ఎయిర్‌టెల్‌ లాభం రూ.2008 కోట్లు

గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం(జవనరి-మార్చి)లో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ ఏకీకృత నికర లాభం రూ.2,008 కోట్లకు చేరింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.759 కోట్లతో పోలిస్తే ఇది 164 శాతానికి పైగా అధికం.

Published : 18 May 2022 02:53 IST

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం(జవనరి-మార్చి)లో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ ఏకీకృత నికర లాభం రూ.2,008 కోట్లకు చేరింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.759 కోట్లతో పోలిస్తే ఇది 164 శాతానికి పైగా అధికం. వినియోగదారు సగటు ఆదాయం(ఆర్పు) పెరగడంతో పాటు టవర్ల విక్రయం తదితరాల కారణంగా వచ్చిన అసాధారణ లాభాలు ఇందుకు కారణం. ‘నాణ్యమైన వినియోగదార్లను జత చేసుకుని, వారికి అత్యుత్తమ సేవలు అందించడం.. మౌలిక, డిజిటల్‌ సామర్థ్యాల్లో భారీ పెట్టుబడుల ద్వారా భవిష్యత్‌ వ్యాపార నమూనాను బలోపేతం చేసుకోవడం.. బలమైన పాలనా మద్దతుతో పాటు ఆర్థిక స్థిరత్వం’తో భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకుంటామని సంస్థ సీఈఓ గోపాల్‌ విత్తల్‌ పేర్కొన్నారు.

రూ.178కి ఆర్పు: ఏడాది వ్యవధిలో వినియోగదారు సగటు ఆదాయం రూ.145 నుంచి రూ.178కి పెరిగింది. టారిఫ్‌ సవరణలకు తోడు 4జీ వినియోగదార్లు పెరగడం వల్ల ఇది సాధ్యమైందని కంపెనీ తెలిపింది. డిసెంబరు త్రైమాసిక ఆర్పు రూ.163తో పోల్చినా ఇది ఎక్కువే.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి: 2021-22 ఆర్థిక సంవత్సరంలో సునీల్‌ మిత్తల్‌కు చెందిన ఈ కంపెనీ నికర లాభం రూ.4,255 కోట్లుగా నమోదైంది. 2020-21లో రూ.15,084 కోట్ల నష్టాన్ని సంస్థ ప్రకటించింది. ఆదాయం రూ.1,00,616 కోట్ల నుంచి 16% వృద్ధితో రూ.1,16,547కు చేరింది. 2.15 కోట్ల 4జీ వినియోగదార్లు జతయ్యారు. ఏడాది కిందటితో పోలిస్తే 12% వృద్ధి కనపడింది.

డివిడెండు: 2015లో స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు సంబంధించి ఉన్న బకాయిల్లో రూ.8,815 కోట్లను చెల్లించినట్లు ఎయిర్‌టెల్‌ పేర్కొంది. 2021-22 ఏడాదికి బోర్డు రూ.5 ముఖ విలువ గల ఫుల్లీ పెయిడప్‌ షేరుపై రూ.3; రూ.5 ముఖ విలువ గల పార్ట్లీ పెయిడప్‌ షేరుపై రూ.0.75 డివిడెండును ప్రకటించింది. కేబినెట్‌ మాజీ కార్యదర్శి పీకే సిన్హా, పీడబ్ల్యూసీ ఇండియా మాజీ అధిపతి శ్యామల్‌ ముఖర్జీలను స్వతంత్ర డైరెక్టర్లుగా బోర్డులో నియమించినట్లు కంపెనీ ప్రకటించింది.

బీఎస్‌ఈలో మంగళవారం ఎయిర్‌టెల్‌ షేరు 2.13 శాతం లాభంతో రూ.707.5 వద్ద స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని