొన్నారు. వంట నూనెలు, మరికొన్ని ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతూ, ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని మనదేశం కోల్పోతోందని, ఆయా విభాగాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని వివరించారు. ఏడాదిన్నర క్రితం పతంజలి గ్రూపు అజమాయిషీలోకి వచ్చిన రుచి సోయా ఇండస్ట్రీస్‌ను లాభాల్లోకి తెచ్చామని, దీన్ని రుణరహిత కంపెనీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో రుచి సోయా పబ్లిక్‌ ఇష్యూ ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయిల్‌ పామ్‌ను పెద్దఎత్తున సాగు చేస్తున్నామని, తమ విస్తరణ ప్రణాళికల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని ‘ఈనాడు’ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యాంశాలివీ..

* రుచి సోయా ఇండస్ట్రీస్‌ పూర్తిగా కోలుకున్నట్లేనా

ఈ కంపెనీ మా చేతికి వచ్చినప్పుడు 50 శాతం ‘కమొడిటీ’ వ్యాపారం, 50 శాతం ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల వాటా 80 శాతానికి పెరిగింది. ఈ కంపెనీని పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించాం. నిపుణులతో కూడిన యాజమాన్యం, బలమైన మార్కెటింగ్‌- పంపిణీ వ్యవస్థలు, కొత్త ఉత్పత్తుల శ్రేణి వల్ల కంపెనీ బాగా కోలుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.16,000 కోట్ల టర్నోవర్‌, రూ.1018 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇంకా విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

* పబ్లిక్‌ ఇష్యూకు సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకు

రుచి సోయాను మేం తీసుకున్నప్పుడు, ఎన్‌సీఎల్‌టీ (జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌) పెట్టిన నిబంధనల ప్రకారం ఈ కంపెనీలో యాజమాన్య వాటా తగ్గించుకోవాల్సి ఉంది. అందువల్ల పబ్లిక్‌ ఇష్యూ చేయాల్సిన అవసరం ఏర్పడింది. రుచి సోయా వృద్ధిలో భాగస్వాములయ్యే అవకాశం దేశీయ మదుపరులకు కల్పించాలనే ఆలోచనా దీని వెనుక ఉంది. రూ.4,300 కోట్ల పబ్లిక్‌ ఇష్యూ కోసం సెబీకి దరఖాస్తు చేశాం. కొద్ది రోజుల్లోనే అనుమతి రావచ్చు. ఇష్యూ ద్వారా సేకరించిన సొమ్ములో ఎక్కువ భాగాన్ని ఈ కంపెనీకి ఉన్న అప్పు తీర్చడానికి కేటాయిస్తాం. రుచి సోయా త్వరలోనే పూర్తి రుణ రహిత కంపెనీ అవుతుంది. ప్రస్తుతం దీనికి రూ.3,300 కోట్ల అప్పు ఉంది.

* ఆ తర్వాత పతంజలి ఆయుర్వేద ఐపీఓ కూడా ఉంటుందని అంటున్నారు

దానికి ఇంకా సమయం ఉంది. ఇప్పుడే కాదు.

* పతంజలి గ్రూపు టర్నోవర్‌, లాభాలు ఎలా ఉన్నాయి? మీరు నిర్దేశించుకున్న వ్యాపార లక్ష్యాలు ఏమిటి

గత ఆర్థిక సంవత్సరంలో రూ.30,000 కోట్ల టర్నోవర్‌ నమోదు చేశాం. ఇందులో పతంజలి గ్రూపు కంపెనీల వాటా రూ.14,000 కోట్లు కాగా, రుచి సోయా రూ.16,318 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది. ఇకపై ఉత్పత్తుల శ్రేణి, వ్యాపార కార్యకలాపాల స్థాయిని బాగా పెంచబోతున్నాం. వంట నూనెలు, వ్యవసాయ ఆధార ఉత్పత్తులు, హెర్బల్‌, వెల్‌నెస్‌ శ్రేణిలో ఎన్నో కొత్త ఉత్పత్తులు తీసుకువస్తాం. వంట నూనెల విభాగంలో ఎన్నో పోషక విలువలు గల ‘ఎక్‌స్ట్రా వెర్జిన్‌ పామ్‌ఆయిల్‌’ను త్వరలో ఆవిష్కరించబోతున్నాం. రిఫైన్డ్‌ నూనెలతో పోల్చితే ఇది ఎంతో మేలైనది. ఇంకా న్యూట్రాస్యూటికల్స్‌, బిస్కెట్లు, స్నాక్స్‌.. తదితర ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎఫ్‌ఎంసీజీ రంగంలో దేశంలో అగ్రస్థానాన్ని సాధించడమే మా లక్ష్యం. ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్న కంపెనీని అయిదేళ్లలో అధిగమిస్తాం.

* స్వల్పకాలంలోనే ఇంత పెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీని ఎలా నిర్మించగలిగారు

రోజూ 2 గంటలు యోగ, ఆ తర్వాత 14- 16 గంటల పాటు పని. నిరంతర శ్రమ, పట్టుదలతో ఏదైనా సాధ్యమవుతుంది. అదే మా విజయ రహస్యం.

* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సంబంధించి మీ కార్యకలాపాలు, భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉన్నాయి

ఎంతో ప్రగతిదాయక దృక్పథం కలిగిన రాష్ట్రాలు ఇవి. ఈ రాష్ట్రాల్లో పతంజలి గ్రూపు కార్యకలాపాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయిల్‌ పామ్‌ తోటలను 50,000 హెక్టార్లలో వేశాం. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం, పెద్దాపురం, కాకినాడ వద్ద అయిదు రిఫైనరీలు ఏర్పాటు చేశాం. ముడి పామోలిన్‌ కోసం మలేషియాపై ఆధారపడటాన్ని తగ్గించి, ఈ విభాగంలో స్వయం సమృద్ధి సాధించాలనేది మా ఉద్దేశం. ఏటా దాదాపు రూ.2 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ముడి పామోలిన్‌ కోసం మనదేశం ఖర్చు చేస్తోంది. ఈ పరిస్థితి మారాలి.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని