
ప్రయాణికుల వాహన ఎగుమతుల్లో 46% వృద్ధి
ఏప్రిల్-డిసెంబరులో మారుతీ సుజుకీ జోరు
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబరు మధ్య భారత్ నుంచి ప్రయాణికుల వాహన ఎగుమతులు 46 శాతం పెరిగి 4,24,037కు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో 2,91,170 వాహనాలు ఎగుమతి అయ్యాయి. పరిశ్రమ సంఘం సియామ్ గణాంకాల ప్రకారం.. ప్రయాణికుల కార్లు 45 శాతం పెరిగి 2,75,728కు, వినియోగ వాహనాలు 47 శాతం వృద్ధితో 1,46,688 ఎగుమతి అయ్యాయి. వ్యాన్‌ల ఎగుమతులు 877 నుంచి దాదాపు రెట్టింపై 1,621కు పెరిగాయి. కంపెనీల వారీగా చూస్తే 1.68 లక్షల వాహనాల ఎగుమతితో మారుతీ సుజుకీ ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా, కియా ఇండియా నిలిచాయి. మారుతీ ఎగుమతులు 59,821 నుంచి మూడింతలు పెరిగి 1,67,964కు చేరాయి. హ్యుందాయ్ ఎగుమతులు 35 శాతం పెరిగి 1,00,059 వాహనాలుగా నమోదయ్యాయి. కియా ఎగుమతులు 28,538 నుంచి 34,341కు పెరిగాయి.