చిన్న కారణాలతో క్లెయింలు తిరస్కరిస్తున్నాయి

బీమా సంస్థలు చిన్న కారణాలతో క్లెయింలను నిరాకరిస్తున్నాయని, పాలసీదారుడు కొన్ని పత్రాలను అందించలేని అనివార్య పరిస్థితుల్లోనూ మరీ సాంకేతికంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది.

Published : 21 May 2022 02:37 IST

బీమా సంస్థల తీరుపై సుప్రీంకోర్టు

దిల్లీ: బీమా సంస్థలు చిన్న కారణాలతో క్లెయింలను నిరాకరిస్తున్నాయని, పాలసీదారుడు కొన్ని పత్రాలను అందించలేని అనివార్య పరిస్థితుల్లోనూ మరీ సాంకేతికంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. 2013లో దొంగతనానికి గురైన ఒక ట్రక్‌కు సంబంధించిన కేసులో జాతీయ వినియోగదారుల కమిషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ) గత ఆగస్టులో ఇచ్చిన తీర్పు విషయంలో అప్పీలును అనుమతిస్తూ ఉన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అప్పీలుదారుడైన ట్రక్కు యజమాని దాఖలు చేసిన క్లెయింను బీమా కంపెనీ చిన్న కారణాలతో నిరాకరించడంతో పాటు మరీ సాంకేతికంగా వ్యవహరించిందని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ట్రక్కు దొంగతనం జరిగినప్పుడు దాని అసలు రిజిస్ట్రేషన్‌ పత్రం (ఆర్‌సీ) కూడా పోయింది. దీనికి బదులుగా అతను దానికి సంబంధించిన ఫొటో కాపీతో పాటు, ఆర్‌టీఓ నుంచి రిజిస్ట్రేషన్‌ వివరాలు అందించారు. అయినప్పటికీ అసలు ఆర్‌సీ లేదా దాని డూప్లికేట్‌ సర్టిఫికెట్‌ కాపీని అందించకపోవడం వల్ల క్లెయింను బీమా సంస్థ తిరస్కరించిందని కోర్టు పేర్కొంది. ఆ వ్యక్తికి సాధ్యం కాని పత్రాలను బీమా సంస్థ అడిగినట్లు గుర్తించింది. బీమా పాలసీ అమల్లో ఉండి, ట్రక్కు దొంగతనానికి గురైనప్పుడు.. బీమా సంస్థ మరీ సాంకేతికంగా మారకూడదని, డూప్లికేట్‌ ఆర్‌సీని సమర్పించనంత మాత్రాన క్లెయింను తిరస్కరించకూడదని పేర్కొంది. పై కేసులో ట్రక్కు యజమానికి అనుకూలంగా తీర్పునిస్తూ.. బీమా సంస్థ రూ.12 లక్షల పరిహారాన్ని 7% వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని