Published : 23 May 2022 02:33 IST

ఈ వారమూ ఊగిసలాటలే

అంతర్జాతీయ మందగమనంపై ఆందోళనలు
పెట్రోలు, డీజిల్‌పై సుంకం తగ్గింపు ప్రభావం
ఫలితాలు, డెరివేటివ్‌ గడువు ముగింపుపైనా చూపు
విశ్లేషకుల అంచనాలు
స్టాక్‌ మార్కెట్‌
ఈ వారం

అంతర్జాతీయ ఆర్థిక మందగమనానికి అవకాశాలు ఉన్నాయన్న వార్తల మధ్య మన సూచీలు ఊగిసలాటలను కొనసాగించొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మే 3-4న జరిగిన ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌ఓఎమ్‌సీ) సమావేశం వివరాలు బుధవారం వెలువడనున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, భవిష్యత్‌లో రేట్ల పెంపుపై కమిటీ అభిప్రాయాలను మదుపర్లు సునిశితంగా పరిశీలించొచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  దేశీయ డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపులు ఊగిసలాటకు కారణంగా నిలవవచ్చు. దేశీయంగా పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో.. మార్కెట్‌పై ఆ ప్రభావం కనిపించవచ్చు. అదానీ పోర్ట్స్‌, దివీస్‌ లేబొరేటరీస్‌, గ్రాసిమ్‌, హిందాల్కో, జొమాటో, ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఇ-కామర్స్‌(నైకా), గెయిల్‌ ఇండియాలు ఈ వారమే ఫలితాలను వెలువరచనున్నాయి. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

* ఫార్మా షేర్లు రాణించవచ్చు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు పెరుగుతుండడంతో మదుపర్లు రక్షణాత్మక రంగ షేర్ల వైపు దృష్టి సారించొచ్చు. అయితే పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు ప్రభావం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది.
* యంత్ర పరికరాల షేర్లు మార్కెట్‌తో పాటే కదలాడవచ్చు. కంపెనీల ఫలితాలు, స్థూల ఆర్థిక అంశాల నుంచి దృష్టి మళ్లుతుండడం ఇందుకు నేపథ్యం. కొత్త ఆర్డర్లు, ప్రస్తుత ఆర్డర్ల అమలుపై మదుపర్లు దృష్టి సారించొచ్చు.
* కమొడిటీ ధరలపై ప్రభావం చూపే అంతర్జాతీయ అంశాల నుంచి లోహ షేర్లు సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు. కొంత మేర స్థిరీకరణను కొట్టిపారేయలేమని విశ్లేషకులు అంటున్నారు. స్వల్పకాలంలో పుంజుకోవచ్చు కానీ భారీ లాభాలు రాకపోవచ్చని  అంచనా వేస్తున్నారు.
* ఇప్పటికే చాలా బ్యాంకులు ఫలితాలను ప్రకటించినందున ఈ రంగ షేర్లు ఒక శ్రేణిలో కదలాడవచ్చు.
* ధరల ఒత్తిడి నేపథ్యంలో గిరాకీ స్తబ్దుగా ఉండడంతో సిమెంటు షేర్లు బలహీనంగా కదలాడవచ్చు. ధరలను పెంచాలని కంపెనీలు భావించినా.. గిరాకీ లేక అది జరగలేదు. అదానీ-హోల్సిమ్‌ ఒప్పందాన్ని సునిశితంగా గమనించొచ్చు.  
* టెలికాం షేర్లు ఊగిసలాటలకు గురికావొచ్చు. కంపెనీలో తన వాటా విషయాన్ని ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉన్నందున వొడాఫోన్‌ ఐడియా షేర్లు వెలుగులోకి రావొచ్చు.
* పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో చమురు షేర్లపై ప్రభావం కనిపించవచ్చు. బీపీసీఎల్‌(బుధ), ఆయిల్‌ ఇండియా(శుక్ర)ల ఆర్థిక ఫలితాలు కీలకం కానున్నాయి.
*  వాహన కంపెనీల షేర్లు రాణించొచ్చు. పరపతి విధాన కఠినత్వం కొనసాగొచ్చన్న భయాల వల్ల మదుపర్లు సరైన విలువ గల షేర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. .
* ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు సానుకూలంగా కొనసాగొచ్చు. ఊగిసలాటల మార్కెట్లో రక్షణాత్మక రంగాల వైపు మదుపర్లు దృష్టి సారిస్తుండడమే ఇందుకు కారణం.
*  ఐటీ షేర్లలో విక్రయాల ఒత్తిడి కొనసాగొచ్చు. ఆదాయాల వృద్ధి తగ్గొచ్చన్న అంచనాల మధ్య సెంటిమెంటు బలహీనపడుతుండడం ఇందుకు నేపథ్యం.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని