ఒడుదొడుకులు తప్పవేమో!

ఈ వారం సూచీలకు ఒడుదొడుకులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే సూచీలు 5 శాతం వరకు పెరిగిన నేపథ్యంలో.. సానుకూల పరిణామాలున్నా, లాభాలు పరిమితంగా ఉండొచ్చని అంటున్నారు.

Published : 17 Jan 2022 01:52 IST

సానుకూలతలున్నా పరిమిత లాభాలే 

కంపెనీల ఆర్థిక ఫలితాలు కీలకం

కొవిడ్‌ కేసుల విస్తృతీ ముఖ్యమే

విశ్లేషకుల అంచనాలు

ఈ వారం సూచీలకు ఒడుదొడుకులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే సూచీలు 5 శాతం వరకు పెరిగిన నేపథ్యంలో.. సానుకూల పరిణామాలున్నా, లాభాలు పరిమితంగా ఉండొచ్చని అంటున్నారు. నిఫ్టీ 50 సూచీ ఈ వారం 18,000-18,400 పాయింట్ల శ్రేణిలో కదలాడొచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని దిగ్గజ కంపెనీలు అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక ఫలితాలు ఈ వారంలో వెల్లడించనున్నాయి. దీంతో షేరు ఆధారిత కదలికలు చోటు చేసుకోవచ్చు. కొవిడ్‌-19 కేసుల విస్తృతికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచీ మన మార్కెట్లు సంకేతాలు అందుకోవచ్చని అంటున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండటంతో ఎంపిక చేసిన షేర్లు, రంగాల్లో కదలికలు ఉండొచ్చని భావిస్తున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

* బడ్జెట్‌లో మౌలిక రంగ ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచే అవకాశం ఉన్నందున, యంత్రపరికరాల తయారీ కంపెనీల షేర్లు సానుకూలంగా కదలాడే అవకాశం ఉంది.

* వాహన షేర్లు ప్రధాన సూచీల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. షేరు ఆధారిత కదలికలు ఉండొచ్చు. బుధవారం బజాజ్‌ ఆటో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది.

* ఔషధ కంపెనీల షేర్లు స్వల్ప శ్రేణికి లోబడి కదలాడొచ్చు. సింజీన్‌ ఇంటర్నేషనల్‌, బయోకాన్‌, గ్లాండ్‌ ఫార్మా ఈ వారంలో ఫలితాలు వెల్లడించనున్నందున, వీటిపై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు.

* చమురు కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణిలో చలించవచ్చు. కీలక సూచీల నుంచి సంకేతాలు అందుకుంటాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరల ఆధారంగా అప్‌స్ట్రీమ్‌ కంపెనీలు కదలాడొచ్చు.

* బ్యాంకు షేర్లలో స్టాక్‌ ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. నిఫ్టీ బ్యాంక్‌లో అధిక వెయిటేజీ ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ త్రైమాసిక ఫలితాలు ప్రకటించినందున, దీని ఆధారంగా ఈ రంగ షేర్లు కదలాడొచ్చు.

* అల్ట్రాటెక్‌ సిమెంట్‌ సోమవారం ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో, దీని ఆధారంగా సిమెంటు కంపెనీల షేర్లు కదలాడవచ్చు. సమీప, మధ్య కాలానికి సిమెంట్‌కు గిరాకీ బాగుంటుందునే అంచనాల నడుమ, ఈ రంగ షేర్లకు సానుకూలతలు కనిపిస్తున్నాయి.

* మార్జిన్లపై ఒత్తిడి, పరిమాణ వృద్ధిపైనా ఆందోళనలతో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల షేర్లు ప్రతికూలంగా కదలాడొచ్చు. టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌, వరుణ్‌ బేవరేజెస్‌ వంటి షేర్లలో స్టాక్‌ ఆధారిత కదలికలు చోటు చేసుకోవచ్చు.

* ఐటీ కంపెనీల షేర్లలోనూ స్టాక్‌ ఆధారిత కదలికలు చోటు చేసుకోవచ్చు. ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌, పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌, ఎంఫసిస్‌ కంపెనీలు ఈ వారంలో ఫలితాలు ప్రకటించనున్నాయి.

* నవంబరులో మొబైల్‌ చందాదార్ల డేటాను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ప్రకటించనున్న నేపథ్యంలో దీని ఆధారంగా టెలికాం కంపెనీల షేర్లు కదలాడొచ్చు. నిధుల సమీకరణపై వొడాఫోన్‌ ఐడియా ప్రకటన ఆ షేరుకు కీలకం.

* అంతర్జాతీయ ధరల ఆధారంగా గనులు, లోహ కంపెనీల షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు. కంపెనీల ఫలితాలపైనా మదుపర్లు దృష్టి సారించొచ్చు.

స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని