Cement Price: తెలుగు రాష్ట్రాల్లో సిమెంటు ప్రియం.. ఎంత పెరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో మంగళవారం నుంచి 50 కిలోల సిమెంట్‌ బస్తాపై రూ.20-30 మేర ధర పెంచుతున్నట్లు సిమెంట్‌ కంపెనీలు తెలిపాయని డీలర్లు పేర్కొన్నారు. గత 2 నెలలుగా సిమెంటు ధరల్లో ఒడుదొడుకులు నెలకొన్నాయి.

Updated : 10 Jan 2022 14:23 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో మంగళవారం నుంచి 50 కిలోల సిమెంట్‌ బస్తాపై రూ.20-30 మేర ధర పెంచుతున్నట్లు సిమెంట్‌ కంపెనీలు తెలిపాయని డీలర్లు పేర్కొన్నారు. గత 2 నెలలుగా సిమెంటు ధరల్లో ఒడుదొడుకులు నెలకొన్నాయి. అంతకుముందే ధర బాగా పెంచిన సిమెంటు కంపెనీలు, డిమాండ్‌ తగ్గడంతో డిసెంబరు తొలివారంలో 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు ధర తగ్గించాయి. డిసెంబరు మధ్య నుంచి మళ్లీ సిమెంటు విక్రయాలు పెరుగుతుండటం, ప్రైవేటు ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ మౌలిక సదుపాయాల విభాగం నుంచి గిరాకీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో తాజాగా కంపెనీలు ధర పెంచాయని డీలర్లు వెల్లడించారు. ధరల పెంపు తర్వాత రెండు రాష్ట్రాల్లో సిమెంట్‌ బస్తా ధర బ్రాండ్‌, ప్రాంతం ఆధారంగా రూ.300-350 మధ్యలో ఉంటుందని తెలిపారు. ధర పెంచిన సిమెంట్‌ కంపెనీల్లో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండియా సిమెంట్స్‌, సాగర్‌ సిమెంట్స్‌, రామ్‌కో సిమెంట్స్‌, ఓరియంట్‌ సిమెంట్‌, ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌, దాల్మియా భారత్‌, శ్రీ సిమెంట్‌, పెన్నా సిమెంట్స్‌ ఉన్నాయి.  

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సిమెంటు విక్రయాల పరిమాణం క్రమంగా పెరుగుతోందని, ప్రధానంగా ఏపీలో ప్రభుత్వం గృహ నిర్మాణ పథకానికి సంబంధించి సిమెంట్‌ కొనుగోలు చేస్తుండటం కలిసొస్తోందని విజయవాడకు చెందిన ఒక డీలర్‌ వెల్లడించారు. తెలంగాణలోనూ నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకోవడంతో విక్రయాల పరిమాణం పెరుగుతోందని హైదరాబాద్‌కు చెందిన సిమెంట్‌ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

కొవిడ్‌ ఒమిక్రాన్‌ కేసుల విస్తరణ ప్రభావం వల్ల నిర్మాణ రంగంలోనూ అనిశ్చితులు ఏర్పడుతున్న నేపథ్యంలో పెంచిన సిమెంట్‌ ధరలు ఎంతమేరకు నిలుస్తాయో వేచి చూడాలని డీలర్లు చెబుతున్నారు.

ధరల పెంపు కోసం గత శుక్రవారం నుంచే సిమెంటు కంపెనీలు డీలర్లకు సరఫరాలు ఆపేశాయి. బుధవారం నుంచి కొత్త ధరతో సరఫరా మొదలుపెట్టనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని