
‘స్టాన్ ప్లస్’కు రూ.150 కోట్ల నిధులు
ఈనాడు, హైదరాబాద్: అత్యవసర వైద్య సేవల సంస్థ స్టాన్ ప్లస్ ‘సిరీస్- ఏ పెట్టుబడి’ లో భాగంగా 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ.150 కోట్లు) సమీకరించింది. ఇందులో కొంత మూలధన పెట్టుబడి కాగా మరికొంత సొమ్ము అప్పుగా లభించింది. అగ్రశ్రేణి పెట్టుబడి సంస్థలైన హెల్త్‌క్వాడ్, కలారి కేపిటల్, హెల్త్‌ఎక్స్ కేపిటల్ సింగపూర్, పెగసస్, సందీప్ సింఘాల్ (అవానా కేపిటల్), ప్రశాంత్ మాలిక్ తో పాటు మరికొందరు ఏంజెల్ ఇన్వెస్టర్లు ఈ నిధులు సమకూర్చారు. రుణ నిధులను ఎన్ ప్లస్ కేపిటల్ అందించింది. అంబులెన్స్‌లను అద్దెకు ఇచ్చే వ్యాపారం కోసం గ్రిప్ ఇన్వెస్ట్ అనే సంస్థ నుంచి 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.15 కోట్లు) లభించాయి. దేశీయంగా వైద్య సేవల రంగంలో ఇదే అతిపెద్ద పెట్టుబడి అని, ఈ నిధులతో దేశవ్యాప్తంగా 500 ఆస్పత్రులకు సేవలు అందించగలుగుతామని, 15 నగరాలకు ‘రెడ్ అంబులెన్స్’ బ్రాండెడ్ సేవలు విస్తరిస్తామని స్టాన్ ప్లస్ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రబ్‌దీప్ సింగ్ తెలిపారు.